ఎక్కువ కేసులు పరిష్కరించండి
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:36 AM
ఈ నెల 12వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కర్నూలు ఇన్‌చార్జి ప్రధాన న్యాయాధికారి పి. వాసు న్యాయాధికారులను కోరారు.
12న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు ఇన్‌చార్జి ప్రధాన న్యాయాధికారి వాసు
కర్నూలు లీగల్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 12వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కర్నూలు ఇన్‌చార్జి ప్రధాన న్యాయాధికారి పి. వాసు న్యాయాధికారులను కోరారు. ఈ మేరకు గురువారం స్థానిక న్యాయ సేవా సదన్ భవన్‌లో న్యాయాధికారులు, వినియోగదారుల కమిషన్ చైర్మన్‌లతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు వీలుగా పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులు, రాజీకి వీలున్న క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు వీలుగా ప్రతి రోజు తమ తమ కోర్టులలో ప్రి లోక్ అదాలత్ సిట్టింగులను నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ, ఎక్సైజ్ మేజిస్ర్టేట్ అనిల్ కుమార్, మొబైల్ కోర్టు మేజిస్ర్టేట్ అనూష, మేజిస్ర్టేట్ అపర్ణ, జిల్లా వినియోగదారుల కమిషన్ చైర్మన్ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎక్సైజ్ అధికారులతో: ఎక్సైజ్ అధికారులు రాబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయాధికారి పి. వాసు సూచించారు. ప్రతి రోజు జరిగే ప్రి లోక్ అదాలత్ సిట్టింగులలో తమ తమ పరిధిలోని కేసులను కోర్టు దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.