పట్టాదారుల పాట్లు
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:37 PM
ఆధునిక యుగంలోనూ అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో అంతులేని ఆలస్యం ఆన్నదాత ఆకలి కేకలకు సంకేతంగా మారింది.
ప్రకటనల్లో వేగం.. పంపిణీలో జాప్యం..
రెవెన్యూ అధికారులకు పట్టని కష్టజీవులు
సంక్షేమం అందాలంటే పట్టాదారు పాసు పుస్తకం తప్పనిసరి
ప్రతి నెల.. ప్రతి మండలంలో ఒక గ్రామంలోనే పంపిణీ
రేపు కలుగొట్లలో సీఎం చంద్రబాబు
రైతులకు పంపిణీ చేయనున్న పాసు పుస్తకాలు
ఆధునిక యుగంలోనూ అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో అంతులేని ఆలస్యం ఆన్నదాత ఆకలి కేకలకు సంకేతంగా మారింది. అన్నదాత సుఖీభవ వంటి ఆర్థిక సంక్షేమ పథకాలు అందాలంటే ఆ పుస్తకమే ఆధారం. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని చెబుతున్నా.. పట్టా కోసం కష్టజీవులు నెలలు.. ఏళ్లు నిరీక్షించాలా? రికార్డుల చిక్కుముడులు వీడేది ఎప్పుడు? పంపిణీలో ఆలస్యం ఎవరికి లాభం? ఇవి సమాధానం లేని ప్రశ్నలు. ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు వచ్చే సమస్యల్లో ముప్పాతిక భూ, రెవెన్యూ సమస్యలే. ప్రకటనల్లో చూపుతున్న వేగం.. క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. రేపు ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్న సందర్భంగా జిల్లాలో పట్టాదారు పాసు పుస్తకాలు అందక, రీ-సర్వే చిక్కుముడులు వీడక రైతులు పడుతున్న పాట్లపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 472 రెవెన్యూ గ్రామాల పరిధిలో 15 లక్షల ఎకరాల భూములున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో మూడు విడతల్లో 252 గ్రామాల్లో సుమారు 2.25లక్షల ఎకరాల్లో రీ-సర్వే చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలుత ప్రతి మండలంలో ఒక రెవెన్యూ గ్రామం ఎంపిక చేసి రీ-సర్వే చేశారు. ఆ తరువాత ఒక్కో గ్రామంలో రీ-సర్వే చేస్తూ వెళ్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. సర్వే. రికార్డుల్లో మాయాజాలం ఏమిటో అధికారులకే ఎరుక. నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతకాకపోయినా.. ఇప్పటికే రీ సర్వే వల్ల భూ విస్తీర్ణంలో తప్పులు దొర్లడంతో వాటిని సరి చేసుకోవడానికి రైతులు పడుతున్న అవస్థలు ఎన్నో.
రీసర్వేలో భూ విస్తీర్ణం తారుమారు..
ఎమ్మిగనూరు మండలం మల్కాపురంలో ఒక రైతుకు ఐదెకరాలు, మరో రైతుకు ఏడెకరాల భూమి ఉంది. రీ సర్వేలో భూ విస్తీర్ణం తారుమారు అయ్యాయి. ఏడెకరాల రైతుకు ఐదు ఎకరాలు చూపడంతో భయంతో తహసీల్దారు కార్యాలయానికి వెళితే.. ఎక్కువ భూమి నమోదైన రైతుతో అభ్యంతరం లేదని రాయించుకొని రమ్మం టూ ఉచిత సలహా ఇచ్చారు. తప్పు చేసింది అధికారులు.. సరి చేసుకోవడానికి రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మెజార్టీ గ్రామాల్లో ఇలాంటి సమస్యలే ఉన్నాయి. బ్యాంకుల్లో అప్పు పుట్టాలన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రైతు సంక్షేమ పథకాలు అందలన్నా పట్టాదారు పాసు పుస్తకం ఎంతో కీలకం. ఆపస్తుకాల కోసం రైతులకు నెలలు.. ఏళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రతి నెల.. ప్రతి మండలంలో ఒక గ్రామంలో పూర్తిస్థాయిలో పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని మండల తహసీల్దార్లు పేర్కొంటున్నారు. పూర్తిస్థాయిలో పుస్తకాలు అందాలంటే ఎన్ని నెలలు నిరీక్షించాలి..?
