ఆరు మండలాలకు చోటు
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:27 AM
ప్రభుత్వం ప్రకటించిన రెండో విడత కరువు జాబితాలో జిల్లాలోని ఆరు మండలాలకు చోటు దక్కింది.
రెండో విడత కరువు జాబితా ప్రకటించిన ప్రభుత్వం
మరో 6 మండలాలకు దక్కని స్థానం
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రకటించిన రెండో విడత కరువు జాబితాలో జిల్లాలోని ఆరు మండలాలకు చోటు దక్కింది. నందవరం, మంత్రాలయం, కోసిగి, ఆదోని-2, కల్లూరు, ఆస్పరి మండలాలను కరువు జాబితాలో చేర్చారు. ఆమండలాల రైతులు తమకు పంటల బీమా అందుతుందని ఆశిస్తున్నారు. ఖరీ్‌ఫలో జిల్లాలోని మొత్తం 27మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలు ఎండిపోయాయి. కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. గతనెల ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. కేవలం 15 మండలాలకు మాత్రమే చోటు కల్పించింది. మిగిలిన 12మండలాలను చేర్చలేదు. గోనెగండ్ల, ఎమ్మిగనూరు, నందవరం, మం త్రాలయం, కౌతాళం, కోసిగి, సి. బెళగల్, ఆదోని కల్లూరు, పెద్దకడుబూరు, దేవనకొండ, ఆస్పరి మండలాల్లో ఆగస్టు వరకు కురిసిన వర్షపాతంతో పాటు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని అక్కడ పంటలు బాగున్నాయని కరువు జాబితాలో చేర్చలేదు. ఆయా మండలాల్లో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు శనివారం రాష్ట్ర ప్రభుత్వం కరువు జాబితాలో కేవలం ఆరు మండలాలకు మాత్రమే చోటు కల్పించంతో మిగిలిన ఆరు మండలాల్లో రైతులకు తీవ్ర నిరాశనే మిగిలింది.