నాడు నేడు.. అవస్థలు చూడు..
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:29 AM
గత వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన నాడు-నేడు పనులు అస్థవ్యస్తంగా మారాయి. పాఠశాలల రూపురేఖలను మారుస్తామంటూ ఆర్భాటం చేసి అనంతరం వదిలేయడంతో అటు పూర్తికాక, ఇటు ఉపయోగించుకోలేక విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు.
పాఠశాలల భవనాలను మధ్యలోనే వదిలేసిన వైసీపీ ప్రభుత్వం
కొలిమిగుండ్ల, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన నాడు-నేడు పనులు అస్థవ్యస్తంగా మారాయి. పాఠశాలల రూపురేఖలను మారుస్తామంటూ ఆర్భాటం చేసి అనంతరం వదిలేయడంతో అటు పూర్తికాక, ఇటు ఉపయోగించుకోలేక విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, అవుకు మండలాల్లో 50 పాఠశాలల్లో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.
రూ.5కోట్ల నిధులు నిరుపయోగం
పాఠశాలల భవన నిర్మాణం పనులు మద్యలోనే ఆగిపోవడంతో రూ.5కోట్ల నిధులు నిరుపయోగంగా మారాయని సమాచారం. ఒక్కో పాఠశాలకు రూ.5 లక్షల నుంచి రూ.50లక్షల వరకూ ఖర్చు చేసి, కొంతమేర పనులు చేశారు. అనంతరం నిధులు విడుదల చేయకపోవడంతో మధ్యలోనే ఆగిపోయి భవనాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. భవనాలు శిథిలావస్థకు చేరే అవకాశం ఉందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత ప్రభుత్వంలోనూ అంతే..
మనబడి .. మన భవిష్యత్తు పేరిట పాఠశాలల్లో వసతులు కల్పిస్తామన్న ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. 50శాతం పూర్తిచేసిన పాఠశాలల భవనాలకు నిధులు వెచ్చిస్తే తరగతి గదులు అందుబాటులోకి వస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొలిమిగుండ్ల జడ్పీ ఉన్నతపాఠశాలలో రూ.50లక్షలు ఖర్చుచేసి పనులు చేశారు, అయితే మరో రూ.30లక్షలు ఖర్చు చేస్తే భవనాలు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఈ విషయమై దృష్టిసారించి, పనులు పూర్తి చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
నిధులు లేకపోవడంతో గత ప్రభుత్వం చేఇన నాడు నేడు పనులు మద్యలోనే నిలిచి పోయాయి. కొన్ని పాఠశాలలకు అరకొరగా నిధులు అందుబాటులో ఉన్నా వాడుకోలేని పరిస్థితి. భవనాలు శిథిలావస్థకు చేరే ప్రమాదం ఉంది, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. - అబ్దుల్‌కలాం, ఎంఈవో