Share News

రైతుకేసీ చూడండి

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:59 PM

శ్రీశైలం డ్యాంలో పుష్కలంగా కృష్ణా జలాలు ఉన్నాయి. రబీకి సాగునీటికి ఢోకా ఉండదని కర్నూలు-కడప (కేసీ) ఆయకట్టు రైతులు వివిధ పంటలు సాగు చేశారు.

రైతుకేసీ చూడండి
అడుగంటిన కేసీ కాలువ

సుంకేసుల బ్యారేజీ నుంచి ఆగిన నీటి విడుదల

50 వేల ఎకరాల్లో వివిధ పంటలు

మాల్యాల, ముచ్చుమర్రి నుంచి సాగునీరు ఇవ్వండి

రైతుల డిమాండ్‌

ఇవ్వలేమంటున్న ఇంజనీర్లు

శ్రీశైలం డ్యాంలో పుష్కలంగా కృష్ణా జలాలు ఉన్నాయి. రబీకి సాగునీటికి ఢోకా ఉండదని కర్నూలు-కడప (కేసీ) ఆయకట్టు రైతులు వివిధ పంటలు సాగు చేశారు. పైర్లు వివిధ దశల్లో ఉన్నాయి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. కష్టాలు తీరుతాయని ఆశించారు. ఇంతలో సుంకేసుల బ్యారేజీ నుంచి కేసీ కాలువకు నీటి విడుదల ఆపేశారు. తడులు లేక వాడిపోతున్న పైర్లను చూసిన కష్టజీవుల కళ్లలో కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. ‘అయ్యా..! ముచ్చుమర్రి, మాల్యాల ఎత్తిపోతల ద్వారా సాగునీరు ఇచ్చి ఆదుకోండి..’ అంటూ రైతులు కర్నూలులో జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. ‘ఐఏబీలో సాగునీరు ఇస్తామని చెప్పలేదు.. కేఆర్‌ఎంబీ అనుమతులు లేకుండా నీళ్లివ్వడం కుదరదు..’ అని అధికారులు తేల్చేశారు. సాగునీరు ఇవ్వకపోతే పెట్టుబడులు, దిగుబడుల రూపంలో దాదాపుగా రూ.750-800 కోట్లకు పైగా నష్టపోతాం, అప్పుల ఊబిలో కూరుకుపోతామని కష్టజీవులు కన్నీళ్లు పెడుతున్నారు.

కర్నూలు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కేసీ కాలువ కింద ఖరీ్‌ఫలో 1,75,338 ఎకరాలు, రబీలో 90 వేల ఎకరాల స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. కేడబ్ల్యూడీటీ అవార్డు (జస్టిస్‌ బచావత్‌ అవార్డు)-1 ప్రకారం 31.90 టీఎంసీలు నికర జలాలు కేటాయించారు. అందులో 10 టీఎంసీలు తుంగభద్ర డ్యాం నుంచి తీసుకోవాల్సి ఉంది. 21.90 టీఎంసీలు సుంకేసుల జలాశయం నుంచి నది ప్రవాహం ద్వారా తీసుకోవాలి. సుంకేసుల బ్యారేజీ సామర్థ్యం కేవలం 1.20 టీఎంసీలే. వరద ఉంటే తప్పా కేసీకి సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అలాగే కర్నూలు నగరం సహా వివిధ గ్రామాల తాగునీటి అవసరాలు కూడా తీర్చాల్సి ఉంది. తుంగభద్ర డ్యాం నుంచి ఈ ఏడాది 7.927 టీఎంసీలు కేటాయించినా, అందులో అనంతపురం జిల్లాకు మూడు టీఎంసీలు మళ్లించారు. నాలుగు టీఎంసీలు వాటా ఉన్నప్పటికీ వేసవిలో తాగునీటి అవసరాల కోసం ఉంచారు. నదిలో వరద లేకపోవడంతో ఈ నెల 15న కేసీ కాలువకు సాగునీటి విడుదల ఆపేశారు. అంతేకాదు నంద్యాల ఐఏబీ సమావేశంలో కూడా రబీ పంటలకు సాగునీరు ఇవ్వలేమని తీర్మానం చేశారు.

