Share News

శ్రేయ మాయాజాలం

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:41 PM

శ్రేయ మాయాజాలం

శ్రేయ మాయాజాలం
కర్నూలులో శ్రేయ ఇన్‌ఫ్రా కార్యాలయం

నమ్మించారు.. మోసగించారు.!

శ్రేయ ఇన్‌ఫ్రా సంస్థ చేసిన మాయాజాలానికి ఎంతో మంది చిక్కుకున్నారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 8,128 మందికి పైగా బాధితులు రూ.206 కోట్లు డిపాజిట్‌ రూపంలో మోసపోయారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌ అయిన శ్రేయ ఇన్‌ఫ్రా అండ్‌ మార్కెటింగ్‌ ప్రైవెట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే పదిహేను నెలలకే రూ.1.80 లక్షలు ఇస్తాం.. అదికూడా నెలనెలా రూ.12 వేల ప్రకారం ఖాతాలో జమ చేస్తామంటే సంస్థ ఎలాంటిది? నూటికి రూ.5-6 వడ్డీ చెల్లించే ఆర్థిక స్థోమత ఆ సంస్థకు ఉందా? డిపాజిట్‌ డబ్బులతో ఎలాంటి వ్యాపారాలు చేస్తుంది? వంటి వివరాలను ఏ మాత్రం తెలుసుకోకుండా ఏజెంట్ల మాయ మాటలు నమ్మి అప్పులు చేసి.. ఆస్తులు, బంగారు కుదవపెట్టి డిపాజిట్‌ చేశారు. వందల కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న ఆ సంస్థ చేతులెత్తేయడంతో లబోదిబోమంటున్నారు. డిపాజిట్‌దారుల్లో రాజకీయ నాయకులు కుటుంబీకులు, పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఏజెంట్లు రూ.లక్షలకు పడగలెత్తితే.. వారి మాటలు నమ్మి డిపాజిట్లు చేసిన సామాన్యులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు.

కర్నూలు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి):

ఏడాది తిరక్కుండానే..

కర్నూలులోని బిర్లా కాంపౌండ్‌లో నాలుగైదేళ్ల క్రితం శ్రేయ ఇన్‌ఫ్రా అండ్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట కార్యాలయం ప్రారంభించారు. ఆ తరువాత గుత్తి పెట్రోల్‌ బంక్‌ ఏరియాకు మార్చారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నోకు చెందిన ఈ సంస్థ 2020 డిసెంబరు 24న చైర్మన్‌ హే మంత్‌కుమార్‌ రాయ్‌, ఎండీగా ఆయన భార్య సంగీతరాయ్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు (స్థిరాస్తి వ్యాపారం) చేస్తున్నామని, అందులో పెట్టుబడులు పెడితే ఏడాది తిరక్కుం డానే రెట్టింపు అవుతుందని ఆశ చూపారు.

2023 నుంచి డిపాజిట్ల సేకరణ

ఉమ్మడి జిల్లాలో 2023 నుంచి డిపాజిట్ల సేకరణ చేపట్టారు. కర్నూలు కేంద్రంగా ఆ కంపెనీ రాయల్‌ క్లబ్‌మెంబరుగా కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన మహేశ్‌ (మాజీ సైనికుడు), ఆయన భార్య విజయలక్ష్మి డైరెక్టరుగా కార్యకలాపాలు నిర్వహించేవారని బాధితులు పేర్కొంటున్నారు. ఆకర్షణీయమైన కమీషన్‌ ఇస్తామంటూ ఏజెంట్లను నియమించుకొని, అధిక వడ్డీ చెల్లిస్తామంటూ ఘరానా మోసానికి తెరతీశారు. తమ డబ్బులు ఎప్పుడిస్తారని బాధితులు ప్రశ్నిస్తే గత ఎన్నికల వేళ కంపెనీ అకౌంట్లు బ్లాక్‌ చేశారనీ.. త్వరలోనే వస్తాయనీ స్థానికంగా ఉన్న మహేశ్‌ నమ్మిస్తూ వచ్చారు. గతేడాది జూన్‌ నుంచి డిపాజిట్‌ అమౌంట్‌ చెల్లించకుండా అదిగో.. ఇదిగో అంటూ మాయమాటలతో మభ్యపెడుతున్నారు.

అధిక వడ్డీ ఆశ చూపి..

అధిక వడ్డీ ఆశ చూపి ఏజెంట్లకు భారీగా గిఫ్టులు ఇచ్చి రూ. వందల కోట్లు డిపాజిట్‌ సేకరించినట్లు తెలుస్తున్నది. రూ.లక్ష డిపాజిట్‌ చేస్తే నెలకు నెలకు రూ.12 వేలు చెప్పున 15 నెలల్లో రూ.1.80 లక్షలు ఖాతాలో జమ చేస్తామని నమ్మించారు. నెలకు నూటికి రూ.5-6లు వడ్డీ వస్తుంది. ప్రపంచంలో ఏ బ్యాంకు కూడా ఈ స్థాయిలో వడ్డీలు ఇవ్వలేవు. శ్రేయ ఇన్‌ఫ్రా సంస్థకు ఎలా సాధ్యం? అని బాధితులు ఒక్కసారి ఆలోచించి ఉంటే మోసపోయేవారు కాదు. ఏజెంట్ల మా యలో పడి ఆర్థికంగా చితికిపోయి లబోదిబోమంటున్నారు.

