ఉద్యాన హబ్‌గా సీమ
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:47 PM
రానున్న రోజుల్లో రాయసీమను ఉద్యానహబ్‌గా మార్చి రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
డోన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
కొత్తబురుజుల గ్రామ అభివృద్ధి బాధ్యత కలెక్టర్‌దే
నెల రోజుల్లో రైతులకు పాసు పుస్తకాలు
చెరువులకు నీరిచ్చిన ఘనత టీడీపీదే
కొత్తబురుజుల సభలో చంద్రబాబునాయుడు
సీఎం నేతృత్వంలో పలు పనులకు తీర్మానాలు
నంద్యాల, మార్చి9(ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో రాయసీమను ఉద్యానహబ్‌గా మార్చి రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం డోన్ మండలం కొత్తబురుజుల గ్రామంలో సర్పంచ్ ప్రమీల అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీ భూమి- మీ హక్కు గ్రామ సభ నిర్వహించారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను సీఎం చంద్రబాబునాయుడు సందర్శించి కొత్తబురుజుల గ్రామంలోని 718 మంది రైతులకు పాసు పుస్తకాలను అందజేశారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సమస్యలను అక్కడికక్కడ పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాయలసీమలోని రిజర్వాయర్లు, చెరువులను నీటితో నింపి రైతులకు అండగా నిలుస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ రోడ్లును గుంతలు లేకుండా చేశామన్నారు. త్వరలో పంచాయతీ రోడ్లులో కూడా గుంతలు లేకుండా చూస్తా మన్నారు. జిల్లాలో ఉద్యాన పంటలను పెంచి దేశ విదేశాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాలో నీటి తక్కువుగా ఉన్న డోన్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రతిపాదనలను పరిష్కారించడానికి ప్రయత్నిస్తామన్నారు. హంద్రీనీవా, గాలేరు, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే తన లక్ష్యమన్నారు. ఇప్పటికే డోన్‌లోని 30 చెరుకులతో పాటు కుప్పంకు నీరు తీసుకెళ్లామన్నారు. కొత్త బురుజులలోని 12మంది రైతులకు నెల రోజుల్లోపు పాసుబుక్కులు ఇచ్చేలా చూడాలని కలెక్టర్‌ను అదేశించారు. అంతేకాకుండా కొత్తబురుజుల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉందన్నారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందుగా పాసుబుక్కులపై జగన్ ఫొటోలు ఉండేవని, కూటమి అధికారంలోకి రాగానే.. వాటిని తొలగించి రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చామని, ఆ మేరకు ఇప్పుడు ఇచ్చామని తెలిపారు. గుండ్రేవుల వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. నంద్యాలకు చిట్టచివరి గ్రామం కొత్త బురుజుల గ్రామమన్నారు .రైతులంతా బోరుబావుల తవ్వి పంటలను పండిస్తున్నారన్నారు. ఆధునిక పద్ధతులను అవలంభించి పంటలను పండిస్తున్నారన్నారు. నంద్యాల జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తిలోను(జీడీపీ)డోన్ రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. మన నీరు- మన సంపద అనే నినాదం కార్యరూపం దాల్చేలా నీటి వనరులను రైతులకు అందించేందుకు సమన్వయంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఐదు విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశామన్నారు. 1567 మెగావాట్ల సామర్థ్యంతో సుమారు రూ. 9700 కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టులను ఏర్పాటు చేశామన్నారు. వీటి వల్ల సుమారు 2000మంది ఉపాధి కలుగుతోందన్నారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లోని 145 గ్రామాల్లో భూ రీసర్వే చేపడుతున్నామన్నారు. ఇది డోన్ మండలంలో 16 గ్రామాల్లో సాగుతోందన్నారు. 140 రోజుల్లో రీ సర్వే పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, డీఐజీ డా. కోయ ప్రవీణ్, ఎస్పీ సునీల్ షెరాన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గిత్తా జయసూర్య, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరయాదవ్, వాల్మీకి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు సలీంద్ర శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
సీఎంకు ఎమ్మెల్యే వినతి...
డోన్ పరిధిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలి.
నంద్యాల నుంచి కోవెలకుంట్ల వరకు ఫోర్ లైన్ రహదారి నిర్మాణం చేయడంతో పాటు బైపాస్ రహదారులు ఏర్పాటు చేయాలి.
ప్రధానంగా మైనింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి.
వాల్మీకులకు ఇచ్చిన హామీలను పరిష్కరించాలి.
ప్రధానంగా రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడం అత్యంత కీలకం.
బుడగ జంగాల సమస్యలను పరిష్కారించాలి.
కొత్తబురుజుల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా కలెక్టర్ రాజకుమారి తీర్చిదిద్దాలని సీఎం అదేశించారు. దీంతో పలు అభివృద్ధి పనులు చేయాలని సీఎం దిశా నిర్దేశం చేశారు.
డోన్‌ను కర్నూలు జిల్లాలో కలపాలి.
సీఎం కార్యక్రమంలో తీర్మానాలు ఇవే...
సీఎం చంద్రబాబు నేతృత్వంలో కొత్తబురుజుల గ్రామానికి చెందిన మూడు ప్రధాన పంచాయతీ తీర్మానాలు చేశారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, కొత్త బురుజుల గ్రామంలో 50 మీటర్ల సీసీ రోడ్డు, కొత్త బోరు బావి నిర్మాణం కోసం తీర్మానాలు చేశారు.
కార్యకర్తల్లో జోష్....
సీఎం రాకతో.. కొత్త బురుజుల గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తలో జోష్ కనిపించింది. సీఎం ప్రసంగం సమయంలో ఈలలు, కేకలతో హోరెత్తించారు. టీడీపీ జెండాలను రెపరెపలాడించారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను అందజేయడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమైంది.