ఆదాయం కోసం అడ్డదారులు
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:23 AM
నంద్యాల మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి గతంలో ఆదాయం కోసం అడ్డదారులు తొక్కారని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఆరోపించారు.
మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిపై మంత్రి ఫరూక్ ఫైర్
నంద్యాల రూరల్, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి గతంలో ఆదాయం కోసం అడ్డదారులు తొక్కారని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఆరోపించారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గతంలో మార్కెట్ యార్డుకు చెందిన దుకాణాలను తక్కువ ధరకు తీసుకొని సేవల ముసుగులో వ్యక్తిగత ఆదాయం పొందారని విమర్శించారు. ప్రజలపై నిజమైన అభిమానం ఉంటే రైతునగరంలోని శిల్పా స్థలాలలో సహకార్ ఏర్పాటు చేసి సేవలను అందించాలన్నారు. శిల్పారవి ప్రశ్నలకు బదులిస్తూ సేవలకు రాజ్‌ధియేటర్‌లోని అన్ని దుకాణాలను ఖాళీ చేయించి ఇస్తానని మార్కెట్ ధర చెల్లించి సేవలను కొనసాగిస్తావా అంటూ సవాల్ విసిరారు. మార్కెట్‌యార్డు దుకాణాల ద్వారా వచ్చే ఆదాయం మార్కెట్ అభివృద్ధికి, ప్రభుత్వ ఖజానాకే చేరుతుందన్న విషయం గుర్తించు కోవాలన్నారు. చౌకబారు మాటలను మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో నంద్యాల మార్కెట్‌యార్డు చైర్మెన్ గుంటుపల్లి హరిబాబు, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి పాల్గొన్నారు..
న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. న్యాయవాదాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని న్యాయ వాదులు తులసిరెడ్డి, హుస్సేన్‌భాషా, సాయిరాంరాయల్ పేర్కొన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ న్యాయవాదు లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శిల్పా రవి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు. న్యాయశాఖ మంత్రి ఫరూక్ చొరవతో నంద్యాలలో 4 కొత్త కోర్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ లీగల్ సెల్ ప్రతినిదులు గౌరీశంకర్, ప్రతాప్‌రెడ్డి, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.