Share News

జలాధివాసం వీడిన సంగమేశ్వరుడు

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:21 PM

ఈఏడాది ఆగస్టు 6వ తేదీన జలాధివాసమైన సంగమేశ్వరుడు.. శనివారం పూర్తిగా జలాధివాసం వీడి భక్తులకు ఇలా దర్శనం ఇస్తున్నారు.

జలాధివాసం వీడిన సంగమేశ్వరుడు
కృష్ణానది జలాల నుంచి పూర్తిగా బయల్పడిన సంగమేశ్వరాలయం

రేపు తొలిపూజకు సిద్ధం

దసరా నుంచి యథావిధిగా భక్తులకు శివయ్య దర్శనం

కొత్తపల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఈఏడాది ఆగస్టు 6వ తేదీన జలాధివాసమైన సంగమేశ్వరుడు.. శనివారం పూర్తిగా జలాధివాసం వీడి భక్తులకు ఇలా దర్శనం ఇస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో జూలై మాసంలో కురిసిన భారీ వర్షాలకు దిగువ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆగస్టు 6వ తేదీన సంగమేశ్వరాలయం పూర్తిగా జలాధివాసం అయ్యింది. అయితే శ్రీశైలం డ్యాం నుంచి రెండు నెలలుగా తాగు, సాగునీటి అవసరాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీగా నీరు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సప్తనదులలో నిక్షిప్తమైన సంగమేశ్వరుడు నెల రోజుల నుంచి కొద్దికొద్దిగా బయల్పడుతూ శనివారం పూర్తిగా జలాధివాసం వీడారు. ఆలయం బురద నీరు ఉన్నప్పటికీ శనివారం కొంత మంది భక్తులు తమ చిన్నారులతో తొలిసారిగా స్వామివారిని దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక కేవలం 70 రోజుల వ్యవధిలోనే ఆలయం బయల్పడటం ఈ 23 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 835 అడుగులు కాగా, శనివారం 839.50 అడుగులకు చేరుకుంది. అలాగే రిజర్వాయరు పూర్తి స్థాయి నీటి నిల్వలు 215 టీఎంసీలు కాగా, 61.0654 టీఎంసీలుగా నమోదైంది. సంవత్సరంలో ఎనిమిది నెలల పాటు జలాధివాసం అయ్యే సంగమేశ్వరుడు ఈసారి మాత్రం రెండున్నర నెలలలోపే బయల్పడ్డారు.

రేపు తొలి పూజ ప్రారంభం

నదీ జలాల నుంచి బయల్పడిన సంగమేశ్వరునికి తేదీ సోమవారం వేపదారు శివలింగానికి తొలి పూజ నిర్వహిస్తున్నట్లు పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. అలాగే దసరా పండుగ నుంచి యథావిధిగా భక్తులకు స్వామివారి దర్శనం కలుగుతుందని, భక్తుల వాహనాలు కూడా నేరుగా క్షేత్రం వరకు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Updated Date - Oct 17 , 2026 | 11:21 PM