Share News

ప్రత్యేక టెట్‌

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:25 PM

అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలో పని చేస్తున్న సర్వీసు ఉపాధ్యాయులకు ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల కావడంతో టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ప్రత్యేక టెట్‌

సర్వీసు ఉపాధ్యాయుల కోసం

జిల్లాలో టెట్‌ రాయాల్సింది 3వేల మంది

ఆందోళనలో ఉపాధ్యాయులు

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలో పని చేస్తున్న సర్వీసు ఉపాధ్యాయులకు ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల కావడంతో టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ నుంచి ఉపాధ్యాయులు టెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. సుదీర్ఘ కాలం టీచర్‌గా ఉద్యోగం చేసినప్పటికీ తప్పనిసరిగా టెట్‌ అర్హత సాధించాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించింది. స్పెషల్‌ టెట్‌కు సంబంధించిన నిబంధనలను మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ టెట్‌కు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు.

టెట్‌ షెడ్యూల్‌ వివరాలు

సెప్టెంబరు 9వ తేదీ వరకు ఫీజు చెల్లించి ఉపాధ్యాయులు దరఖాస్తులు సమర్పించాలి

అక్టోబరు 5 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌ లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు

అక్టోబరు 11 నుంచి 21 వరకు స్పెషల్‌ టెట్‌ పరీక్షలు కొనసాగనున్నాయి.

నవంబరు 10న తుది కీ ప్రకటిస్తారు. అదే నెల 15న తుది పలితాలను ప్రకటించనున్నారు. ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులు అంతా తప్పనిసరిగా టెట్‌ పరీక్ష అర్హత సాధించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ టెస్టును నిర్వహిస్తుంది. ప్రభుత్వం అన్ని యాజమాన్య పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులతో పాటు మినిమం టైం స్కేల్‌పై పని చేస్తున్న ఉపాధ్యాయులు టెట్‌ పరీక్ష రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు.

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు విధానంలో 150 మార్కులకు టెట్‌ ఉంటుంది.

ఓసీ, ఈడబ్ల్యూఎస్‌ ఉపాధ్యాయులకు 60 శాతం (90) మార్కులు, బీసీ ఉపాధ్యాయులకు 50 శాతం (75 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఇన్‌ సర్వీ స్‌మెన్‌ ఉపాధ్యాయులకు 40 శాతం (60 మార్కులు) ఉత్తీర్ణతగా నిర్ణయించారు.

కర్నూలు జిల్లాలో 3వేల మంది టీచర్లకు టెట్‌ భయం

కర్నూలు జిల్లాలో మొత్తం 10,500 మంది ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ఎస్‌జీటీలు 4,500 మంది, 5,700 మంది స్కూల్‌ అసిస్టెంట్లు వివిధ కేటగిరీలో పని చేస్తున్నారు. అలాగే 304 మంది ప్రధానోపాధ్యాయులు పని చేస్తున్నారు. 2010 డీఎస్సీ కంటే ముందే ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఉపాధ్యాయులందరూ టెట్‌ రాయాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో 3వేల మంది ఉపాధ్యాయులు స్పెషల్‌ టెట్‌ పరీక్షలు అర్హత మార్కులు సాధించాల్సి ఉంది. టెట్‌ మార్కులలోనూ, సిలబ్‌సలోనూ మార్పులు చేయాలని ఆన్‌లైన్‌ బేస్డ్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌ విధానంలో టెట్‌ పరీక్ష నిర్వహించాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.

టెట్‌ను రద్దు చేయాలి

30 సంవత్సరాల పాటు సర్వీసు అందించిన ఉపాధ్యాయుల కు మళ్లీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని గట్టుకుని ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. స్పెషల్‌ టెట్‌లో 40 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించాలి. 2010 కంటే ముందే ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు టెట్‌ను రద్దు చేయాలి. టెట్‌ పరీక్షను ఏ సిలబస్‌ సబ్జెక్టు టీచర్లకు ఆ సబ్జెక్టు ప్రశ్నలతోనే టెట్‌ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని రూపొందించాలి.

- కరె కృష్ణ, డీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు

ఉపాధ్యాయులందరికీ ఒకే అర్హత మార్కులు పెట్టాలి

స్పెషల్‌ టెట్‌లో ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులందరికీ ఒకే అర్హత మార్కులు నిర్వహించాలి. టెట్‌ పరీక్ష ఆఫ్‌ లైన్‌లో నిర్వహించాలి. ఏయే సబ్జెక్టు టీచరుకు ఆ సబ్జెక్టులోని సిలబస్‌ ప్రశ్నలతో టెట్‌ నిర్వహించాలి. టెట్‌ అర్హత మార్కులు 40 శాతంగా నిర్ణయించాలి.

-ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు, ఎస్‌.ఇస్మాయిల్‌

Updated Date - Aug 31 , 2026 | 11:25 PM