Share News

ప్రతిభావంతులకు ‘ఆశా’ చేయూత

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:40 AM

ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ) ముందుకొచ్చింది. ఎస్‌బీఐ ప్లాటినం జూబ్లీని సందర్భంగా ఆశా స్కాలర్‌షిప్‌-27 పేరుతో ఆర్థిక చేయూతను అందించనుంది.

ప్రతిభావంతులకు ‘ఆశా’ చేయూత

ఎస్‌బీఐ ప్లాటినం జూబ్లీ సందర్భంగా ఉపకార వేతనాలు

పేద విద్యార్థులకు సువర్ణావకాశం

రూ.15వేల నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్‌షి్‌పలు

19 వరకు గడువు

శిరివెళ్ల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ) ముందుకొచ్చింది. ఎస్‌బీఐ ప్లాటినం జూబ్లీని సందర్భంగా ఆశా స్కాలర్‌షిప్‌-27 పేరుతో ఆర్థిక చేయూతను అందించనుంది. దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్‌బీఐ దాదాపు రూ.100 కోట్ల నిధులతో దేశంలోని విద్యార్థులతో పాటు విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు సైతం ఆర్థిక భరోసా కల్పించడానికి సిద్ధమైంది. పాఠశాల స్థాయిలో 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు, యూజీ, పీజీ, వైద్య విద్య, ఐఐటీ, ఐఐఎంతోపాటు విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా రూ.15వేల నుంచి రూ.15లక్షల వరకు స్కాలర్‌షిప్‌ అవార్డులు ఇవ్వనుంది.

ప్రస్తుతం 9 నుంచి 12వ తరగతి..

ప్రస్తుతం 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ.15వేలు స్కాలర్‌షిప్‌ దక్కుతుంది. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న విద్యార్థులకు రూ.75వేలు, పీజీ విద్యార్థులకు రూ.1.5 లక్షలు, వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి రూ.2లక్షలు, ఐఐటీ విద్యార్థులకు రూ.2 లక్షలు, ఐఐఎం విద్యార్థులకు రూ.5లక్షలు, విదేశాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, అంతకంటే ఎక్కువ ప్రోగ్రాంలో చదువుతున్న విద్యార్థులకు రూ.15లక్షల చొప్పున స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. డిప్లొమా చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

మార్కుల ఆధారంగా..

విద్యార్థులు గత ఏడాది చదివిన కోర్సులో కనీసం 7.5 సీజీపీఏ లేదా 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65శాతం, పర్సన్‌ విత్‌ బెంచ్‌మార్క్‌ డిసేబిలిటి (పీడబ్ల్యూబీడీ)లకు 60 శాతం మార్కులుగా నిర్ణయించారు. పాఠశాల స్థాయి విద్యార్థుల తల్లిదండ్రుల స్థూల వార్షిక ఆదాయం రూ.3లక్షలకు మించకూడదు. కళాశాల స్థాయివారి వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. ఈ ఏడాది ఎంపికైన విద్యార్థులు తదుపరి సంవత్సరంలో కూడా ఉపకార వేతనాలు పొందేందుకు అర్హత ప్రమాణాలుగా మార్కుల జాబితా, ఫీజు రసీదులు, బోనఫైడ్‌ సమర్పించి రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేయడం ఇలా..

ఆశా స్కాలర్‌షిప్‌ పొందాలనుకునే విద్యార్థులు సెప్టెంబరు 19వ తేదీ లోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అర్హులైన విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎస్‌బీఐఆశాస్కాలర్‌షి్‌ప.కో.ఇన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు చేసుకోండి అని కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మొదట ఖాతాను సృష్టించుకోవాలి. ఆధార్‌లో ఉన్న విధంగా పేరు, ఈ మెయిల్‌ ఐడీ నమోదు చేసి ఎంటర్‌ చేయగానే మీరు ఇచ్చిన ఈ మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో ధ్రువీకరించిన వెంటనే ఎస్‌బీఐ ఫౌండేషన్‌-ఆశా ప్లాట్‌ఫారమ్‌కు స్వాగతం అని వస్తుంది. పక్కనే కనిపిస్తున్న కొత్త దరఖాస్తు అనే అంశంపై క్లిక్‌ చేయగానే అన్ని దశలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. విద్యార్థులు వారు చదువుతున్న విద్యకు సంబంధించి స్కాలర్‌షిప్‌ విభాగాన్ని ఎంచుకుని వ్యక్తిగత, అకడమిక్‌ వివరాలు నమోదు చేసి సంబంధిత ధ్రువపత్రాలు, అభ్యర్థి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో అప్లోడ్‌ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.

దరఖాస్తులను వడపోసి ప్రతిభ..

దేశవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను వడపోసి ప్రతిభ, ఆర్థిక నేపథ్యం, రిజర్వేషన్‌ ఆధారంగా విద్యార్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వారికి టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ నిర్వహించిన అనంతరం అభ్యర్థుల అకడమిక్‌ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి తుది జాబితా సిద్ధం చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు వారి బ్యాంక్‌ ఖాతాల్లో ఉపకార వేతనాలను ఏక మొత్తంగా ఒకేసారి జమ చేస్తారు.

ధ్రువపత్రాలు ఇవే..

విద్యార్థుల ఆధార్‌ కార్డు, గత విద్యా సంవత్సరంలో సాధించిన మార్కుల జాబితా, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు చెల్లింపు రసీదులు, విద్యార్థులు లేదా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల వివరాలు, కుల, ఆదాయ ధ్రువ పత్రాలతోపాటు ప్రస్తుతం చదువుతున్న విద్యాసంస్థ నుంచి తీసుకున్న బోనఫైడ్‌ తదితర పత్రాలను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు బోనఫైడ్‌ కమ్‌ నో ఫీజ్‌ సర్టిఫికెట్‌ తీసు కుని అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

Updated Date - Sep 10 , 2026 | 12:40 AM