సజావుగా..
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:26 AM
సజావుగా..
ముగిసిన నామినేషన్ల పర్వం
ఆరు చైర్మన్, చైర్పర్సన్ స్థానాలకు 88..
212 వార్డు మెంబర్లకు 1,443 నామినేషన్లు
నంద్యాల మున్సిపాలిటీ టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ బాబన్
ఆశావహుల్లో అసంతృప్తి.. రాజకీయ వర్గాలో జోష్
నేడు పరిశీలన.. 21న ఉపసంహరణ
నంద్యాల, అక్టోబరు18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగింది. చివరి రోజైన ఆదివారం ఒక్కసారిగా ఊపందుకుంది. నామినేషన్లు భారీగా పెరిగాయి. నంద్యాల మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థులను ఇటు టీడీపీ, అటు వైసీపీ చివరి రోజున ప్రకటించింది. టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ బాబన్, వైసీపీ అభ్యర్థిగా దాల్మిల్ అమీర్‌ను ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది.
జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల్లో..
జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల్లో మూడు రోజులుగా చైర్మన్, చైర్‌పర్సన్‌కు 88, 212వార్డులకు 1443 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో చైర్పర్సన్ పరంగా అత్యధికంగా నంద్యాల-32, బేతంచెర్ల-16, వార్డుల పరంగా నంద్యాల-489, డోన్ -220 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.
రిజర్వేషన్ల తారుమారుతో..
పురపోరులో భాగంగా ఆరు మున్సిపాలిటీల్లో ఎప్పటి నుంచో పలు స్థానాలను ఆశించిన అభ్యర్థులకు రిజర్వేషన్ల తారుమారుతో చుక్కెదురైంది. నంద్యాల మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కోసం ఎంతో మంది ఆశించారు. బీసీ రిజర్వేషన్ కావడంత కొంత పోటీ తగ్గింది. బీసీల నుంచి 10 మంది వరకు ఆశించగా.. వీరిలో ఏవీఆర్ ప్రసాద్, శివశంకర్ యాదవ్, వారి సోదరుడు సతీమణి చంద్రకళ, మునియర్ ఖలీల్, మంత్రి కుమారుడు ఎన్ఎండీ ఫయాజ్, డాక్టర్ ఆరీఫాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఊహించని విధంగా సీఎం చంద్రబాబునాయుడు నంద్యాలకి చెందిన డాక్టర్ బాబన్‌ను ఖరారు చేశారు. సదరు స్థానం ఆశించిన ఆశావహుల్లో అసంతృప్తి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పురపోరు పరంగా రాజకీయ వర్గాలతో పాటు పట్టణ ప్రజల్లో జోష్ మొదలైంది.
చైర్మన్లలో టీడీపీ, వార్డుల్లో వైసీపీ..
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్, చైర్పర్సన్ స్థానాలకు వచ్చిన 88 నామినేషన్లలో టీడీపీ-36, వైసీపీ-28, బీజేపీ -2, సీపీఎం-1, కాంగ్రెస్- 4, జనసేన-1, ఎస్డీపీఐ- 2, ఇండిపెండెంట్లు- 14 చొప్పున దాఖలయ్యాయి. వార్డుల పరంగా టీడీపీ-534, వైసీపీ- 606, బీజేపీ- 32, సీపీఐ-13, సీపీఎం-10, కాంగ్రేస్-8, జనసేన-50, ఇండిపెండెంట్లు- 165, బీఎ్సపీ-1, ఇతరులు-24 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు.
వీడిన ఉత్కంఠ
నంద్యాల మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్ధుల ఖరారుపై ఇటు టీడీపీ, అటు వైసీపీలో చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. రెండు పార్టీలు సైతం చివరిరోజున అభ్యర్థులను ఖరారు చేశారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్ బాబన్, జిల్లా పరిశీలకులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు గడిపూటీ నారాయణస్వామి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫీరోజ్, బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు, మార్కెఫెడ్ డైరక్టర్ తాతారెడ్డి తులసీరెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థి దాల్మిల్ అమీర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ వార్డుమెంబర్ పబ్బతి వేణు మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తదితర కూటమి నాయకులతో కలిసి నామినేషన్ వేశారు. డోన్‌లో టీడీపీ అభ్యర్థిగా కోట్ల సుజాతమ్మ నియోజకవర్గ పరిశీలకులకు గోవర్థన్ రెడ్డి తదితర నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
మొదట ఘట్టం పూర్తి
పురుపోరులో మొదటి ఘట్టం పూర్తయింది. సోమవారం నామినేషన్ల పరిశీలన సాగనుంది. 21వ తేదీన నామినేషన్ల ఉపసంహరణతో పార్టీల పరంగా అభ్యర్థుల ఖరా రుపై స్పష్టత రానుంది. రెబల్ అభ్యర్థుల వివరాలు కూడా తేలనుంది. ఆ తర్వాత ప్రచారంలో ఆయా అభ్యర్థులు సందడి మొదలై 26న ముగియనుంది. 28న పోలింగ్, 30న ఫలితాలు విడుదల కానున్నాయి. అత్యంత ప్రధానమైన పోలింగ్ పక్రియపై ఇటు అధికార యంత్రాంగం.. అటు పోలిస్ యంత్రాంగం, అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది.
నిబంధనలకు అనుగుణంగా..
నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. చైర్మన్, చైర్పర్సన్ స్థానాలకు 88, వార్డు మెంబర్లకు 1443 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియ చేపట్టాం. ప్రశాంత నామినేషన్‌కు సహకరించిన ప్రతి ఒక్కరిని ప్రత్యేక కృతజ్ఞతలు.
రాజకుమారి, కలెక్టర్, నంద్యాల