Share News

నదీ గర్భంలోకి సంగమేశ్వరుడు

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:24 AM

కృష్ణమ్మ పరవళ్లతో నది గర్భంలోకి సంగమేశ్వరుడు చేరుకున్నాడు.

నదీ గర్భంలోకి సంగమేశ్వరుడు
సగానికి పైగా నీట మునిగిన సంగమేశ్వరాలయం

గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి

జూరాల నుంచి 1,52,186 లక్షల క్యూసెక్కులు

కొత్తపల్లి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కృష్ణమ్మ పరవళ్లతో నది గర్భంలోకి సంగమేశ్వరుడు చేరుకున్నాడు. వారం రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టులు నిండుకుని రెండు రోజులుగా శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో కొత్తపల్లి మండలంలోని ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అత్యంత ప్రాచీన సంగమేశ్వరాల యంలోని శివలింగం జలాధివాసమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 1,52,186 లక్షల క్యూసెక్కుల నీరు దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తింది. దీంతో జలాశయం పూర్తి స్థాయినీటి మట్టం 885 అడుగులకు గాను 849.70 అడుగులకు నమోదైంది. అలాగే రిజర్వాయరు పూర్తి స్థాయి నీటి నిల్వలు 215 టీఎంసీలు కాగా, 79.4564 టీఎంసీలుగా నమోదైంది. ఆలయం నీట మునుగుతోంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు తమ సెల్‌ ఫోన్‌లలో ఫొటోలు బందించారు. మూడు నాలుగు రోజుల్లో ఆలయం పూర్తిగా నీట మునిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలయ పురోహితుడు వేపదారు శివలింగానికి చివరగా జలాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణమ్మకు సారె, పూలు సమర్పించారు.

Updated Date - Aug 03 , 2026 | 12:24 AM