ఉద్యమంలా ‘బడి పిలుస్తోంది’
ABN , Publish Date - May 18 , 2026 | 11:30 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను భారీ స్థాయిలో పెంచేందుకు చేపడుతున్న ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, మే 18 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను భారీ స్థాయిలో పెంచేందుకు చేపడుతున్న ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాల్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. మంగళవారం అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలన్నారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న దాదాపు 10 వేల మంది పిల్లలు ఉన్నప్పటకీ వారిలో కేవలం 6,500 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చేరారన్నారు. ఈ సంఖ్యను పెంచేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫిర్యాదుల స్వీకరణ: కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ రాజకుమారి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను ఆ యా విభాగాలకు కేటాయించడంతో పాటు త్వరితగతిన పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రామునాయక్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు.