కళ్లు మూసుకుని జీతాలిచ్చారు..
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:30 AM
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయాల్లో పని చేస్తున్న పశుసంవర్దక శాఖ అసిస్టెంట్లు 76 మందిపై చర్యలకు ఆ శాఖ రాష్ట్ర అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం
వారిపై చర్యలేవి..? ఉద్యోగ సంఘాల ధ్వజం
కర్నూలు అగ్రికల్చర్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయాల్లో పని చేస్తున్న పశుసంవర్దక శాఖ అసిస్టెంట్లు 76 మందిపై చర్యలకు ఆ శాఖ రాష్ట్ర అధికారులు నోటీసులు జారీ చేశారు. ఓ వైపు వీరు ఉద్యోగాలు చేస్తూనే జీతాలు తీసుకుంటూ మరోవైపు అదే సమయంలో ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో రెండేళ్ల డిప్లమా కోర్సులు చేస్తుంటే ఉన్నతాధికారులు కళ్లు మూసుకుని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏ విధంగా జీతాలు ఇచ్చారని ఆ శాఖ ఉద్యోగుల సంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఏకంగా రెండేళ్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు బయటి ప్రాంతాల్లో కాలేజీల్లో చదువుతోంటే.. ఏ మాత్రం వారిపై నిఘా వేయకుండా ప్రభుత్వానికి అప్పుడే సమాచారం ఇవ్వకుండా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చూపడంపై ఉద్యోగ సంఘాల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే చాలా మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఓ వైపు జీతాలు తీసుకుంటూ మరో వైపు వివిధ ప్రాంతాల్లో కాలేజీలో చదువుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్న వారిని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సంఘాల ప్రతినిధులు సీఎంకు ఇటీవల వినతిపత్రం పంపినట్లు సమాచారం.