మావే షాపులు
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:03 AM
ఇక్కడి రాజ్యం అంతా మాదే.. మేము చెప్పిందే శాసనం.. కాదు కూడదు అంటే ఎంతటికైనా తెగిస్తాం అన్నట్లు ఉంది దుకాణ యజమానుల పరిస్థితి. తామే ఈ సారి కూడా షాపులను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. సిండికేట్‌గా మారారు. రౌడీలను సైతం సెట్ చేశారు. వేలం పాటలో దుకాణాలను దక్కించుకునేందుకు చాలా మంది వచ్చినా కూడా కొత్తగా వచ్చినవారిని బయట పెట్టడంతో పాటు పలువురిని బయటకు పంపడం గమనార్హం.
దుకాణాలను దక్కించుకునేందుకు పావులు
వేలం పాటలో సిండికేట్
రౌడీలతో కొత్తవారికి బెదిరింపులు
నగర పాలక సంస్థ ఆదాయానికి గండి
నేడు సీ క్యాంపు దుకాణాలకు వేలం
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): నగర పాలక పరిధిలోని సి.క్యాంపులో ఉండే నగర పాలక దుకాణాలకు వేలం నిర్వహించేందుకు అధికారులు అన్ని సిద్ధంచేశారు. సి.క్యాంపులో మొత్తం 30దుకాణాలను పాత యజమానులే దక్కించుకునే విధంగా పావు లు కదుపుతున్నారు. రౌడీలను సైతం ఇందులో ప్రమేయం చేయాలని యజమానులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం జరిగిన బంగి అనంతయ్య కాంప్లెక్స్, నరసింహ రెడ్డినగర్ దుకాణాలను దక్కించుకునేందుకు కుమ్మక్కైనట్లు పలు విమర్శలు వస్తున్నాయి. వేలం పాటలో దుకాణాలను దక్కించుకునేందుకు చాలా మంది వచ్చినా కూడా కొత్తగా వచ్చినవారిని బయటే పెట్టడంతో పాటు పలువురిని బయటకు పంపడం గమనార్హం. దుకాణాలకు వేలం పాట నిర్వహించేందుకు గుడ్‌విల్ డబ్బులు తీసుకుంటారు. ఆ గుడ్ విల్ డబ్బులు, అందులో పది శాతం మొత్తానికి కలిపి పాట పాడాల్సి ఉంది. నిన్నజరిగిన వేలం పాటలో పలు దుకాణాలకు నిబం ధనలకు విరుద్దంగా గుడ్‌విల్ డబ్బులు కట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పాతవారే వాటిని దక్కించుకునేందుకు..
సి.క్యాంపు రైతుబజార్ పక్కన ఉన్న నగరపాలక దుకాణాలకు గురువారం వేలం నిర్వహిం చనున్నారు. 30దుకాణాలకు వేలం నిర్వహించేందుకు అధికారులు అన్ని సిద్ధం చేశారు. కొత్తవారు ఎవరూ కూడా వేలంలో పాల్గొనకుండా పాతవారే వాటిని దక్కించుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తవారు ఎవరైనా వేలంలో పాల్గొనేందుకు ముం దుకు రావాలని ప్రయత్నిస్తే వారిని రౌడీలతో బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఎవరైనా కొత్తవారు వేలం పాల్గొనాలని ప్రయత్నిస్తే వారి ఇంటివద్దకు వెళ్లి రౌడీలో వారిని బయటికి రాకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బంగి అనంతయ్య కాంప్లెక్స్, నరసింహ రెడ్డినగర్‌కు సంబంధించిన దుకాణాల వేలంలో ఇదే తంతు జరిగింది.
ఆదాయానికి గండి అవకాశం?
నగరపాలక ఆదాయానికి పూర్తిస్థాయిలో గండి పడే అవకాశముంది. మున్సిపల్ దుకాణాల కోసం రూ.20లక్షల నుంచి రూ.25లక్షల వరకు పోటీ ఉంటుంది. పాటదారులు ముందస్తుగా సిండికేట్ అయ్యారు. నామమాత్రంగా పాటపాడాలని నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలో వేలాల ద్వారా నగరపాలకకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
రూ.1.50 కోట్లు రావాల్సిన చోట..
మంగళవారం జరిగిన వేలంలో గుడ్‌విల్ సుమారు రూ.1.50కోట్లు రావాల్సిన చోట కేవలం రూ.93.10లక్షలు మాత్రమే వచ్చింది. దీనికి కారణం పాటదారులు సిండికేట్ అయ్యారని స్పష్టంగా తెలుస్తోంది. సి.క్యాంపునకు సంబంధించిన దుకాణాల వేలంలో కూడా ఇదే తంతు జరిగితే నగర పాలక ఆదాయానికి పూర్తిస్థాయిలో గండి పడే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. సి.క్యాంపు రైతు బజార్ వద్ద ఉన్న దుకాణాలకు పెద్ద మొత్తంలో పోటీ నెలకొంది. దీనిపై నగరపాలక అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.