కేజీబీవీల్లో ‘విజయ పథం’
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:21 AM
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏటా కోట్లాది రూపాయలు వ్యయం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేజీబీవీ (కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు)లో విద్యార్థులకు చదువు నేర్పిస్తున్నారు
ఇంటర్‌లో మెరుగైన ఉత్తీర్ణతే లక్ష్యం..
రోజు స్టడీ అవర్స్.. పరీక్షలు
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పర్యవేక్షణ
చాగలమర్రి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏటా కోట్లాది రూపాయలు వ్యయం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేజీబీవీ (కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు)లో విద్యార్థులకు చదువు నేర్పిస్తున్నారు. ప్రస్తుతం కేజీబీవీలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక్కడ చదువుకునే ప్రతి విద్యార్థిని ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం ‘విజయ పథం’ పేరుతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది.
సమగ్ర శిక్ష యంత్రాంగం కసరత్తు
జిల్లాలో 27 కేజీబీవీ పాఠశాలలు, కళాశాలలున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 1,551 మంది విద్యార్థినులు పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ప్రతి విద్యార్థిని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి సమగ్ర శిక్ష యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందుకు విజయపథం పేరుతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు.
ప్రణాళిక ఇలా..
ప్రతి రోజు ఉదయం 5.30 గంటల నుంచి 7గంటల వరకు, సాయంత్రం 7.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు స్టడీ అవర్స్
బోధించిన పాఠశాలపై నిత్యం పరీక్షల నిర్వహణ. పరీక్షల్లో మార్కుల ఆధారంగా ఏ విద్యార్థిని ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉందో గుర్తించడం. ఆ సబ్జెక్టు పాఠ్యాంశాల్లో మెలకువలు నేర్పించడం.
ఉత్తమ మార్కులే లక్ష్యం
కేజీబీవీలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థిని ఉత్తీర్ణతతో పాటు అత్యుత్తమ మార్కులు సాధించాలి. అదే లక్ష్యంతో జిల్లాలో ‘విజయ పథం ’ ప్రణాళిక అమలు చేయిస్తున్నాం. విద్యార్థినులు ఈ కొద్ది రోజులు కష్టపడి చదివితే ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించొచ్చు. - సువర్చల, జీసీడీవో, నంద్యాల
ఆ ప్రణాళిక బాగుంది
పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ‘విజయ పథం’ ఉపయోగకరంగా ఉంది. వెనుకబడిన విద్యార్థినుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షలంటే భయం అనేది లేకుండా తీర్చిదిద్దుతున్నారు. ఈ సారి మంచి మార్కులు సాధిస్తాం. - స్రవంతి, ఇంటర్ విద్యార్థిని
సామర్థ్యాలను గుర్తించొచ్చు
ఇంటర్ విద్యార్థినులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలనే ఆశయంతో చదువులు చెబుతున్నాం. ప్రత్యేక ప్రణాళికతో వెనుకబడిన సబ్జెక్టులలో మెలకువలు నేర్పించి ముందుకు తీసుకుపోగలుగుతాం. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. - అమీర్‌బీ, కెమిస్ట్రీ లెక్చరర్
పక్కాగా ప్రణాళిక అమలు
ఎస్‌ఎ్‌సఏ అధికారుల ఆదేశాల మేరకు ‘విజయ పథం’ పక్కాగా అమలు చేస్తున్నాం. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఉత్తమ మార్కుల సాధన కోసం చదివిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నాం. - స్వప్న, ప్రిన్సిపాల్, కస్తూర్బా, చాగలమర్రి