కలుగొట్లలో ఇదీ పరిస్థితి
ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల రెవెన్యూలో శుక్రవారం సీఎం చంద్రబాబు రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ గ్రామంలో వంద శాతం రైతులకు పాసు పుస్తకాలు ఇస్తున్నారా? అంటే అదీలేదు. ఇక్కడ కూడా రీ-సర్వే వల్ల తలెత్తిన వివిధ సమస్యలుతో 280మంది రైతులు పట్టా పుస్తకాలు అందుకోలేకపోతున్నారు. ఈపల్లెలో రీ-సర్వే తరువాత 4,963.51 ఎకరాల భూమి ఉన్నట్లు తేల్చారు. అందులో పట్టా భూమి 4,201.85 ఎకరాలు, ప్రభుత్వ భూమి 734.34 ఎకరాలు, ఇనామ్ భూమి 131.65 ఎకరాలు ఉంది. భూ యాజమాన్యం హక్కు కలిగిన రైతులు 2,071 మంది ఉన్నారు.ఎలాంటి సమస్య లేని రైతులు 1,791 ఉంటే వారికి సీఎం పాసు పుస్తకాలు అందజేయనున్నారు. 280 మంది రైతులకు చెందిన సాగు భూముల్లో వివిధ సమస్యలు వల్ల పట్టాలు సిద్ధం చేయలేదు. అందులో 93 మంది రైతుల సమస్యలు పరిష్కరించినా పాసు పుస్తకాలు ముద్రించలేదు. 187 మంది రైతులకు పట్టా పుస్తకం కోసం నిరీక్షణ తప్పడం లేదు. సీఎం చంద్రబాబు పుస్తకాలు పంపిణీ చేస్తున్న గ్రామంలోనే ఈ పరిస్థితి ఉంటే.. మిగిలిన గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో ఇట్టే తెలుస్తుంది.
రాజముద్రతో పాసు పుస్తకాల పంపిణీ
రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాల పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపుగా లక్షల పాసు పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కల్లూరు, ఓర్వకల్లు మండలాలు మినహా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రీ-సర్వే చేసిన గ్రామాల్లో సుమారుగా 84,368 పాసు పుస్తకాలు మాత్రమే పంపిణీ చేశారు. 1.08 లక్షల మంది రైతులు హక్కు పుస్తకాల కోసం నిరీక్షిస్తున్నారు.ప్రతి నెల మండలంలో ఒక గ్రామంలో పూర్తిస్థాయిలో పుస్తకాలు పంపిణీ చేస్తామని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఆదోని మండలంలో 46 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 29 గ్రామాల్లో రీ-సర్వే చేశారు. ఇప్పటివరకు ఏడు వేలు పాసు పుస్తకాలు జారీ చేశారు. ఇవ్వాల్సిన పాసు పస్తుకాలు 15వేలు పైమాటే. నెలకు ఒక గ్రామం చొప్పున ఇస్తే.. చివరి గ్రామం రైతులు కీలకమైన పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఎన్నాళ్లు నిరీక్షించాలి...? ప్రతి మండలంలోనూ ఇదే పరిస్థితి ఉంది.
మండల రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు నియోజకవర్గాల వారీగా రీ-సర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వివరాలు (సుమారుగా)
నియోజకవర్గం రెవెన్యూ రీ-సర్వే మొత్తం పట్టాదారు పంపిణీ చేసిన రైతులకు ఇవ్వాల్సిన
గ్రామాలు గ్రామాలు పాసు పుస్తకాలు పుస్తకాలు పాసు పుస్తకాలు
ఆలూరు 111 48 37,289 11,771 25,518
మంత్రాలయ 101 60 24,549 22.279 2,270
కోడుమూరు 51 33 34,605 10,708 23,897
ఎమ్మిగనూరు 55 36 41,463 25,564 155,919
పత్తికొండ 44 15 32,566 7,066 25,500
ఆదోని 46 29 22,000 7,000 15,000
మొత్తం 408 221 1,92,472 84,368 1,08,104