Share News

సరిహద్దులు దాటుతున్నఇసుక

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:12 AM

తెలంగాణ ప్రభుత్వం పల్లెపల్లెన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఒక్కసారిగా వేల ఇళ్ల నిర్మాణం జోరందుకోవడంతో ఇసుక కొరత ఏర్పడింది.

సరిహద్దులు దాటుతున్నఇసుక
శనివారం రాత్రి అలంపూరు ఎస్‌ఐ సీజ్‌ చేసిన వాహనం

ఇష్టారాజ్యంగా పెట్రేగిపోతున్న మాఫియా

చోద్యం చూస్తున్న నిఘా యంత్రాంగం

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పెరిగిన ఇసుక అవసరం

రాజకీయ నాయకులకు రూ.లక్షల్లో మామూళ్లు

జిల్లాలో బంగారమైన ఇసుక

తెలంగాణ ప్రభుత్వం పల్లెపల్లెన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఒక్కసారిగా వేల ఇళ్ల నిర్మాణం జోరందుకోవడంతో ఇసుక కొరత ఏర్పడింది. మన జిల్లాకు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాల మధ్య సరిహద్దు తుంగభద్ర నది మాత్రమే. చీకటి పడగానే ఇసుకను అక్రమంగా సరిహద్దు దాటించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో ‘ఉచిత ఇసుక పాలసీ’ అమలులో ఉంది. లోడింగ్‌, రవాణా చార్జీలు మినహా ఒక్క పైసా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇసుక మాఫియా దీనిని సొమ్ము చేసుకుంటుంది. రెండు వైపులు నిఘా అధికారులకు భారీగా నెల మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణులు బలంగా ఉన్నాయి. కర్నూలు మండలం పంచలింగాల, సుంకేసుల, నందవరం మండలం నాగులదిన్నె వద్ద ఇసుక టిప్పర్లు, ట్రాక్టర్లు సరిహద్దులు దాటిస్తున్నారు. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలు, రవాణా కోసం గనులు భూగర్భవనరులు, జలవనరులు, రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేసి సి.బెళగల్‌ మండలం కొత్తకోట, కె.సింగవరం, పల్లెదొడ్డి, ముడుమాల, ఈర్లదిన్నె గ్రామాల దగ్గర నాలుగు డీసిల్టేషన్‌ (నీటిలో బోటు ద్వారా ఇసుక తవ్వకాలు) ఐదు రీచ్‌లకు అనుమతులు ఇచ్చింది. కొత్తగా నందవరం మండలం నాగులదిన్నె, గంగవరం, వేదవతి నదిలో హొళగుంద మండలం ముద్దటమాగి ఇసుక రీచ్‌ల్లో 3.45లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక లభ్యత ఉందని అంచనా. ఉచిత ఇసుక పాలసీలో భాగంగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న లబ్ధిదారులు తీసుకొచ్చే టిప్పర్లు, ట్రాక్టర్లకు రీచ్‌లో లోడింగ్‌ చేసే కాంట్రాక్ట్‌ టెండర్లు వివాదం న్యాయస్థానం పరిధిలో ఉంది. ఉచిత ఇసుక పాలసీ ని బంధనలు ప్రకారం జిల్లాలో అవసరమైన భవన నిర్మాణదారులకు ఇసుక సరఫరా చేయాలి. ఈ పాలసీ అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నిబంధనలు తుంగలో కలిపేసి చీకటి దందాకు తెరతీశారు. నిఘా కళ్లక గంతలు కట్టి ఇష్టారాజ్యంగా జిల్లా సరిహద్దు తుంగభద్ర నది దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ బాగోతంలో రెండు రాష్ట్రాలకు రాజకీయ నాయకులు, పోలీస్‌, మైనింగ్‌ అధికారులకు మామూళ్లు అందుతుండడంతో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు కంటితుడుపు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణలో ఇసుక డిమాండ్‌

