ఎన్ని కష్టాలు?
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:40 PM
ఎన్ని కష్టాలు?
స్కానింగ్ కోసం పెద్దాసుపత్రిలో గంటల తరబడి నిరీక్షణ
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ జిల్లా ఆరోగ్య సంజీవిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఓపీ రోగులు అల్ర్టాసౌండ్ పరీక్షల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఉదయం ఓపీకి వచ్చిన రోగులకు వైద్యులు అల్ర్టాసౌండ్ పరీక్షలు రాసి ఇస్తారు. ఆ పరీక్షల చీటీ పట్టుకుని న్యూడయోగ్నస్టిక్ బ్లాక్‌కు వెళ్లి అక్కడ స్టాప్ నర్సు ఇచ్చిన టోకెన్ తీసుకుంటేనే వైద్యులు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 150 మంది వరకు స్కానింగ్ టోకెన్‌లు ఇస్తారు. ఆసుపత్రిలో అడ్మిషన్ రోగులు, ఓపీ రోగులకు స్కానింగ్ పరీక్షలో ఆలస్యమవుతున్నారు. మంగళవారం అనంతపురం చెందిన ఓ వృద్ధుడు ఉదయం 9 గంటలకు స్కానింగ్ వచ్చారని మధ్యాహ్నం 12.30 గంటలైనా అలా్ట్రసౌండ్ పరీక్షలు చేయడం లేదంటూ గొడవకు దిగారు. అందరూ ఎమర్జెన్సీ అంటూ లోపలికి వెళ్తున్నారని, ఓపీ రోగుల క్యూలైన్ మాత్రం కదలడం లేదని సెక్యూరిటీ గార్డులతో గొడవకు దిగారు. స్కానింగ్ పరీక్షల కోసం గంటల తరబడి నిలబడాలంటే కష్టంగా ఉందని ఆసుపత్రి అధికారులు ఓపీ రోగుల కోసం అదనపు స్కానింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇబ్బందులను తీర్చాలని రోగులు కోరుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్కానింగ్ టోకెన్‌ల కోసం పడిగాపులు కాస్తున్నా రేడియాలజీ అధికారులు పట్టించుకోవడం లేదు. కలెక్టర్ స్పందించి స్కానింగ్ కేంద్రాలను పెంచి సమస్యను తీర్చాలని రోగులు కోరుతున్నారు.
12 గంటల నుంచి టోకెన్ కోసం..
స్కానింగ్ పరీక్ష కావాలంటే టోకెన్ తీసుకోవాలంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు న్యూడయోగ్నస్టిక్ బ్లాక్‌కు వచ్చా. అప్పటి నుంచి టోకెన్ కోసం కౌంటర్ వద్దే కూర్చున్నాను. మధ్యాహ్నం 3 గంటలకు టోకెన్ ఇస్తామన్నారు. అన్ని గంటలు వేచి చూడాలంటే ఇబ్బంది పరిస్థితి. కడుపు నొప్పి మాత్రం తీవ్రంగా ఉంది.
- సరస్వతి, తుపత్రాల గ్రామం, అయిజ, గద్వాల జిల్లా
11 గంటలకు వచ్చాను
మంగళవారం ఉదయం ఆసుపత్రికి వచ్చాను. వైద్యుల దగ్గరకు వెళితే అల్ర్టాసౌండ్ స్కానింగ్ చీటి రాసిచ్చారు. న్యూడయోగ్నస్టిక్ బ్లాక్ వద్ద ఉదయం 11 గంటల నుంచి వేచి చూస్తున్నాను. టోకెన్ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇస్తామన్నారు.
- లక్ష్మీదేవి, డోన్