శ్రీశైలం హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు
ABN , Publish Date - Nov 27 , 2026 | 12:16 AM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకల హుండీ ఆదాయం రూ.4.47కోట్లు వచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు తెలిపారు.
31 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలు
శ్రీశైలం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకల హుండీ ఆదాయం రూ.4.47కోట్లు వచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు తెలిపారు. గురువారం ఉభయ దేవాలయాలు, పరివార దేవతల ఆలయాలకు సంబంధించిన హుండీని లెక్కించారు. ఈవో, చైర్మన్ మాట్లాడుతూ 31 రోజులుగా భక్తుల నుంచి స్వామి, అమ్మవార్లకు సమర్పించిన నగదు రూ.4,47,85,335తో పాటు 85.900 గ్రాముల బంగారం, 2 కేజీల 980 గ్రాముల వెండి వస్తువులు లభించాయన్నారు. స్వామిఅమ్మవార్లకు 722 యుఎ్‌సఏ, 95 ఆస్ట్రేలియా, 25 కెనడా, 10 న్యూజిల్యాండ్, 10 సింగపూర్ డాలర్లు, 270 యూఏఈ దీర్హమ్స్, 30 ఇంగ్లాండ్ పౌండ్స్, 60 యూరోస్, 62 మలేషియా రింగిట్స్, 300 సౌదీ అరేబియా రియాల్స్, 1 కువైట్ దినార్, 2 ఖతార్ రియాల్స్ మొదలగు విదేశీ కరెన్సీని భక్తులు సమర్పించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవో, చైర్మన్, డిప్యూటీ ఈవో చంద్రశేఖర్, ఆలయ ప్రధాన విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.