Share News

ఉగాది ఉత్సవాలకు శ్రీగిరి సిద్ధం

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:26 AM

ద్వాదశ జ్యోతిర్లింగం.. శక్తిపీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో సోమవారం నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఉగాది ఉత్సవాలకు శ్రీగిరి సిద్ధం
విద్యుద్దీపాలంకరణలో ఆలయం

శ్రీశైల మల్లన్న క్షేత్రంలో నేటి నుంచి వేడుకలు

యాగశాల ప్రవేశంతో ఆరంభం

అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు

శ్రీశైలం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ద్వాదశ జ్యోతిర్లింగం.. శక్తిపీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో సోమవారం నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభమై 20వ తేది వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు, విశేష అలంకరణలు, వాహన సేవలు, నిర్వహిస్తారు.

వాహన సేవలు, అలంకరణలు

16వ తేదీన భృంగివాహన సేవ, మహాలక్ష్మి అలంకారం.

17న కైలాస వాహనసేవ, మహాదుర్గా అలంకారం.

18న ప్రభోత్సవం, నందివాహనసేవ, వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం మహా సరస్వతి అలంకారం.

19న ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం, రథోత్సవం, రమావాణి సహిత రాజరాజేశ్వరి అలంకారం.

20న పూర్ణాహుతి, అశ్వవాహన సేవ, భ్రమరాంబదేవి నిజరూప అలంకారం, ఆలయోత్సవం.

నేటి కార్యక్రమాలు

సోమవారం ఉదయం 7:15 గంటలకు యాగశాల ప్రవేశం, శివసంకల్పం, గణపతిపూజ, కంకణపూజ, చండీశ్వరపూజ, కంకణధారణ, రుత్విగ్వరణం, దీక్షా కంకణధారణ, స్వస్తి, పున్యఃవచనం, అఖండ దీపారాధన, మండపారాధన, పంచావరణార్చన, కలశార్చన, జపానుష్టానాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. సాయంత్రం అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన, నిత్యఉపాంగ హవనాలు, రుద్రహోమం, భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం నిర్వహించనున్నారు. స్వామి, అమ్మవార్లకు భృంగివాహన సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. గ్రామోత్సవం తరువాత కల్యాణోత్సవం, ఏకాంతసేవలను జరిపించనున్నారు. మహోత్సవాలు జరిగే ఐదురోజుల పాటు గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేసి అందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

భక్తుల రద్దీ

శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. క్యూలైనట్లు, కంపార్టుమెంట్లలో భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంలో ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Mar 16 , 2026 | 12:26 AM