నీటి లెక్కలు తేల్చండి..!
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:30 PM
తుంగభద్ర డ్యాంలో ఎల్లెల్సీ వాటాగా 10.455 టీఎంసీలు ఉన్నాయి.. హంద్రీ నీవా ప్రధాన కాలువ ద్వారా 3,050 క్యూసెక్కులు కృష్ణా జలాలు జిల్లా సరిహద్దు దాటిపోతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో సాగు నీటిపై సమీక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు
ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలు హాజరు
టీబీపీ ఎల్లెల్సీ వాటాలో సాగునీటికి 6.50 టీఎంసీలు
తాగునీటికి నాలుగు టీఎంసీలు
హంద్రీ నీవా నుంచి 68 చెరువులకు కృష్ణా జలాల ఎత్తిపోతలపై నివేదిక
సీఎం చంద్రబాబుతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం
కర్నూలు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాంలో ఎల్లెల్సీ వాటాగా 10.455 టీఎంసీలు ఉన్నాయి.. హంద్రీ నీవా ప్రధాన కాలువ ద్వారా 3,050 క్యూసెక్కులు కృష్ణా జలాలు జిల్లా సరిహద్దు దాటిపోతున్నాయి. అయినా పశ్చిమ పల్లెసీమల్లో రైతులకు కన్నీటి కష్టాలు తప్పడం లేదు. కాలువల కింద ఆయకట్టుకైనా సాగునీరు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం రైతులకు సాగునీరు ఇస్తే, దిగువన ఏపీ ప్రభుత్వం సాగునీటిపై ఎటూ తేల్చకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర జలనవరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మంగళవారం రాత్రి జిల్లా ప్రజాప్రతినిధులతో సాగు, తాగునీటి విడుదలపై సమీక్షించారు. టీబీపీ ఎల్లెల్సీ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సిందే అంటూ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అదే క్రమంలో హంద్రీ నీవా కాలువ ద్వారా 68 చెరువులు నింపడంతో పాటు లద్దగిరి స్లూయిస్ ద్వారా హంద్రీ నదికి తాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంజనీర్లతో నివేదికలు తెప్పించుకున్న మంత్రి నిమ్మల, జలనవరుల శాఖ సలహాదారుడు వెంకటేశ్వరరావు సాగునీటిపై నిర్ణయం తీసుకోలేదు. సీఎం చంద్రబాబుతో సమీక్షించిన తరువాతే సాగునీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం తెలుస్తుంది.
తుంగభద్ర డ్యాంలో 2026-27 నీటి సంవత్సరంలో 98 టీఎంసీలు వరద చేరే అవకాశం ఉందని ఈ నెల 10న జరిగిన టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ అంచనా వేసింది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)-1 కేటాయింపు దామాషా ప్రకారం ఎల్లెల్సీ వాటాగా 11.094 టీఎంసీలు కేటాయించారు. అప్పటికే 1.432 టీఎంసీలు తాగునీటి కోసం వినియోగించుకోగా.. డ్యాంలో 9.68 టీఎంసీలు మిగులు ఉన్నాయి. 2027 జూన్ వరకు అంటే 11 నెలలు ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక పట్టణాలు, సహా సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) పరిధిలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో 245 గ్రామాలకు తాగునీటికి ఎనిమిది టీఎంసీలు అవసరం ఉందని, ఈ ఏడాది ఒక్క పంటకు కూడా సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి, ఇరిగేషన్ ఇంజనీర్లు తేల్చిచెప్పారు. అయితే.. ఎగువన కర్ణాటక ప్రభుత్వం మాత్రం 90 రోజులు సాగు నీటి కోసం 650 క్యూసెక్కులు విడుదల చేస్తామని ప్రకటించడంతో పాటుగా ఎల్లెల్సీ కాలువకు నీరు విడుదల చేశారు. మా నీళ్లు దిగువ ఏపీకి ఇవ్వలేమంటూ 155 కిలోమీటర్లు వద్ద ఇసుక సంచులతో అడ్డుకట్ట వేసి, దిగువకు చుక్కనీరు రాకుండా అడ్డుకున్నారు. ఎగువన కర్ణాటక సాగునీరు ఇచ్చినప్పుడు, డ్యాంలో వాటా జలాలు పెట్టుకొని తమకెందుకు సాగునీరు ఇవ్వడం లేదంటూ పశ్చిమ ప్రాంతం ఎల్లెల్సీ రైతులు ప్రశ్నిస్తున్నారు. సాగునీరు వస్తాయనే ఆశతో వరినాట్లు కూడా మొదలు పెట్టారు. జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించి పంటలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సిన జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు దిశగా చర్యలు చేపట్టలేదు. రైతుల్లో వ్యతిరేకత రావడంతో జిల్లా ప్రతినిధులు ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుపై ఒత్తిడి తెచ్చారు.