విలువైన గిప్టులు.. అందమైన బ్రోచర్లు

పీజీపీఎం, బీఎంఐపీ రివార్డు పేరిట రూ.20 లక్షలు డిపాజిట్‌ చేస్తే రూ.90 వేలు విలువైన స్కూటీ, రూ.50లక్షలు డిపాజిట్‌ చేస్తే రూ.5లక్షల విలువైన కారు, రూ.కోటి డిపాజిట్‌ చేస్తే రూ.11 లక్షలు విలువైన కారు, రూ.3 కోట్లు డిపాజిట్‌ చేస్తే రూ.27 లక్షలు విలువైన కారు, ప్లాట్‌ అం టూ మరెన్నో విలువైన గిప్టులు.. అందమైన బ్రోచర్లతో ఏజెంట్లను నియమించి వారి ద్వారా డిపాజిట్‌దారులను మాయ చేసి భారీ మోసాలకు శ్రీకారం చుట్టారు. అనతి కాలంలోనే 8,128 మంది బాధితుల నుంచి రూ.206 కోట్లు డిపాజిట్లు సేకరించినట్లు సీఐడీ గుర్తించింది.

మొదట్లో క్రమం తప్పకుండా..

మొదట్లో క్రమం తప్పక డిపాజిట్‌దారుల ఖాతాలో ఆమౌంట్‌ జమ చేస్తూ వచ్చింది ఆ సంస్థ. సభ్యుల సంఖ్య పెరగడం, డిపాజిట్లు రూ.100 కోట్లు దాటిన తరువాత 2024 జూన్‌ నుంచి చెల్లింపులు ఆపేశారు. దీంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది.

రంగంలోకి దిగిన సీఐడీ

శ్రేయ ఇన్‌ఫ్రా అండ్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో వివిధ పథకాల కింద అధిక రాబడి, అదనపు ప్రయోజనాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో తాను, తన కుటుంబ సభ్యులు రూ.5.26 కోట్లు డిపాజిట్‌ చేశామని కర్నూలుకు చెందిన నాగిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి 2023 నవంబరు 22న కర్నూలు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ డబ్బును వివిధ బ్యాంక్‌ ఖాతాల ద్వారా ఆ సంస్థ చైర్మన్‌ హేమంత్‌కుమార్‌ రాయ్‌, ఎండీ సంగీతారాయ్‌ ఖాతాలకు బదిలీ చేసి మోసపోయామని ఆ సంస్థ చైర్మన్‌తో పాటు పలువురిపై ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నంబరు.352/2024లో వివిధ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈకేసును సీఐడీకి బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సీఐడీ అధికా రులు సమగ్ర విచారణ చేపపట్టారు. వారి విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఆ సంస్థ చైర్మన్‌ హేమంత్‌ రాయ్‌, ఎండీ సంగీతారాయ్‌ సహా 24 మంది ఒకరితో ఒకరు కుమ్మక్కై మోస పూరితంగా అమాయక ప్రజలు 8,128 మంది నుంచి దాదాపు రూ.206 కోట్లు డిపాజిట్లు సేకరించారని గుర్తిం చారు. ఆ డబ్బును వ్యక్తిగత అవసరాల కోసం దుర్వి నియోగం చేశారని, స్వంత పేర్లతో స్థిరాస్తులు కొనుగోలు చేసి దుర్విని యో గం చేశారని, డిపాజిట్‌దారులకు నగదు చెల్లింపుల్లో విఫలమ య్యారని సీఐడీ డీజీపీ, ప్రభుత్వానికి పంపిన నివేదికలో వెల్లడించారు.

బాధితుల రక్షణ కోసం

బాధితుల రక్షణ కోసం ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 3 కింద నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో వివిధ సర్వే నంబర్లు కింద ఆ సంస్థ కొనుగోలు చేసిన 51.55 ఎకరాల జప్తు చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ ఇచ్చిన నివేదిక మేరకు ఆ భూములు జప్తు చేయడం, ఎలాంటి లావాదేవిలు జరకుండా చూడాలంటూ సంబంధిత శాఖల ఉన్నత అధికారులను ఆదేశిస్తూ హోం శాఖ ప్రిన్సిపుల్‌ సెక్రెటరీ కుమార్‌ విశ్వజిత్‌ జీవో ఎంఎస్‌ నంబరు.2 జారీ చేశారు. మోసపూరితంగా డిపాజిట్లు సేకరించిన శ్రేయ ఇన్‌ఫ్రా సంస్థ చైర్మన్‌, ఎండీలు, వారికి సహకరించిన స్థానిక ఏజెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు డిపాజిట్‌ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై ఆ సంస్థ రాయల్‌ క్లబ్‌ మెంబరుగా ఉంటున్న మహేశ్‌ వివరణ కోసం ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Updated Date - Jan 03 , 2026 | 11:41 PM