లైంగిక వేధింపులకు పాల్పడిన హెచ్‌ఎం
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:17 AM
మంత్రాలయం మండలంలోని చెట్నహళ్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న వరప్రసాద్ మహిళా ఉపాధ్యాయులు, బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్లు విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు, మహిళా ఉపాధ్యాయులు మండిపడ్డారు.
మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినుల ఆరోపణ
హెచ్‌ఎంపై దాడికి తల్లిదండ్రుల యత్నం
సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
ఉన్నత అధికారులకు నివేదిక: ఎంఈవో నాగభూషణం
మంత్రాలయం, అక్టోబరు 7(ఆంధ్ర జ్యోతి): మంత్రాలయం మండలంలోని చెట్నహళ్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న వరప్రసాద్ మహిళా ఉపాధ్యాయులు, బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్లు విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు, మహిళా ఉపాధ్యాయులు మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్న భోజనం చేసే విషయంలో మహిళా ఉపాధ్యాయురాలు పిల్లలను కొట్టింది. దీనిపై హెచ్‌ఎం వరప్రసాద్ విద్యార్థులను రెచ్చగొట్టి భోజనాన్ని పడేసి టీచర్‌పై ధర్నా చేయండని బయటికి పంపించాడు. విద్యార్థులు లబోదిబోమంటూ ఎదురుగా ఉన్న ఉన్నత పాఠశాల ముందు ఏడవడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆరా తీశారు. ఆ పాఠశాలలో కొత్తగా మోగా డిఎస్సీలో ఎన్నికైన మహిళ ఉపాధ్యాయులను తనకు షేక్‌హ్యాండ్ ఇవ్వాలని, భోజనం వడ్డించాలని, తన దగ్గరే కూర్చొని భోజనం చేయాలని హెడ్‌మాస్టర్ వేధిస్తున్నాడని, రహస్యంగా వీడియోలు తీసి లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని టీచర్లు వాపోయారు. బాలికలు కూడా హెచ్‌ఎం తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మంత్రాలయం ఎస్‌ఐ మల్లికార్జున, ఎంఈవో నాగభూషణం తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని హెచ్‌ఎంను గదిలో ఉంచి తలుపులు వేశారు. ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు హెచ్‌ఎంకు దేహశుద్ధికి యత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఏఐవైఎఫ్, ఏఐఎ్‌సఎఫ్, ఆర్‌ఏవీఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు తరగతులను బహిష్కరించి పాఠశాల ముందు బైఠాయించి హెచ్‌ఎం వరప్రసాద్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆగ్రహంతో ఉన్న తల్లిదండ్రులను శాంతింపచేసేందుకు ఎస్‌ఐ, ఎంఈవోలు ప్రయత్నించారు. పోలీసులు హెచ్‌ఎం వరప్రసాద్‌ను, మరో ఉపాధ్యాయుడు అబ్దుల్లాను గ్రామస్తుల నుంచి తప్పించి మంత్రాలయానికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. మహిళ ఉపాధ్యాయులు, విద్యార్థినిలతో ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం లింగన్నతో ఎంఈవో నాగభూషణం వేర్వేరుగా విచారించి లైంగిక వేధింపులకు పాల్పాడిన హెచ్‌ఎం వరప్రసాద్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగాఉన్నత అధికారులకు నివేధికలు పంపించారు. ఈ విషయమై హెచ్‌ఎం వరప్రసాద్‌ను వివరణ కోరగా తాను అలాంటి వ్యక్తని కాదని అన్నారు.