Share News

హోరెత్తిన దేశభక్తి నినాదాలు

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:37 PM

80వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నంద్యాల పట్టణంలో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

హోరెత్తిన దేశభక్తి నినాదాలు
తిరంగా ర్యాలీని ప్రారంభించిన మంత్రి ఫరూక్‌, కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన్‌

ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

ప్రారంభించిన మంత్రి ఫరూక్‌, కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల క్రైం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : 80వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నంద్యాల పట్టణంలో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టెక్కె, మార్కెట్‌ యార్డ్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీకి పట్టణ ప్రజలు, విద్యార్ధులు, అధికారులు పెద్ద ఎత్తున తరలి రావడంతో జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసింది. ర్యాలీ ప్రారంభానికి ముందు నశా ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్ధాల వినియోగానికి వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన్‌ యువతతో ప్రతిజ్ఞ చేయించారు. యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన్‌ జెండా ఊపి హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని ప్రారంభించారు. టెక్కె మార్కెట్‌ యార్డ్‌ నుంచి శ్రీనివాస్‌ సెంటర్‌, గాంధీ చౌక్‌ మీదుగా ర్యాలీ కొనసాగింది. జాతీయ జెండాలను చేతబూని జై హింద్‌, భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ప్రజలు, విద్యార్ధులు, యువత, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీతో నంద్యాల పురవీధుల్లో దేశ భక్తి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్ధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 11:37 PM