పిల్లర్లకే పరిమితం..!
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:20 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘నాడు-నేడు’ను ‘మనబడి-మన భవిష్యత్తు’ అని మార్చింది. మండలంలోని 20 పాఠశాలలకు రెండో విడత నాడు-నేడు కింద దాదాపు రూ.9.49 కోట్లు నిధులు మంజూరయ్యాయి
కొలిక్కి రాని ‘మనబడి.. మన భవిష్యత్తు’ నిర్మాణాలు
రెండేళ్ల పాలనలో సాగని భవన పనులు
వేధిస్తున్న తరగతి గదుల కొరత
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
చాగలమర్రి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘నాడు-నేడు’ను ‘మనబడి-మన భవిష్యత్తు’ అని మార్చింది. మండలంలోని 20 పాఠశాలలకు రెండో విడత నాడు-నేడు కింద దాదాపు రూ.9.49 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, కమిటీలు కలిసి పనులు ప్రారంభించారు. పిల్లర్ల వరకు పనులు చేసి వదిలేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన పాఠశాలల్లో పనులను పట్టించుకోలేదు. దీంతో జిల్లా పరిధిలోని అనేక పాఠశాలల్లో తరగతి గదుల సమస్యతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వరండాలో చెట్ల కింద బోధనలతో ఉపాధ్యాయులు సరిపెడుతున్నారు. వర్షాలు, ఎండల సమయాల్లో వారి ఇబ్బందులు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. అధికారులు, పాలకులు అసంపూర్తి నిర్మాణాలపై దృష్టి సారించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు ఎప్పటికి పూర్తవుతాయో, తరగతి గదులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియక ఉపాధ్యాయులు, విద్యార్థులు మదన పడుతున్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి
సౌకర్యాలు సరిగా లేక..
కూటమి ప్రభుత్వంలోనైన అసంపూర్తిగా ఉన్న భవన పనులు పూర్తిచేసి పాఠశాలల్లో విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు కోరుతున్నారు. పాఠశాల భవనాలు అసంపూర్తిగా ఉండటంతో విద్యార్థులకు సౌకర్యాలు సరిగా లేక అవస్థలు పడుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన పనులు పూర్తి చేసి విద్యార్థులకు మౌళిక వసతులు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
నిధులు మంజూరు కాక..
మండలంలోని ముత్యాలపాడులో 3 అదనపు గదులకు రూ.11.61 లక్షలు, గొడిగనూరులో 3 భవనాలకు రూ.14.74లక్షలు, మద్దూరులో 3 భవనాలకు రూ.53 లక్షలు, బాలుర ఉన్నత పాఠశాలలో 4 భవనాలకు రూ.36.45లక్షలు, బాలికోన్నత పాఠశాలకు 4 భవనాలకు రూ.49.88లక్షలు, చిన్నవంగలి ఉన్నత పాఠశాలలో 4భవనాలకు రూ.30.40లక్షలు, కస్తూర్బా పాఠశాలకు రూ.6.40లక్షలు ఖర్చుచేశారు. నిధులు లేకపోవడంతో పాఠశాలల్లో పనులు అర్ధాంతరంగా నిలిపి వేశారు. గత ప్రభుత్వంలో నిధులు మంజూరు కాకపోవడంతో పనులు చేయకుండా నిలిపి వేశామని హెచ్‌ఎంలు, కమిటీలు చెబుతున్నారు. మంజూరైన నిధుల వరకు పనులు చేశామని అన్నారు