తుంగభద్ర నది ఆవలి ఒడ్డున ఉన్న తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్‌, గద్వాల నియోజకవర్గాల్లో దాదాపు 8వేలు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. ఆ రాష్ట్రంలో ఇసుక రీచ్‌లు ఉన్నా.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలకు మాత్రమే ఇసుక తరలింపు అనుమతులున్నాయి. ఇతర నిర్మాణాలకు ఇసుక తరలింపు అనుమతుల్లేవు. ఇందిరమ్మ ఇళ్లకు కూడా అవసరమైన మేరకు ఇసుక లభించడం లేదు. సరిహద్దు తెలంగాణ జిల్లాలో ఇసుక డిమాండ్‌ను మన మన జిల్లాకు చెందిన ఇసుక మాఫియా సొమ్ము చేసుకుంటోంది. రోజు పదుల సంఖ్యలో ఇసుక టిప్పర్లు సరిహద్దులు దాటుతున్నాయి. ఏపీ నుంచి నది అవలి ఒడ్డున ఉన్న ఉండవల్లి, అలంపూరు, మానవపాడు, ఇటిక్యాల, గద్వాల, అయిజ మండల్లాలోని వివిధ గ్రామాలతో పాటుగా హైదరాబాద్‌కు కూడా ఇసుక తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి టిప్పరు ఇసుక రూ.25 వేల నుంచి రూ.65 వేలకు పైగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలో ఇసుక బంగారమైంది. అవసరానికి నల్లబజారులో కొనుగోలు చేయాల్సి వస్తుంది. కర్నూలు నగరంలో 18-20 టన్నుల టిప్పరు ఇసుక రూ.10-12 వేలు, ఎమ్మిగనూరు పట్టణంలో రూ.11,500 నుంచి రూ.12,500లు, ఆదోని పట్టణంలో రూ.14-15 వేలకు పైగా విక్రయిస్తున్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నా.. కొందరి అక్రమార్జన కారణంగా సామాన్యులకు ఇసుక బంగారంలా మారింది.

నాడు.. నేడు ఇసుక మాఫియా లీడరు వైసీపీ నాయకుడే?

కర్నూలు రూరల్‌ మండలం నిడ్జూరు, పంచలింగాల, మునగాలపాడు, పూడూరు గ్రామాల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా సరిహద్దులు దాటిస్తారు. తెలంగాణలోని అలంపూర్‌ నియోజకవర్గం పరిధిలో ఓ రహస్య ప్రాంతాల్లో డంప్‌ చేస్తారు. సి.బెళగల్‌ మండలం కొత్తకోట, కె.సింగవరం, పల్లెదొడ్డి, ముడుమాల, ఈర్లదిన్నె రీచ్‌ల నుంచి కూడా టిప్పర్ల ద్వారా తెలంగాణలో రహస్య డం ప్‌లకు చీకటి పడగానే ఇసుక తరలిస్తున్నట్లు తెలుస్తుంది. దీని వెనుక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు, రవాణాలో పేరుగాంచిన ఆ పార్టీ నాయకుడే కూటమి ప్రభుత్వంలో కూడా అక్రమ ఇసుక రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణులు లేకపోలేదు. నాడు.. నేడు రాజ కీయ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, నిఘా అధికారులు తన దారికి అడ్డురాకుండా ఉండేందుకు నెలనెల రూ.లక్షల్లో వాటాలు పంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శనివారం రాత్రి కర్నూలు రూరల్‌ మండలం పదిదెంపాడు, పూడూరు నుంచి ర్యాలంపాడు మీదుగా ఇసుక లోడ్‌తో తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లిన ఏపీ 27 టీఎక్స్‌ 6966 నంబరు గల టిప్పరును అలంపూర్‌ ఎస్‌ఐ రామకృష్ణ సీజ్‌ చేశారు. అంటే.. ఇసుక చీకటి దంగా ఏ స్థాయిలో సాగుతుందో ఇట్టే తెలుస్తుంది. అలంపూరు ఎస్‌ఐ సీజ్‌ చేసిన టిప్పరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే.. ఏపీ టు తెలంగాణ ఇసుక మాఫియా నడిపిస్తుంది ఎవరు..? తెర వెనుక నాయకుడెవరో ఎవరో..? తెలుస్తుంది.

