Share News

సీమ స్వరం సిద్ధేశ్వరం

ABN , Publish Date - May 16 , 2026 | 11:45 PM

ప్రధానంగా వర్షాధార వ్యవసాయం చేసే రాయలసీమలో సిద్ధేశ్వరం అలుగు లేదా బ్రిడ్జి కం బ్యారేజ్‌ నిర్మించాలనే డిమాండ్‌ ఉద్యమరూపంగా సాగింది.

సీమ స్వరం సిద్ధేశ్వరం
సిద్ధేశ్వరం వద్ద కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించే ప్రదేశం ఇదే

సీమవాసుల ఎడతెగని కలగా బ్రిడ్జికం బ్యారేజ్‌ ఆందోళన

తీగల వంతెనపై సర్వత్రా వ్యతిరేకత

పర్యాటకం పేరుతో ఐకానిక్‌ బ్రిడ్జికే కేంద్రం మొగ్గు

సాగునీటి ప్రాజెక్టు కోసం సీమ వాసుల పట్టు

ప్రధానంగా వర్షాధార వ్యవసాయం చేసే రాయలసీమలో సిద్ధేశ్వరం అలుగు లేదా బ్రిడ్జి కం బ్యారేజ్‌ నిర్మించాలనే డిమాండ్‌ ఉద్యమరూపంగా సాగింది. కృష్ణా బేసిన్‌లో నీటికి కొరత లేకపోయినా రాయలసీమ కరువు కాటకాల బారిన పడింది. నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం జలాశయంలో సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తే 50 టీఎంసీల నీరు నిలువ అవుతుంది. శాశ్వత పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. కృష్ణానది జలాలతో కోస్తాంరఽధలో మూడు పంటలు పండుతున్నాయి. అలుగు నిర్మించి, నదిలోని నీటిని నిలువ చేస్తే నందికొట్కూరు దగ్గర ఉండే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమకు అందించే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం అలుగు స్థానంలో తీగల వంతెన నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.

నందికొట్కూరు, మే 16 (ఆంధ్రజ్యోతి): బ్రిటీష్‌ కాలంలో కృష్ణా పెన్నారు ప్రాజెక్టు ప్రతిపాదనకు వచ్చింది. ఇది సంగమేశ్వరం ప్రాజెక్టుగా మారి చరిత్రలో కలిసిపోయింది. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్ధేశ్వరం గ్రామం వద్ద కృష్ణానదిపై ఈ ప్రాజెక్టును నిర్మించి సీమ కరువును తీర్చేందుకు 1756 సంవత్సరంలో ఆంగ్లేయులు గార్జన్‌ కమిటీ నివేదికతో ఈ ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. దీని మీద 1947 వరకు 21 నివేదికలను బ్రిటీష్‌ ప్రభుత్వం సిద్ధం చేసింది. కాని అవి నాడు కార్యరూపం దాల్చలేదు. సిద్ధేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి 1958లోనే ప్లానింగ్‌ కమిషన్‌ అనుమతి ఇచ్చింది. కానీ ఆ ప్రాజెక్టు పక్కకుపోయి ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున ప్రాజెక్టులను నిర్మించారు. సిద్ధ్దేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉంటే రాయలసీమకు అవసరమైనన్ని నికర జలాలు అందేవి. లక్షల ఎకరాలు సస్యశ్యామలమయ్యేవి. కానీ దీనికి విరుద్ధంగా శ్రీశైలం జలాశయం కేవలం విద్యుచ్ఛక్తికి మాత్రమే ఉపయోగపడేలా నిర్మించారు. రాయలసీమకు సాగునీరు, తాగునీరు ఇచ్చే సిద్ధేశ్వరం ప్రాజెక్టు బదులు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మించి, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించడంతో ఆనాటి ఉమ్మడి కర్నూలు జిల్లా సహా రాయలసీమ కరువు ప్రాంతాలు తీరని అన్యాయానికి గురయ్యాయనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో 1973లో సిద్ధేశ్వరం ప్రాజెక్టు కార్యాచరణ సంఘం ఏర్పడింది. మర్రి చెన్నారెడ్డి హయాంలో శ్రీశైలం కుడి గట్టు కాలువ ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీరందించే అంగీకారం కుదిరింది. 1981లో ప్రణాళికా సంఘం ఆమోదం లభించింది. అవేవీ అమలులోకి రాలేదు. 1983లో వెలుగోడులో తెలుగుగంగ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కానీ సిద్ధేశ్వరం ప్రాజెక్టు గురించిన ఆకాంక్ష ప్రజల్లో అలాగే ఉండిపోయింది.

