పరుగందుకోని సర్
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:03 AM
జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
50.29 శాతానికి చేరిన డిజిటలైజేషన్
14న ముగుస్తున్న ఈసీ గడువు
కర్నూలు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు పెద్దగా స్పందిం చలేదు. ఎక్కడ మా ఓట్లు పోతాయో అనే భయంతో ప్రధాన ప్రతిపక్ష వైసీపీ బీఎల్‌ఏలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా ఓటర్ల ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్‌లు భర్తీ చేయడంలో సహకరిస్తున్నారు. అధికార కూటమి పార్టీలకు చెందిన బీఎల్‌వోల్లో పెద్దగా స్పందన కనిపించడం లేదు. శనివారం టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సర్ ప్రక్రియలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చా ర్జీలు తీరుపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేరుగా రంగంలోకి దిగి ప్రజాప్రతినిధులు, ముఖ్యనా యకులకు ఫోన్లు చేసి సర్ ప్రక్రియ సక్సెస్ కోసం బీఎల్‌వోలకు బీఎల్‌ఏలు సహకరించేలా చూడాలని చురకలంటిచారు. అదే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారులకు లక్ష్యాలు నిర్దేశించడంతో కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌లు క్షేత్రస్థాయిలో ఈఆర్‌ఓ, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలను అప్రమత్తం చేస్తున్నారు.
జిల్లాలో సర్ పురోగతి వివరాలు
ఓటర్లు : 20,86,119
ఎన్యూమరేషన్ ఫామ్‌లు పంపిణీ : 20,64,390
శాతం : 98.96
డిజిటలైజేషన్ : 10,49,132
శాతం : 50.29
ఒక్క రోజులో 1,30,733 డిజిటలైజేషన్
ఆదివారం ఈ ప్రక్రియ కాస్త వేగం పుంజుకుంది. శనివారం నాటికి 9,18,388 ఓటర్లను డిజిటలైజేషన్ చేశారు. ఆదివారం సాయంత్రానికి ఆ సంఖ్య 10,49,132 చేరింది. అంటే.. ఒక్క రోజే 1,30,733 ఓటర్లను డిజిటలైజేషన్ చేశారు. ఇంకా 10,36,987 ఓటర్లను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. మిగిలిన గడువు తొమ్మిది రోజులే. రోజుకు సరాసరి 1.25 లక్షల నుంచి 1.50 లక్షలు ఓటర్లు డిజిటలైజేషన్ చేస్తే తప్పా గడువు ముగిసేలోగా వంద శాతం డిజిటలైజేషన్ చేయవచ్చు. సాకారం కావాలంటే బీఎల్‌వోలు ఒక్కొక్కరు రోజుకు సగటున 50-75కు తగ్గకుండా సెల్‌ఫోన్లలో డిజిటలైజేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే గడువు సమీపిస్తున్న కొద్ది సర్వర్ స్లో అవుతుండడంతో లక్ష్యం చేరుకుంటామా..? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.
ఇళ్లు మారిన వారికి ఇక్కట్లు
కర్నూలు నగరం కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాలకు పరిధిలోకి వస్తుంది. సొంతిల్లు లేని వాళ్లు అద్దె ఇంట్లో ఉంటున్నారు. వివిధ కారణాలు వల్ల నివాసాలు మార్చిన వారు అనేక మంది ఉన్నారు. వెంకట రమణ కాలనీ, సంతోష్ నగర్, అశోక్‌నగర్, కప్పల్‌నగర్, ఎన్‌ఆర్ పేట, కొత్తపేట, బుధార్‌పేట, జోహరాపురం వంటి కాలనీలో కర్నూలు నియో జకవర్గం పరిధిలో ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ఈ కాలనీల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసి ఓటర్లు పలువురు పాణ్యం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కృష్ణానగర్, కల్లూరు, నంద్యాల చెక్‌పోస్టు ఏరియా, డాక్టర్స్ కాలనీ.. వంటి కాలనీలకు వెళ్లారు. అక్కడి నుంచి కర్నూలు నియోజకవర్గం పరిధిలోని కాలనీలకు షిఫ్ట్ అయిన వారు ఉన్నారు. ఇళ్లు మారినా, ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఎన్యుమరేషన్ ఫారాలు అందడం లేదు. ఎమ్మిగనూరు, ఆదోని పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సర్ ప్రక్రియ ప్రారంభమై 21 రోజులు గడిచినా అడ్ర్‌సలు దొరక్క 21,729 మందికి ఫారాలు అందించలేదు. వాస్తవంగా ఈ సంఖ్య లక్షల్లో ఉంటుందని బీఎల్‌ఏలు అంటున్నారు. రికార్డుల్లో పురోగతి కోసం ఫారాలు పంపిణీ చేయకపోయినా పంపిణీ చేసినట్లు చూపారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సర్‌లో భాగంగా కొత్తగా ఓటర్ల నమోదు చేసుకోవడానికి కూడా ఫామ్-6, డిక్లరేషన్ సేకరించాల్సి ఉంది. జిల్లాలో బీఎల్‌వోలు ఎక్కడా ఫామ్-6 స్వీకరించడం లేదు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంతర్భాగమైన గుత్తి పెట్రోల్ బంకు వద్ద బీఎల్‌వోలు ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదని శ్రీరామనగర్ కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఆధార్, ఫొటోలు, 2002 సర్ డేటాను సచివాలయానికి తీసుకొచ్చి ఎన్యుమరేషన్ ఫారాలను భర్తీ చేయాలని ఫోన్లు చేస్తున్నారు. ఇళ్ల వద్దకు రావాల్సిన బీఎల్‌వోలు ఇలా ఫోన్లు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫారాల భర్తీలో గందరగోళం
ఎన్యుమరేషన్ ఫారాలు అసమగ్రంగా భర్తీ చేసి బీఎల్‌వోలకు ఇస్తున్నారు. ఫామ్ పైభాగంలో రెండు పట్టకలు, దిగువున ఒక పట్టిక ఉంటుంది. దిగువ పట్టికలో ఓటరు వివరాలు, పైన మొదటి పట్టికలో 2002 నాటి ఓటరు వివరాలు భర్తీ చేసి, తాజా ఫొటోను అతికించి బీఎల్‌వోకు ఇవ్వాలి. 2002 నాటి ఓటరు వివరాలు లేకపోతే.. దిగువ పట్టికలో ఓటరు వివరాలు, పైన రెండవ పట్టికలో ఓటరు తల్లితండ్రులు లేదా రక్త సంబంధీకుల 2002 నాటి ఓటరు వివరాలు తప్పకుండా భర్తీ చేసి, పైన ప్రస్తుత తాజా ఫొటో అతికించి ఇవ్వాలి. అయితే ముప్పాతిక శాతం మంది ఓటర్లకు 2002 నాటి ఓటరు వివరాలు దొరక్క, ఎన్నికల సంఘం యాప్‌లో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో దిగువ పట్టికలోని ప్రస్తుతం ఓటరు వివరాలు భర్తీ చేసి, ఫొటో అతికించిన ఫారాలను బీఎల్‌ఏలు సేకరించి బీఎల్‌వోలకు అందజేస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణం ముగతి పేట, ఎన్టీఆర్ కాలనీ, శివన్ననగర్, లక్ష్మిపేట, తేరుబజార్.. వంటి కాలనీల్లో ఆదివారం అసంపూర్తిగా పూరించిన ఫారాలను బీఎల్‌ఏలు సేకరించారు. ‘ఇలా ఎలా సేకరిస్తారని ప్రశ్నిస్తే.. మాకు వివరాలు తెలియవు. ఆ వివరాలేంటో బీఎల్‌వో చూసుకుంటారు..’ అన్న సమాధానం వస్తోంది. అసమగ్ర వివరాలతో వచ్చిన సర్ ఫారాలు డిజిటలైజేషన్ చేయడం సాధ్యమా..? ఒకవేళ చేసినా, ప్రక్రియలో భాగంగా ఈఆర్‌వో (తహసీల్దారు)లు నోటీసులు పంపుతారు. ఆ రోజైనా ఇబ్బందులు తప్పవు. ఓటరు సరైన ధ్రువీకరణ పత్రాలతో నిరూపించుకోకపోతే ఓటు హక్కు రద్దు అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.
కర్నూలులో ప్రత్యేక శిబిరాలు
కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో కమిషనర్ చల్లా ఓబులేసు సర్ ప్రక్రియ విజయవంతం చేయాలనే లక్ష్యంగా 68 ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఫారాలు భర్తీ చేయడానికి అవసరమైన వివరాలు అందిస్తూ ఓటర్లకు సహకరిస్తున్నారు. ఆదివారం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ నగరంలోని రామచంద్ర మిషన్, కేంద్రీయ విద్యాలయం, సోమిశెట్టి నగర్, డాక్టర్స్ కాలనీల్లోని సర్ ప్రత్యేక శిబిరాలను పరిశీలించారు. ప్రతి గ్రామంలో ఇదే తరహాలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.