పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:24 AM
పర్యావరణంపై పరిశ్రమలు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు.
పిన్నాపురంలో ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ
పాణ్యం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పర్యావరణంపై పరిశ్రమలు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. మండలంలోని పిన్నాపురంలో ఏపి కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో గ్రీన్‌కో సంస్థ నిర్వహించిన పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం ముగిసింది. ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పిన్నాపురంలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1200 మెగావాట్ల నుంచి 1680 మెగావాట్ల వరకు పెంచడానికి సమీప గ్రామస్థుల నుంచి అభిప్రాయాలు కోరినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపుకు అవసరమైన వనరులను పర్యావరణానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా దేశంలో 500ల గెగావాట్ల విద్యుత్ అవసరమన్నారు. జిల్లాలో ఎనిమిది సిమెంటు పరిశ్రమలు ఉన్నాయన్నారు. వీటి ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. పిన్నాపురంలో ఉద్యాన వన శాఖ అభివృద్ధికి అవసరమైన వనరులు ఉన్నాయని వాటికోసం ప్రభుత్వం, గ్రీన్‌కో పరిశ్రమ కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామస్థుల అభిప్రాయాలు సేకరించారు. కాగా ఈ కార్యక్రమంలో పలువురు పర్యావరణ వేత్తలు తమ అభిప్రాయాలను తెలిపారు. సోలార్ పరిశ్రమతో రేడియేషన్ పెరిగి వాతావరణం కాలుష్యం అవుతోందన్నారు. ఇందుకు అనుగుణంగా గ్రీన్‌కో అవసరమైన చెట్టపెంపక విస్తీర్ణాన్ని మరింత పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేసీ సూరజ్ ధనుంజయ్ కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఇంజనీరు రమేశ్, కిశోర్‌రెడ్డి, గ్రీన్‌కో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీపీడీ ఏఎ్‌సనాయుడు, పాణ్యం తహసీల్దారు ప్రవీణ్‌కుమార్, సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, పర్యావరణ వేత్తలు, పిన్నాపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.