సోలార్ వెలుగులు
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:38 PM
ప్రస్తుతం సోలార్ విద్యుత్ వాడకం పెరిగింది. ఇదే క్రమంలో సోలార్ రూపంలో విద్యుత్ వినియోగదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ సదుపాయం కల్పించారు. జిల్లాలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సదుపాయం కల్పించడంతో ఎంతో ప్రయోజనకరంగా మారింది. తాజాగా బీసీలకు రెండు కిలో వాట్ల సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం అదనంగా రూ. 20వేలు రాయితీ కల్పించింది. నెలకు 200 యూనిట్లు వరకు వినియోగించే బీసీలకు మాత్రమే సదరు అవకాశం కల్పించింది. ఏది ఏమైనా తాజా ప్రభుత్వం నిర్ణయంతో జిల్లాలోని బీసీ వినియోగదారుల్లోనూ సోలార్ వెలుగులు తెచ్చినట్లైంది. -
జిల్లాలో 2.86 లక్షల బీసీ వినియోగదారులు
అదనంగా రూ.20వేలు రాయితీ
ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సదుపాయం
బీసీలకు సుమారు రూ.135 కోట్లు..
నంద్యాల, జూలై25(ఆంధ్రజ్యోతి) జిల్లాలో ఇప్పటికే ఎక్కడ చూసినా సోలార్ వెలుగులు కనిపి స్తున్నాయి. తాజాగా బీసీలకు రెండు కిలో వాట్ల సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం అదనంగా రూ.20వేలు రాయితీ కల్పించింది. అధికార లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా బీసీ వర్గాలకు చెందిన వినియోగదారులు 2.86 లక్షలున్నారు. వీరిలో నెలకు సుమారు 200యూనిట్లు వరకు వినియోగించే వారు 1.86లక్షలు మంది ఉన్నట్లు ఆశాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఈలెక్కన ఆయా వారి ఇళ్లపై తాజా ప్రభుత్వం రాయితీ సదుపాయంతో సోలార్ యూనిట్లు ఏర్పాటుచేస్తే బీసీలకు సుమారు రూ.135కోట్ల వరకు ఆర్థికంగా లబ్ధి చేకూరే అవకాశం లేకపోలేదు.
ఎస్సీ, ఎస్టీలు సుమారు 16వేల మంది
ఇప్పటికే సదరు పథకం కింద వంద శాతం రాయితీ ఉండటంతో ఎస్సీ, ఎస్టీలు సుమారు 16వేల మంది వరకు సోలార్ ఏర్పాటు చేసు కున్నారని తెలిసింది. ఇదే క్రమంలో ఇతర కేటగిరిల వారీగా ఇప్ప టికే(ఎస్సీ, ఎస్టీలతో కలిపి) 5328 మంది వినియోగదారులు సోలార్ యూనిట్‌లు ఏర్పాటు చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 19 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ లెక్కన ఆయా వినియోగదారులకు ప్రభుత్వం నుంచి రాయితీ రూపంలో సుమారు రూ. 30 కోట్లకు పైగా పొందినట్లైంది.
జిల్లాలో పరిస్థితి ఇలా...
ఫ ఇప్పటి వరకు ఏర్పాటు చేసినట్లు యూనిట్లు : 5328
ఫ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ వినియోగదారులు : 2.86 లక్షలు
ఫ 200 యూనిట్లు వినియోగించే బీసీలు : 1.86 లక్షలు
ఫ రెండు కిలోవాట్లకు ప్రస్తుతం ఉన్న రాయితీ : రూ.60 వేలు
ఫ బీసీలకు అదనంగా రూ. 20 వేలు రాయితీ కలిపితే.. : రూ.80 వేలు
బీసీలకు ఎంతో ప్రయోజనం
జిల్లాలో సోలార్ యూనిట్లు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఉన్న రాయితీ కంటే బీసీలకు ప్రభుత్వం అదనంగా రూ.20వేలు రాయితీ కల్పించింది. ఈ అవకాశం 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే బీసీలకు మాత్రమే. దీంతో వారికి ఎంతో ప్రయోజనం. - సుధాకర్ కుమార్, విద్యుత్ ఎస్‌ఈ, నంద్యాల