Share News

ఆ ప్రాజెక్టులకు మోక్షం

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:35 PM

రాష్ట్రంలో పెండింగ్‌, అసంపూర్తిగా ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు.

ఆ ప్రాజెక్టులకు మోక్షం
ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు

ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో వేదవతి, గాజులదిన్నె, అలగనూరు

సీఎం చంద్రబాబు నిర్ణయం

కర్నూలు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెండింగ్‌, అసంపూర్తిగా ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో వివిధ శాఖల పనితీరుపై అధికారులతో సమావేశమయ్యారు. రాయలసీమ జిల్లాలో కరువు నివారణ లక్ష్యంగా అసంపూర్తిగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తక్కువ నిధులు, తక్కువ సమయంలో పూర్తి చేసేందుకు అవకాశం ఉన్న 21 ప్రాజెక్టులకు ప్రాధాన్యత జాబితాలో చేర్చి, వాటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో వేదవతి, గాజులదిన్నె, అలగనూరు, హంద్రీనీవా ప్రాజెక్టులు చేర్చారు. వాటిని పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే..

వేదవతి ప్రాజెక్టుపై ఆశలు

ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో తాగు, సాగునీరు అందించాలనే లక్ష్యంగా వేదవతి ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దున ప్రవహించే వేదవతి (హగరి) నుంచి నీటిని ఎత్తిపోసి కరువు నివారించవచ్చని రిటైర్డు ఈఈ, సీమ సాగునీటి నిపుణులు దివంగత సుబ్బరాయుడు ఈ ప్రాజెక్టుకు డిజైన్‌ చేశారు. ఆలూరు, హాలహర్వి, హోలగుంద, చిప్పగిరి, ఆదోని, కౌతాళం మండలాల్లో 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని, 253 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లోని 10 లక్షల మంది జనాభాకు తాగునరు అందించే లక్ష్యంతో 2019 జనవరిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. రూ.1,942.80 కోట్ల అంచనా వ్యయంతో పాలనామోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టరుకు పనులను అప్పగించారు. పనులు మొదలయ్యాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లు నిర్లక్ష్యం ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.

గాజులదిన్నెకు మోక్షం

గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యం పెంపు పనులు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోనెగండ్ల, కోడుమూరు, కృష్ణగిరి, దేవనకొండ, డోన్‌ మండలాల్లో పలు గ్రామాలకు సాగునీరు, కర్నూలు నగరం, కృష్ణగిరి, డోన్‌ పట్టణాలతో పాటు 125 గ్రామాలకు తాగునీరు, దామోదరం సంజీవయ్య సాగర్‌ (గాజులదిన్నె) జలాశయం అందిస్తుంది. ఆ ప్రాజెక్టు సామర్థ్యం 4.5 టీఎంసీలు, కుడి, ఎడుమ కాలువల ద్వారా రబీ పంటకు 24,372 ఎకరాలకు సాగునీరు అందించాలి. బండగట్టు రక్షిత మంచినీటి పథకం ద్వారా ఒక్కటే 80 గ్రామాలకు పైగా తాగునీరు అందించాల్సి ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మిగనూరు పట్టణానికి తాగునీరు సరఫరా కోసం ఈ ప్రాజెక్టు నుంచి పైపులైన్‌ పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాల పునర్విభజన తర్వాత కర్నూలు జిల్లాకు మిగిలిన ఏకైన అతిపెద్ద ప్రాజెక్టు ఇది ఒక్కటే. గత సీఎం జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. గత టీడీపీ ప్రభుత్వం హంద్రీనీవా నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు 3 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 7.5 టీఎంసీల సామర్థ్యానికి జలాశయం ఎత్తు పెంపు, గేట్ల మరమ్మతులకు రూ.108 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఇంతలోనే టీడీపీ ప్రభుత్వం పడిపోయి వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.57.35 కోట్లతో 5.5 టీఎంసీలకు ఆనకట్ట పెంచే పనులు చేపట్టారు. కాంట్రాక్టరుకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.

అలగనూరు కష్టాలకు చెక్‌

నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ 2.96 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. కడప-కర్నూలు జిల్లాలో కేసీ ఆయకట్టు సాగునీరు అందించాలని ప్రధానలక్ష్యం. ఈ జలాశయం ఆనకట్ట కుంగిపోయింది. 2017లో 2.50కిలోమీటర్ల నుంచి 2.75 కిలోమీటర్ల వరకు సుమారు 100 మీటర్ల మేర కుంగిపోయింది. అధికారులు తక్షణ మరమ్మతులు కోసం రూ.28 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. ఇంజనీర్లు నీళ్లు నింపడంతో 250 మీటర్లకు పైగా కుంగిపోయింది. 2019లో దాదాపు రూ.20లక్షలతో మళ్లీ తాత్కాలిక పనులు చేపట్టారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా అలగనూరు రిజర్వాయర్‌ మరమ్మతుల ప్రతిపాదనల అంచనాలు రూ.65 కోట్లకు పైగా చేరాయి.

Updated Date - Jan 27 , 2026 | 11:35 PM