ఇంజనీర్లు, ఎమ్మెల్యేలతో మంత్రి నిమ్మల సమీక్ష:
జిల్లాలో టీబీపీ ఎల్లెల్సీ, హంద్రీనీవా కాలువల ద్వారా సాగునీరు ఇవ్వాలనే డిమాండ్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు, జలనవరుల శాఖ సలహాదారుడు, రిటైర్డ్ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, టీబీపీ ఎల్లెల్సీ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ టిప్పుసుల్తాన్ పాల్గొన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఆదోని, మంత్రాలయం ఇన్‌చార్జిలు మాజీ ఎమ్మెల్యే కె. మీనాక్షినాయుడు, ఎన్. రాఘవేంద్రరెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు. జలవనరుల శాఖ నుంచి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషా, ఇరిగేషన్ కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ శైలేశ్వర్ హాజరయ్యారు. వచ్చే ఏడాది జూలై వరకు తుంగభద్ర జలాలు తాగునీటి కోసం వాడుకోవాల్సి ఉందని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. అయితే.. డ్యాంలో 110-125 టీఎంసీలు వరకు వరద చేరే అవకాశం ఉందని, టీబీపీ ఎల్లెల్సీ ఆయకట్టు ఖరీఫ్ పంటకు సాగునీరు ఇచ్చే అవకాశాలు ఉన్నా, ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో ప్రశ్నించారు. రైతులకు ఏమని సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దీంతో మంత్రి నిమ్మల టీబీపీ డ్యాంలో నీటి చేరికపై అంచనా నివేదిక ఇవ్వాలని టీబీపీ బోర్డు ఎస్‌ఈ నారాయణనాయక్‌కు సూచించారు.
సాగునీటికి 6.50 టీఎంసీలు?:
ఈ నెల 10న టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ 98 టీఎంసీలు వరద చేరవచ్చని అంచనా వేసింది. అందులో టీబీపీ ఎల్లెల్సీ వాటాగా 11.094 టీఎంసీలు, కేసీ కాలువ వాటా 4.623 టీఎంసీలు కేటాయించారు. ఆ తరువాత డ్యాంకు వరద భారీగా చేరింది. ప్రస్తుతం డ్యాంలో 94.171 టీఎంసీలు నిల్వ ఉండగా, 14,050 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. ఈ లెక్కన ఈ ఏడాది 110-125 టీఎంసీలు చేరవచ్చని జిల్లా నాయకులు పేర్కొంటున్నారు. అయితే.. టీబీపీ బోర్డు అధికారులు మాత్రం 105 టీఎంసీలు చేరవచ్చని అంచనా నివేదిక మంత్రి నిమ్మలకు ఇచ్చారు. ప్రకారం ఎల్లెల్సీ వాటా 12 టీఎంసీలు వస్తుందని, ఇప్పటికే వాడుకున్న 1.43 టీఎంసీలు పోనూ 10.57 టీఎంసీలు మిగులు ఉంటుందని ఇంజనీర్లు లెక్కలు వేశారు. అందులో సెప్టెంబరు ఒకటో తారీఖు నుంచి నవంబరు ఆఖరు వరకు 90 రోజులు ఆయకట్టుకు సాగునీరు, తాగునీటి కోసం 6.50 టీఎంసీలు ఇవ్వాలని, మిలిగిన నాలుగు టీఎంసీలు డిసెంబరు నుంచి జూలై వరకు మూడు విడతల్లో తాగునీటికి వినియోగించుకోవాలని సూచించారు. అయితే సాగునీటిపై మంత్రి నిమ్మల ఇప్పటికీ తేల్చకపోవడంతో రైతులు ఆందోళన చెందతున్నారు.
హంద్రీ నీవా నుంచి 68 చెరువుల నింపండి
హంద్రీనీవా కాలువ నుంచి కృష్ణా జలాలు ఎత్తిపోసి డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో 74 చెరువులు నింపాలని, కాలువ వెంబడి తూములు ఎత్తి తాగునీరు ఇవ్వాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో గళమెత్తారు. . అదే క్రమంలో హంద్రీ నీవా ద్వారా పాణ్యం, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు 32 గ్రామాల్లో 55,024 జనాభాకు తాగునీటి కోసం 0.281 టీఎంసీలు ఎస్‌ఎస్ ట్యాంకులు, చెరువులు, హంద్రీ నదిలోని ఇన్‌టెక్ వెల్స్‌కు విడుదల చేయాలంటూ గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులు లేఖ రాశారు. అదే క్రమంలో కృష్ణగిరి, పత్తికొండ జలాశయాలు నింపాలి. 110.44 కిలో మీటర్ల వద్ద స్లూయిస్ ఎత్తి గాజులదిన్నె జలాశయానికి నీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు నివేదిక ఇచ్చారు. 74 చెరువులు నింపేదుకు 1.238 టీఎంసీలు కావాలని, రోజుకు మూడు పంపుల ద్వారా 159 క్యూసెక్కులు ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు. అలాగే.. లద్దగిరి సమీపంలో హంద్రీనీవా కాలువ స్లూయిస్ ఎత్తి 150 క్యూసెక్కులు విడుదల చేస్తే కల్లూరు, కోడుమూరు మండలాల్లోని 18 గ్రామాల్లో ప్రజలు, మూగజీవాలు, పశువులకు దాహం తీర్చే అవకాశం ఉంది. హంద్రీ నదికి నీరు విడుదల చేస్తే బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరిగి కర్నూలు వరకు నీటి సమస్య తీరుతుందని పలువురు అంటున్నారు. దీనిపై కూడా మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీరింగ్ అధికారులతో నివేదిక తెప్పించుకున్నారు. నేడో రేపో సీఎం చంద్రబాబుతో చర్చించి టీబీపీ ఎల్లెల్సీ, హంద్రీనీవా ద్వారా తాగునీటితో పాటు సాగునీటి విడుదలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.