బ్రిడ్జి కమ్‌ బ్యారేజ్‌ డిమాండ్‌

సిద్ధేశ్వరం ప్రాజెక్టు పక్కకుపోయి కోస్తా ప్రాంతానికి మేలు చేసే నీటిపారుదల వ్యవస్థ ఏర్పడింది. అయితే రాయలసీమ కరువు సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా సిద్ధేశ్వరం అలుగు లేదా బ్రిడ్జి కం బ్యారేజ్‌ ప్రతిపాదన ముందుకు వచ్చింది. సీనియర్‌ ఇంజనీర్‌ సుబ్బరాయుడు శ్రీశైలం జలాశయంలో అలుగు నిర్మాణాన్ని ప్రతిపాదించారు. 50 టీఎంసీల నీటితో సీమకు ప్రాణం పోసే మార్గంగా సిద్ధేశ్వరం అలుగు డిమాండ్‌ ఒక ప్రజా ఉద్యమ రూపం తీసుకుంది. 2016 మే 31వ తేదీన రాయలసీమ జిల్లాల నుంచి 30 వేల మంది రైతులు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ అరుణ్‌, సిద్ధేశ్వరం ప్రాజెక్టు సాధన కమిటీ అధ్యక్షుడు వై.ఎ్‌సరెడ్డి నాయకత్వంలో అలుగు నిర్మాణానికి ప్రజా శంకుస్థాపన చేశారు. ఈ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఎట్టకేలకు కపిలేశ్వరం వద్ద సీమ నేతలు అలుగు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో రాయలసీమ ఉద్యమం కొత్త ఒరవడిని సంతరించుకున్నది. సిద్ధేశ్వరంతో పాటు సీమలోని పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, నీటి వాటాపై చట్టబద్ధ హక్కులు కల్పించాలని రాయలసీమ ఉద్యమం నడుస్తోంది. ప్రతి ఏటా మే 31వ తేదీన సీమలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, రాయలసీమ ఉద్యమ సంస్థలు, మేధావులు సప్త నదుల సంగమ ప్రాంతమైన నల్లమలలోని సంగమేశ్వరం దగ్గరికి వెళ్లి సిద్ధేశ్వరం అలుగు లేదా బ్రిడ్జికం బ్యారేజ్‌ నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా పదేళ్లుగా ఏదో ఒక కార్యక్రమం ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు. 2017లో సీమ సత్యాగ్రహం, 2018 ఛలో సిద్ధేశ్వరం, 2019లో ప్రజా పాదయాత్ర చేశారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా విపత్తు కారణంగా ఇళ్ల నుంచే నిరసనలు చేపట్టారు. ఇలా గత ఏడాది మే 31న కూడా పెద్ద ఎత్తున రైతులు సంగమేశ్వరం దగ్గరికి వెళ్లి అలుగు నిర్మాణ అవసరం కోసం ధర్నా నిర్వహించారు. అలుగు లేని పక్షంలో బ్రిడ్జి కం బ్యారేజ్‌ నిర్మిస్తే రాయలసీమకు సాగునీటి కొరత ఉండదని రాజకీయ ప్రజా సంఘాల నాయకుల నుంచి డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. ఇంత కాలంగా తమ డిమాండ్‌ను వివిధ పార్టీల ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంపై రాయలసీమ పోరాట సంస్థలు పెదవి విరుస్తున్నాయి. ఇదే క్రమంలో బ్రిడ్జి కం బ్యారేజ్‌ నిర్మించాలన్న నినాదం సీమ ప్రజల్లో నాటుకుపోయింది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా తమ ప్రాంత సమస్యలు పరిష్కారం కావడం లేదనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణలోని సోమశిల, నంద్యాల జిల్లాలోని సిద్ధేశ్వరం వద్ద కృష్ణానదిపై అతి తక్కువ ఖర్చుతో బ్రిడ్జి కం బ్యారేజ్‌ నిర్మించాలనే ప్రజా డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. అక్కడ ఒక ఐకానిక్‌ బ్రిడ్జిని రూ.1200 కోట్లతో నిర్మించాలని కేంద్రం తలపెట్టింది. ఈ తీగల వంతెన వల్ల సీమ కరువు తీరదని రాయలసీమ మేధావులు, నాయకులు అంటున్నారు. బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ నిర్మిస్తే రాయలసీమకు మేలు జరుగుతుందని డిమాండ్‌ చేస్తున్నారు. ఐకానిక్‌ వంతెన కంటే బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణం చాలా తక్కువ ఖర్చుతో కేవలం రూ.700 కోట్లతో పూర్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

