Share News

పల్లె పోరుకు సై

ABN , Publish Date - Nov 13 , 2026 | 11:22 PM

గ్రామ పంచాయతీ ఎన్నికల సైరన్‌ మోగింది. తొలి ఎన్నిక నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు.

పల్లె పోరుకు సై

గ్రామసీమల్లో పంచాయతీ ఎన్నికల సందడి

తొలి విడత నోటిఫికేషన్‌ విడుదల

జిల్లాలో 484 పంచాయతీలు

మూడు విడతల్లో ఎన్నికలు

మారిన షెడ్యూల్‌

తొలి విడతలోనే ఆలూరు నియోజకవర్గ పంచాయతీలు

గ్రామ పంచాయతీ ఎన్నికల సైరన్‌ మోగింది. తొలి ఎన్నిక నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. 15న రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వో)లు నోటిఫికేషన్‌ జారీ చేసి నామినేషన్ల స్వీకరణ చేపడతారు. అక్టోబరు 24న మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ జారీ చేయగా.. తాజా నోటిఫికేషన్‌లో స్వల్పంగా మార్పులు చేశారు. తొలి విడతలో ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో 8 మండలాల్లో పం చాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సిరి పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పట్టణ, పరిషత్‌ ఎన్ని కల పోరు ముగిసి.. పంచాయతీ ఎన్నికలకు సైరన్‌ మోగడంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. సర్పంచ్‌ పదవులు ఆశిస్తున్న ఆశావహులు, అధికార కూటమి మద్దతు కోసం పావులు కదుపుతున్నారు. పలు గ్రామాల్లో సర్పంచ్‌ పదవి వేలం నిర్వహించి లెక్కకట్టడం కొసమెరుపు.

కర్నూలు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 484 గ్రామ పంచాయతీలు.. వాటి పరిధిలో 5,100 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే పట్టణ స్థానిక సంస్థలు, జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచు సహా వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. దీంతో పల్లెలో పట్టు ఉండే పంచాయతీ సర్పంచ్‌ పదవిని ఆశిస్తున్న ఆశావహులు పోటీకి సై అంటున్నారు. పార్టీలు, వివిధ సామాజికవర్గాల మద్దతు కూడగట్టడంలో నిమగ్నమయ్యారు. సర్పంచ్‌గా ఎన్నికైతే.. ఆ పల్లెల్లో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా పంచాయతీ తీర్మానం తప్పనిసరి. అంతేగాక గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి అధికారిక సభ పెట్టినా ఆ సభకు అధ్యక్షత వహించాల్సింది గ్రామ సర్పంచ్‌ మాత్రమే. అందుకే ఎలాగైనా పదవి దక్కించుకోవడానికి రాజకీయ నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. దీంతో గ్రామ రచ్చబండపై పంచాయతీ రాజకీయ రచ్చ మొదలైంది. పట్టణ, పరిషత్‌ ఎన్నికల్లో అఖండ విజయోత్సవాలతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జోష్‌తో ఉంటే.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది.

తొలి విడతలో ఇలా...

జిల్లాలో తొలి విడతలో భాగంగా ఆదోని రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఆదోని-1, ఆదోని-2, పత్తికొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి, హోళగుంద మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఆ మండలాల్లో 148 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ పంచాయతీలను 58 గ్రూపులు (క్లస్టర్‌)గా విభజించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక ఆర్వోను నియమించారు. జనాభాను బట్టి 10వేలు ఆపైన జనాభా కలిగిన పంచాయతీకి ఒక ఆర్వోను నియమించారు. అంతకంటే తక్కువ జనాభా కలిగిన 2-4 పంచాయతీలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఆర్వోను నియమించారు. ఆ క్లస్టర్‌ పరిధిలోని పంచాయతీలు, క్లస్టర్‌ హెడ్‌ క్వార్టర్‌లోనే నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పోలిస్‌ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది.

జిల్లాలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాలు :

ఆదోని డివిజన్‌ : ఆదోని-1, ఆదోని-2, హొళగుంద

పత్తికొండ డివిజన్‌: ఆలూరు, ఆస్పరి,

చిప్పగిరి, దేవనకొం, హాలహర్వి.

గ్రామీణ ఓటర్ల వివరాలు

పంచాయతీలు : 484

వార్డులు : 5,100

ఓటర్లు : 12,50,162

పురుషులు : 6,21,167

మహిళలు : 6,28,830

ఇతరులు : 165

బీసీ ఓటర్లు : 9,05,589

ఎస్సీ ఓటర్లు: 2,33,863

ఎస్టీ ఓటర్లు : 17,119

ఇతర వర్గాలు: 93,591

జిల్లాలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల షెడ్యూల్‌

నామినేషన్ల స్వీకరణ : 15-11-2026 నుంచి 17-11-2026

నామినేషన్ల పరిశీలన : 18-11-2026

అప్పీళ్లు, పరిష్కారం : 19-11-2026 నుండి 20-11-2026

నామినేషన్ల ఉపసంహరణ, : 21-11-202

తుది జాబితా

పోలింగ్‌ తేది : 26-11-2026 (ఉదయం 7 నుంచి

మధ్యాహ్నం 1 గంట వరకు)

రీ-పోల్‌ (అవసరమైతే) : 27-11-2026

ఓట్ల లెక్కింపు, ఫలితాలు : 26-11-2026 (మధ్యాహ్నం

2 గంటల నుంచి.. ఆ వెంటనే ఫలితాలు)

ఉప-సర్పంచ్‌ ఎన్నిక : ఫలితాలు వెలువడిన రోజే

Updated Date - Nov 13 , 2026 | 11:22 PM