Share News

జలవనరుల శాఖ ఎస్‌ఈగా శైలేశ్వర్‌

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:29 PM

రాష్ట్ర జలవనరుల శాఖలో ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్‌ ఇంజీనీర్‌ (ఎస్‌ఈ), ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) పోస్టులను పూర్తి అదనపు బాధ్యత (ఎఫ్‌ఏసీ) పద్ధతిన ప్రభుత్వం భర్తీ చేసింది. ఈమేరకు ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ శశిభూషన్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

జలవనరుల శాఖ ఎస్‌ఈగా శైలేశ్వర్‌

శ్రీశైలం, ఎస్సార్బీసీ ఎస్‌ఈలుగా ఎం. వేణుగోపాల్‌రెడ్డి, లక్ష్మానాయక్‌

ఎఫ్‌ఏసీ ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

కర్నూలు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జలవనరుల శాఖలో ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్‌ ఇంజీనీర్‌ (ఎస్‌ఈ), ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) పోస్టులను పూర్తి అదనపు బాధ్యత (ఎఫ్‌ఏసీ) పద్ధతిన ప్రభుత్వం భర్తీ చేసింది. ఈమేరకు ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ శశిభూషన్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) ఆదోని డివిజన్‌ ఈఈ జి.శైలేశ్వర్‌కు కర్నూలు ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన జి.శైలేశ్వర్‌ కర్ణాటక రాష్ట్రం గదగ్‌లో బీటెక్‌ (సివిల్‌) పూర్తి చేశారు. 1993లో ప్రభుత్వం ఏఈఈగా ఎంపిక చేసి కడప జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టులో నియమించింది. వెలిగల్లులో పాటు పలమనేరు, వి.కోట, చిత్తూరులో విధులు నిర్వహించారు. 2012లో డీఈఈగా పదోన్నతి రావడంతో హిందూపురం ఎంఐ సబ్‌ డివిజన్‌ డీఈఈగా బాధ్యతలు చేపట్టారు. 2019లో టీబీపీ ఎల్లెల్సీ ఆదోని-2 సబ్‌ డివిజన్‌కు బదిలీపై వచ్చిన ఆయన 2024 జూన్‌ వరకు అక్కడే పనిచేశారు. అదే నెలలో హిందుపురానికి బదిలీ చేశారు. ఈ ఏడాది మే నెలలో ఈఈగా పదోన్నతి రావడంతో మళ్లీ ఆదోని టీబీపీ ఎల్లెల్సీ డివిజన్‌ ఈఈగా నియమించారు. పదోన్నతిపై కడప సీఈగా బదిలీ అయిన బాలచంద్రారెడ్డి స్థానంలో శైలేశ్వర్‌కు ఎస్‌ఈగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

తెలుగు రాష్ట్రాల జీవనాడి అయిన శ్రీశైలం ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ)గా ఎస్సార్బీసీ నంద్యాల డివిజన్‌ ఈఈ ఎం.వేణుగోపాల్‌కు ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. అలాగే.. నంద్యాల జిల్లాలో కీలకమైన శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ) నంద్యాల సర్కిల్‌ ఎస్‌ఈగా అదే సర్కిల్‌లో కోవెలకుంట్ల ఎస్సార్బీసీ-2,4 డివిజన్‌ ఈఈగా పని చేస్తున్న ఎస్‌.లక్ష్మానాయక్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే.. శ్రీశైలం ప్రాజెక్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఈఈ రవికుమార్‌కు డ్యాం ఈఈగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.

బాధ్యతాయుతంగా పనిచేస్తా : శైలేశ్వర్‌

ప్రభుత్వం నాపై ఎంతో నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తా. ప్రజా ప్రతినిధులు, రైతులకు సంధానకర్తగా ఉంటూ టీబీపీ ఎల్లెల్సీ, కేసీ కాలువ వాటర్‌ రెగ్యులేషన్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నా వంతు కృషి చేస్తా. పశ్చిమ ప్రాంతంలో కీలకమైన వేదవతి ప్రాజెక్టు, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులు పూర్తి, సీఈ కబీర్‌బాషా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి గురురాఘవేంద్ర ప్రాజెక్టు నిర్వహణ నిధులు వచ్చేలా ప్రయత్నిస్తాను. తద్వారా ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు శాయశక్తులా కృషి చేస్తాను.

Updated Date - Jul 07 , 2026 | 11:29 PM