Share News

మహానాడులో విషాదం..

ABN , Publish Date - May 28 , 2026 | 12:20 AM

మండల కేంద్రమైన కోసిగిలో శనివారం నిర్వహించిన మహానాడు వర్చువల్‌ కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కందుకూరు గ్రామానికి చెందిన టీడీపీ చురుకైన కార్యకర్త ధోవి ఈరయ్య(35) గుండెపోటుతో మృతి చెందాడు.

మహానాడులో విషాదం..
ధోవి ఈరయ్య భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

గుండెపోటుతో టీడీపీ కార్యకర్త మృతి

కందుకూరుకు చెందిన ధోవి ఈరయ్య అకాల మరణం

కోసిగి, మే 27 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన కోసిగిలో శనివారం నిర్వహించిన మహానాడు వర్చువల్‌ కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కందుకూరు గ్రామానికి చెందిన టీడీపీ చురుకైన కార్యకర్త ధోవి ఈరయ్య(35) గుండెపోటుతో మృతి చెందాడు. ఈరయ్య పసుపు చొక్కా ధరించి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రోగ్రాం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయనకు ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. తోటి నాయకులు ఆయనను వెంటనే కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఈరయ్య గుండెపోటుతో మృతి చెందినట్లు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఇబ్రహీం ధ్రువీకరించారు. పార్టీ పండగలాంటి వేడుకకు వచ్చి కార్యకర్తల అకాల మరణం చెందడంతో మహానాడు ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కుటుంబానికి అండగా ఉంటాం

మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌. రాఘవేంద్రరెడ్డి ఈరయ్య మరణంతో పార్టీ ఒక చురుకైన తమ్ముడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువనేత ఎన్‌. రాకే్‌షరెడ్డి, మండల అధ్యక్షుడు రామిరెడ్డి, మాజీ సర్పంచ్‌ ముత్తురెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ నాడిగేని అయ్యన్న, మాజీ జెడ్పీటీసీలు తోవి రామకృష్ణ, జక్కని వెంకటేష్‌, వక్రాణి వెంకటేష్‌, కోసిగయ్య, ఈరన్న, రామిరెడ్డి, అయ్యన్న, నారాయణ తదితర నేతలు ఆసుపత్రికి చేరుకుని ఈరయ్య భౌతికాయానికి నివాళులు అర్పించారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - May 28 , 2026 | 12:20 AM