సచివాలయ ఉద్యోగులకు షాక్
ABN , Publish Date - May 29 , 2026 | 12:14 AM
కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పదిమంది సచివాలయ ఉద్యోగులకు కమిషనర్ చల్లా ఓబులేసు షాకిచ్చారు.
కర్నూలు కార్పొరేషన్ లో పది మందికి కమిషనర్ షోకాజ్ నోటీసులు
కర్నూలు న్యూసిటీ, మే 28(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పదిమంది సచివాలయ ఉద్యోగులకు కమిషనర్ చల్లా ఓబులేసు షాకిచ్చారు. కర్నూలు 16,17,43 సచివాలయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఉన్నతాధికారులు సంబంధిత సచివాలయాల పరిధిలో బుధ, గురువారాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన మంత్రితో అక్కడి స్థానికులు వార్డు సచివాలయ సిబ్బంది తమకు అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదు చేశారు. 6వ వార్డు పరిధిలోని 16వ సచివాలయాన్ని మంత్రితో పాటు కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమిషనర్ అక్కడి సచివాలయ సిబ్బంది ప్రతి రోజు నమోదు చేసే హాజరు పుస్తకాన్ని పరిశీలించారు. కార్యాలయం పని వేళల్లో ఎక్కడికి వెళ్లారని అక్కడ ఉన్న ఒక ఉద్యోగిని అడగ్గా పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో కార్యాలయంలోని లేని ఉద్యోగులకు షోకాజు నోటీసులు జారీ చేయాలని మంత్రి కమిషనర్‌ను ఆదేశించారు. వార్డు సచివాలయాల్లో గత ప్రభుత్వ హయాంలోని పథకాల కరపత్రాలు, వైఎస్ జగన్ ఫొటోలతో కూడిన బ్యాగులను చూసిన మంత్రి టీజీ భరత్ అసహనం వ్యక్తం చేశారు. అసలు వార్డు సచివాలయ సిబ్బందిని పర్యవేక్షించాల్సిన నోడల్ అధికా రులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. జోహరాపురం, గడ్డవీధి, ఏ.క్యాంపు ప్రాంతాల్లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కాని సచివాలయ సిబ్బంది జాబితాను పంపాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.