సామాజిక సమానత్వానికి ప్రతీక సంజీవయ్య
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:55 PM
సామాజిక సమానత్వానికి ప్రతీకగా దామోదరం సంజీవయ్య అని జేసీ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు.
జేసీ నూరుల్ ఖమర్
దామోదరం సంజీవయ్యకు ఘన నివాళి
కర్నూలు ఎడ్యుకేషన్/ కలెక్టర్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): సామాజిక సమానత్వానికి ప్రతీకగా దామోదరం సంజీవయ్య అని జేసీ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. నంద్యాల చెక్‌పోస్టు కూడలిలోని సంజీవయ్య విగ్రహానికి జేసీ నూరుల్ ఖమర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 1925 సమయంలో దళితుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదని, కుల వివక్షత తీవ్రంగా వ్యాపించి ఉండేదని గుర్తుచేశారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో కార్మికుల హక్కుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి భూమి లేని నిరుపేదలకు భూములు పంపిణీకి చట్టపరమైన చర్యలు చేపట్టారన్నారు. అట్రాసిటీ చట్టం కింద ఆదోనికి చెందిన తాయప్పకు సామాజిక సంక్షేమ శాఖలో వాచ్‌మెన్ నియామక పత్రాన్ని జేసీ అందజేశారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, క్రీడా పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఆయన జ్ఞాపికలు అందజేసి అభినందించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, వివిధ సంఘాల నాయకులు రాధాకృష్ణ, జ్యోతి, సోమన్న, చంద్రప్ప, వెంకటేశ్వర్లు, శ్రీను, రాజశేఖర్ ప్రసంగించారు. కార్యక్రమంలో ట్రైబెల్ వెల్ఫేర్ అధికారి సురేష్, మెఫ్మా పీడీ శ్రీనివాసులు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.