Share News

సర్పంచ్‌ ఎన్నికలూ ఏకగ్రీవమేనా?

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:11 PM

ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఎన్నుకునే అవకాశం ఓటర్లకు లభించలేదు. ఇక సర్పంచ్‌ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతుండటంతో ఓటర్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక తమకు ఓటు లభించే అవకాశం లేదని, తాము ఎన్నుకోని సర్పంచ్‌, వార్డు సభ్యులు తమకు విలువ ఇస్తారా? అని ఆవేదన చెందుతున్నారు.

సర్పంచ్‌ ఎన్నికలూ  ఏకగ్రీవమేనా?

పరిషత్‌ బాటలోనే పంచాయతీ ఎన్నికలు

తెరపైకి 70/30 ఫార్ములా

కొలిమిగుండ్ల, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఎకగ్రీవంగా కాగా ఇక సర్పంచ్‌ పదవులు కూడా అదేబాటలో ఉన్నట్లు ఊహాగానాల నేపథ్యంలో నియోజవర్గ ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ నెలలో నోటిఫికెషన్‌ రానుండటంతో ఇప్పటికే నాయకుల మంతనాలు మొదలైనట్లు విశ్వసనీయ సమాచారం.

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలన్నీ ఏకగ్రీవం..

జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా 85ఎంపీటీసీ, 5 జడ్పీటీసీ పదవులను ఇరు పార్టీల నాయకులు సయోధ్య చేసుకుని ఏకగ్రీవం చేసుకున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే బనగానపల్లె నియోజకవర్గంలో ఒక్క స్థానానికీ ఎన్నికలు నిర్వహించలేదు.

ఇక సర్పంచ్‌ పదవులూ ఏకగ్రీవమే

ఇప్పుడు సర్పంచ్‌ ఎన్నికలు ఈ నెల 19న నోటిఫికెషన్‌ రానుండటంతో పల్లెల్లో ప్రశాంతతకు పెద్దపీట వేయాలని పార్టీల ముఖ్యనాయకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మొత్తం 102 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో బనగానపల్లె, కోవెలకుంట్ల, అవుకు, పలుకూరు మేజర్‌ పంచాయతీలు.

పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు..

బనగానపల్లె, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో 102 సర్పంచ్‌ స్థానాలు ఉన్నాయి. బనగానపల్లె మండలంలో 24, కొలిమిగుండ్ల-23, అవుకు-21, కోవెలకుంట్ల-17, సంజామల-17 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ నిర్వహించనున్నారు.

19న నోటిఫికేషన్‌

సర్పంచ్‌ ఎన్నికలకు ఈనెల 19న నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, అనంతరం డిసెంబరు 2న ఉదయం 6.30 గంటలనుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 1 గంటనుంచి సర్పంచ్‌, వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి ఫలితం ప్రకటిస్తారు.

తెరపైకి 70/30 ఫార్ములా..

సర్పంచ్‌ పదవుల్లో 70/30 ఫార్ములాను అమలు చేసేందుకు ముఖ్య నాయకులు జోరుగా మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. 70శాతం టీడీపీకి 30శాతం వైసీపీకి కేటాయించేలా నాయకులు పావులు కదుపుతున్నారు. ఎక్కడైనా కార్యకర్తల మధ్య రాజీ కుదరకుంటే పదవీ కాలాన్ని సగం సగం పంచుకునేలా ఆలోచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు పెర్కొంటున్నారు.

ఓటర్ల నిరాశ..

ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను తాము ఎన్నుకునే అవకాశం లేకపోవడంతో ఓటర్లు నిరాశ చెందారు. కాగా ఇక సర్పంచ్‌ ఎన్నికలు కూడా రాజీబాటలో సాగుతున్నాయన్న సమాచారంతో గ్రామాల్లో జోరుగా ఏంటి ఇక సర్పంచ్‌ ఎన్నికలు కూడా లేనట్లేనటగా అంటూ సైటైర్లు వేస్తున్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:11 PM