సిద్ధేశ్వరం అలుగు లేదా బ్రిడ్జి కం బ్యారేజ్‌ నిర్మించాల్సిన ప్రదేశంలో కల్వకుర్తి- జమ్మలమడుగు వరకు 167కే జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ కృష్ణానదిపై ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2022 నవంబరులో శ్రీకారం చుట్టింది. ఐకానిక్‌ బ్రిడ్జి ఏర్పాటుకు టెండర్లు పూర్తి అయ్యాయి. అయితే ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇదిలా ఉంటే ఐకానిక్‌ బ్రిడ్జి కేవలం పర్యాటకం, రవాణా వ్యవస్థకు లాభపడుతుంది. అదే సిద్ధేశ్వరం వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి కం బ్యారేజ్‌ నిర్మిస్తే రవాణా వ్యవస్థతో పాటు సాగునీటి కష్టాలు తీరుతాయన్నది సీమ వాసుల వాదన. పర్యాటకానికి ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వాలు రైతాంగం గురించి ఎందుకు ఆలోచించడం లేదని సీమ మేధావులు ప్రశ్నిస్తున్నారు.

సిద్ధేశ్వరం ప్రాజెక్టుతో సీమ సస్యశ్యామలమయ్యేది

గత 50 సంవత్సరాల కింద సిద్ధేశ్వరం ప్రాజెక్టు కార్యాచరణ సంఘం ఏర్పాటు చేసి ఎన్నో ఉద్యమాలు నిర్వహించాం. ఈ డిమాండ్‌తో చాలా మంది నాయకులను కలిశాం. 1973లో గవర్నరు సలహాదారు హెచ్‌.సి. శరీన్‌కు వినతిపత్రం ఇచ్చాం. ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ సహా గతంలో పని చేసిన పలు ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, నీలం సంజీవరెడ్డి, నందమూరి తారకరామారావులకు కూడా సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని ఎన్నో వినతులు సమర్పించాను. ఇటీవల కూడా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, పురందేశ్వరి, నారా లోకేశ్‌ అందరికి సిద్ధేశ్వరం బ్రిడ్జి కం బ్యారేజ్‌ నిర్మాణంతో జరిగే అభివృద్ధిని వివరించాను. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే ఐకానిక్‌ బ్రిడ్జి బదులు బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మిస్తే 50 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. దీంతో సీమలో మరో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగానికే సిద్ధేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది. అలాగే పర్యాటక రంగం కూడా అభివృద్ధి అవుతుంది. ఎలాంటి వివాదాలు లేని సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

- వేణుగోపాలరావు, సిద్ధేశ్వరం ప్రాజెక్టు కార్యాచరణ సంఘం అధ్యక్షుడు, నందికొట్కూరు, నంద్యాల జిల్లా

Updated Date - May 16 , 2026 | 11:45 PM