రైతుల ఆశలపై నీళ్లు

ఈ ఏడాది తుంగభద్ర, కృష్ణా నదులు ఉప్పొంగాయి. తుంగభద్ర నుంచి 402 టీఎంసీలకే పైగా శ్రీశైలానికి విడుదల చేశారు. శ్రీశైలం డ్యాంకు 2,350 టీఎంసీల వరద చేరింది. సుమారుగా 1,800 టీఎంసీలు శ్రీశైలం గేట్లేత్తి దిగువన నాగార్జున సాగర్‌కు వదిలేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 167.87 టీఎంసీలు ఉన్నాయి. కళ్ల ముందే పుష్కలంగా కృష్ణమ్మ ప్రవహిస్తుంటే సాగునీటికి డోకా ఉండదని రైతులు భావించారు. ఖరీ్‌ఫలో అధిక వర్షాలు, తుఫాన్లు నిలువున ముంచేయడంతో రబీ ఆశతో.. కర్నూలు మండలం సుంకేసుల నుంచి నంద్యాల జిల్లా పాములపాడు మండలం పోతిరెడ్డిపాడు వరకు 0/0 కిలోమీటరు నుంచి 150 కిలో మీటరు వరకు 40-50 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. 150 కిలో మీటరు నుంచి కడప జిల్లాలో 301 కిలో మీటర్లు వరకు మరో 90 వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న.. వంటి వివిధ పంటలు సాగు చేశారు. ఏపుగా పెరుగుతున్న పంటలను చూసి కష్టాలు తీరుతాయని ఆశించారు. అయితే.. ఈ నెల 15న సుంకేసుల బ్యారేజీ నుంచి కేసీ కాలువకు నీటి విడుదల ఆపేశారు. ప్రత్యామ్నాయంగా ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాలు ద్వారా కేసీ కాలువకు కృష్ణా జలాలు ఎత్తిపోసి రైతుల కన్నీళ్లు తుడుస్తారని ఆశిస్తే, కేసీ ఒట్టిపోయిందే తప్పా నీటిని ఎత్తిపోయలేదు. దాదాపు పది రోజులు గడవడంతో తడులు అందక సాగులో ఉన్న పంటలు వాడిపోతున్నాయి.

నీళ్లిస్తామని ఐఏబీలో తీర్మానం చేయలేదు

సాగునీరు ఇచ్చి కన్నీళ్లు తుడవాలంటూ కొర్రపోలూరు, తుడిచర్ల, పాములపాడు, జూపాడుబంగ్లా, బ్రహ్మణకొట్కూరు, నందికొట్కూరు గ్రామాలకు చెందిన రైతులు కర్నూలులోని జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. ముచ్చుమర్రి, మాల్యాల ఎత్తిపోతల పథకాలు నుంచి కృష్ణా జలాలు ఎత్తిపోసి 0/0 నుంచి 150 కి.మీల పరిధిలో 40-50 వేలు ఎకరాల్లో పంటలు కాపాడాలని వేడుకున్నారు. సాగునీరు ఇస్తామని స్పష్టమైనా హామీ ఇవ్వకపోగా, రబీకి సాగునీరు ఇవ్వలేమని ఐఏబీలో తీర్మానం చేశాం.. మీరెందుకు పంటలు వేశారు..? ఇప్పుడొచ్చి నీళ్లడిగితే కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండా నీళ్లు ఇవ్వలేమని తేల్చిచెప్పడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు.

నీళ్లిచి రైతులను ఆదుకోండి

శ్రీశైలం జలాశయంలో 168 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ముచ్చుమర్రి, మాల్యల లిఫ్టుల ద్వారా కేసీ కాలువకు నీటిని ఎత్తిపోసి సాగులో ఉన్న పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మనోహర్‌ నాయుడు శుక్రవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలసి వినతి పత్రం అంజేశారు. ముచ్చుమర్రి నుంచి వేయి క్యూసెక్కులు, మల్యాల నుంచి 650 క్యూసెక్కులు ఇవ్వాలని కోరారు.

కృష్ణా బోర్డుకు లేఖ

కేసీ కాలువ కింద 0/0 - 150 కి.మీల పరిధిలో సాగులో ఉన్న పంటలు కాపాడాలంటే దాదాపు 4-5 టీఎంసీలు కావాల్సి ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. కనీసం ఒక తడికైనా నీళ్లు ఇవ్వాలన్నా 2-3 టీఎంసీలు అవసరం ఉంది. ఇదే విషయంపై ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌బాషా ఈఎన్‌సీ నరసింహమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి నిమ్మల, ఈఎన్‌సీ నరసింహామూర్తి, ప్రభుత్వ సాగునీటి సలహదారుడు వెంకటేశ్వరరావు ఉన్నతస్థాయి భేటీ నిర్వహించి చర్చించారు. కేసీ రైతుల నీటి అవసరాలను కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, ఇరు రాష్ట్రాల నీటి అవసరాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేఆర్‌ఎంబీ చెప్పినట్లు సమాచారం.

ఐఏబీ నిర్ణయం మేరకే నీటిని ఆపేశాం

నంద్యాల ఐఏబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలులో భాగంగానే కేసీ కాలువకు నీటి విడుదలు ఆపేశాం. శ్రీశైలం డ్యాం నుంచి ముచ్చుమర్రి, మాల్యాల లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే కేఆర్‌ఎంబీ ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అనుమతి లేకుండా నీటిని తీసుకోవడం సాంకేతికంగా, చట్టపరంగా సాధ్యం కాదు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే పని చేస్తుంది. అయితే అందుబాటులో లేని నీటిని సరఫరా చేయలేం. రైతులు అవగాహన చేసుకోవాలి. ముందస్తు అనుమతులు లేకుండా నీటిని ఆపేయలేదు. ఐఏబీ తీర్మానం మేరకే ఆపేశామని ఓ ప్రకటన విడుదల చేశారు.

బి.బాలచంద్రారెడ్డి, ఎస్‌ఈ, జలవనరుల శాఖ, కర్నూలు

Updated Date - Jan 23 , 2026 | 11:59 PM