నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:38 PM
జిల్లాలో నామినేషన్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శనివారం కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు
ప్రశాంతంగా కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నామినేషన్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శనివారం కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీలతో పాటు గూడూరు నగర పంచాయతీ పరిధిలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ప్రశాంత వాతావరణంలో కొనసాగిందన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నామినేషన్ల ప్రక్రియలో అన్ని పార్టీల అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు లోబడి తమ పత్రాలను దాఖలు చేస్తున్నారన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిని నిర్దేశించి బారికేడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు అనుమతి ఉన్న పరిమిత వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నామన్నారు. అలాగే ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందన్నారు. సోమవారం ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈ నెల 28వ తేదీన పోలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలవడానికి ముందే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల కమిషన్ నిబంధనలన్నింటినీ స్పష్టంగా వివరించామన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తప్పకుండా పాటిస్తే ఎన్నికలు శాంతియుతంగా జరుగుతాయని ఎస్పీ తెలిపారు. సీఐలు మధుసూదన్ రావు, రామయ్యనాయుడు ఉన్నారు.
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయండి
ఎన్నికల ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం నగరంలో విస్తృతంగా పర్యటించి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ముజఫర్ నగర్, షరీన్నగర్, గురు రాఘవేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లోని కార్పొరేటర్ల పోలింగ్ నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. వీకర్సెక్షన్ కాలనీలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన జడ్పీహెచ్ఎ్స, ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాలలను పరిశీలించి అక్కడి బూత్ వివరాలు, ఓటర్ల సంఖ్య తదితర అంశాలను సీఐ విక్రమసింహను అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా మున్సిపల్ అధికారులు సమన్వయంతోజాగ్రత్తలు తీసుకోవాలనిన్నారు.స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్రావు ఉన్నారు.