ఇసుకాసురులు
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:51 PM
హంద్రీ నదిని ఇసుకాసురులు తోడేస్తున్నారు. మండలంలోని గంజహళ్లి సమీపంలో హంద్రీ నదిని అక్రమార్కులు అడ్డాగా మార్చుకు న్నారు.
హంద్రీ నదిని తోడేస్తున్న అక్రమార్కులు
ట్రిప్పు ట్రాక్టర్ రూ.4వేల నుంచి రూ. 5వేలు
ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలకు అమ్మకాలు
గోనెగండ్ల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): హంద్రీ నదిని ఇసుకాసురులు తోడేస్తున్నారు. మండలంలోని గంజహళ్లి సమీపంలో హంద్రీ నదిని అక్రమార్కులు అడ్డాగా మార్చుకు న్నారు. ఇసుక వ్యాపారంతో అక్రమార్జనకు తెర లేపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రతి రోజు హంద్రీ నది నుంచి 30 నుంచి 40ట్రాక్టర్‌లు ఇసుకను గోనెగండ్ల, ఆదోని, ఎమ్మిగనూరు, ఆరెకల్లు, బిల్లెకల్లు, దేవిబెట్ట ప్రాంతాలకు ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. సామాన్యులు, గృహాలు నిర్మించుకునే పేదలకు ఇసుక అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీన్ని అవకాశంగా చేసుకొని కొందరు ఇసుకను వ్యాపారంగా మార్చేశారు. ట్రిప్పు ఇసుక ట్రాక్టర్ రూ. 4000 నుంచి రూ. 5000 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. దూరాన్నిబట్టి మరింత రేటు పెంచుతున్నట్లు తెలుస్తోంది.
దారి దెబ్బతింటున్నదని ఆవేదన
ఇసుక ట్రాక్టర్లు నిరంతరంగా హంద్రీ నదికి వెళ్తుండటంతో తమ పొలాలకు వెళ్లే రహదారి దెబ్బతింటున్నదని గంజహళ్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోటామోటా నాయకుల చేతివాటానికి అడ్డు లేకుండాపోయింది. హంద్రీ నదిలోని ఇసుకను తరలిస్తే భూగర్భజలాలు అడుగంటిపోయి వేసవిలో తాగునీటి సమస్య వస్తుందని గ్రామస్థులు తెలుపుతున్నారు.
మైనింగ్ అధికారులు హెచ్చరించినా..
రెండు రోజుల క్రితం రాయలసీమ జోన్ మైనింగ్ అధికారులు తిప్పనూరు, వేముగోడు, పుట్టపాశం గ్రామాల్లోని హంద్రీ నదిని పరిశీలించారు. హంద్రీలో ఇసుకను అక్రమంగా తరలించరాదని, అట్లా తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినా ఇసుకాసురులు బేఖాతర్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
విచారణ చేస్తాం
గంజహళ్లి గ్రామ హంద్రీ నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం ఇప్పుడిప్పుడే వస్తోంది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విచారణ చేసి అక్రమంగా ఇసుకను తరలించే వారిపై కేసులు నమోదు చేస్తాం.
చంద్రబాబు, సీఐ, గోనెగండ్ల