నాగులదిన్నె టు అయిజ

నందవరం మండలం నాగులదిన్నె రీచ్‌లో 1.20 మెట్రిక్‌ టన్నులు, గంగవనం రీచ్‌లో 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు నాణ్యమైన ఇసుక ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంగా నవంబరు, డిసెంబరు నెలల్లో రెండు పర్యాయాలు లోడింగ్‌ టెండర్లు పిలిచారు. తమ అనుకూల కాంట్రాక్టరుకు టెండరు రాలేదని అధికార కూటమి ముఖ్య నాయకులు మైనింగ్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండుసార్లు టెండర్లు రద్దు చేయించారు. అయితే.. డిసెంబరులో రహస్య టెండరు, ఆ తరువాత లాటరీ పద్ధతిలో టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు న్యాయస్థానం ఆశ్రయించి స్టే తీసుకొచ్చినా.. రీచ్‌లను వినియోగంలోకి రాలేదు. ఆయా రీచ్‌ల నుంచి ట్రాక్టర్ల యజమానులు అక్రమంగా నాగులదిన్నె వంతెన మీదుగా తుంగభద్ర నది దాటించి గద్వాల జిల్లా అయిజ మండలంలోని వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తరలిస్తున్నారు. నాగులదిన్నె, గంగావరం, జొహరాపురం రీచ్‌ల నుంచి ఎమ్మిగనూరుకు ఇసుక తరలిస్తే.. ఒక ట్రాక్టరుకు రూ.3,500లకు పైగా వసులు చేస్తున్నారు. అదే.. ఇసుక తుంగభద్ర నది దాటించి నాలుగైదు కిలోమీటర్లు వెళితే.. దూరాన్ని బట్టి రూ.4-6 వేలకు పైగా విక్రయిస్తున్నారు. దీని వెనుక అధికార కూటమిలో చక్రం తిప్పుతున్న ఓ నాయకుడి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు నెలలు గడిచినా లోడింగ్‌ టెండర్లు పూర్తి చేయకపోవడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు -తేజోమూర్తి, తాలుకా సీఐ, కర్నూలు:

జిల్లా సరిహద్దులు దాటించి సాగించే ఇసుక అక్రమ రవాణాపై పక్కా నిఘా పెట్టాం. అక్రమ రవాణా చేస్తున్న పది మందిని గుర్తించి బైండోవర్‌ చేశాం. మా కళ్లుగప్పి ఇసుక ట్రాక్టరు, టిప్పరు సరిహద్దులు దాటిన కఠిన చర్యలు తప్పవు. తెలంగాణలో కూడా ఏపీ నుంచి ఇసుక అక్రమంగా తమ ప్రాంతంలోకి రాకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు.

కేసు నమోదు చేశాం - రామకృష్ణ, అలంపూర్‌ ఎస్‌ఐ, గద్వాల జిల్లా:

కర్నూలు జిల్లా నుంచి సరిహద్దులు దాటించి తెలంగాణలోకి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నమాట నిజమే. సరిహద్దుల్లో నిఘా పెంచాం. శనివారం రాత్రి కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలం ఈర్లదిన్నె ఇసుక రీచ్‌ నుంచి అక్రమంగా మా పరిధిలోకి రవాణా చేస్తున్న ఏపీ 27 టీఎక్స్‌ 6966 నంబరు గల టిప్పరును సీజ్‌ చేశాం. టిప్పరు డ్రైవర్‌ రంగన్న, యజమాని మదుసూధన్‌లపై కేసు నమోదు చేశాం.

Updated Date - Jan 19 , 2026 | 12:12 AM