మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:00 AM
కక్షిదారులు తమ వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయిస్తే సత్వర న్యాయం పొందవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి తెలియజేశారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి
కర్నూలు లీగల్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కక్షిదారులు తమ వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయిస్తే సత్వర న్యాయం పొందవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి తెలియజేశారు. సోమవారం స్థానిక న్యాయ సేవాసదన్ భవన్‌లో న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టులు, కింది కోర్టులలో మధ్యవర్తిత్వాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 40 గంటల పాటు న్యాయవాదులకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం నుంచి ఈ నెల 23 వరకు శిక్షణ ఇస్తారని తెలిపారు. చెన్నైకి చెందిన ఆర్. రత్నతార, జి. శశిదేవి ఈ శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ మధ్యవర్తిత్వంపై న్యాయవాదులు అవగాహన పెంచుకుని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసిజర్ కోడ్‌లోని సెక్షన్ 89ను పాటించడమే మధ్యవర్తిత్వమని ఆయన తెలిపారు. ఈ ఈ శిక్షణ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు న్యాయవాదులు, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎం. వెంకట హరినాథ్, కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి పాల్గొన్నారు.