Share News

ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:45 PM

ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన

ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన
అభ్యర్థుల గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్న పోలీసులు

జడ్పీటీసీలు-167, ఎంపీటీసీలు-1391 ఆమోదం

బనగానపల్లెలో ఐదు జడ్పీటీసీలు కూటమికే

నంద్యాల/నంద్యాల హాస్పిటల్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి శనివారం రాత్రి వరకు నామినేషన్‌ పత్రాల పరిశీలన కార్యక్రమం జరిగింది. రాత్రి 9 గంటల వరకు నామినేషన్‌ పత్రాల పరిశీలన కార్యక్రమం జరిగింది. 28 జడ్పీటీసీ స్థానాల కోసం 216 మంది నామినేషన్‌ దాఖలు చేయగా వాటిని స్ర్కూటీని చేసిన అధికారులు 167 మంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత ఉన్నట్లు ప్రకటించారు. అదేవిధంగా 377 ఎంపీటీసీ స్థానాలకు 1,391 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. జడ్పీ స్థానాలను పార్టీల పరంగా పరిశీలిస్తే టీడీపీ-60, వైసీపీ-44, జనసేన- 20, బీజేపీ- 5 సీపీఐ, సీపీఎం- 7, కాంగ్రేస్‌- 14, బీఎస్పీ- 4, బీసీవైపీ- 3, ఇతర పార్టీలు- 1, ఇండిపెండెంట్‌లు- 9 చొప్పున ఆమోదం పొందాయి. ఇక 377 ఎంపీటీసీ స్థానాలకు వివిధ పార్టీల నుంచి 1,640 నామినేషన్లు దాఖలు కాగా.. పరిశీలనలో 1,391 నామినేషన్లు ఆమోదం పొందాయి. మిగిలిన 249 తిరస్కరించారు. పార్టీల పరంగా పరిశీలిస్తే.. టీడీపీ-654, వైసీపీ- 538, జనసేన- 76, బీజేపీ-37, సీపీఐ, సీపీఎం- 16, కాంగ్రేస్‌- 11, బీఎస్పీ-1, ఇతరులు-21, ఇండిపెంటెంట్‌- 37 చొప్పున ఆమోదం పొందాయి.

కూటమి కోటాలోకి బనగానపల్లె సంస్థానం

బనగానపల్లె నియోజకవర్గంలోని అన్ని జడ్పీ స్థానాలు టీడీపీ వశం కానున్నాయి. శనివారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనలో సంజామల, కోవెలకుంట్ల, అవుకు మండలాల నుంచి టీడీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. ఇతర పార్టీల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అదేవిధంగా ఇదే నియోజకవర్గంలోని బనగానపల్లె, కొలిమిగుండ్ల మండలాలు సైతం కూటమి ఖాతాలోకే రానున్నాయి. బనగానపల్లెలో ఇద్దరు టీడీపీ అభ్యర్థులు, ఒక జనసేన అభ్యర్థి నామినేషన్లు మాత్రమే మిగిలాయి. వారిలో ఇద్దరు ఆదివారం విరమించుకుంటారు. అదేవిధంగా కొలిమిగుండ్ల నుంచి రెండు నామినేషన్లు టీడీపీ అభ్యర్థులు దాఖలు చేయగా వారిలో ఒకరు విత్‌డ్రా చేసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించారు. దీంతో ఐదు జడ్పీటీసీ స్థానాలు కూటమిపరం కానున్నాయి.

Updated Date - Oct 24 , 2026 | 11:46 PM