అగ్ని ప్రమాదంలో రూ.6 లక్షలు నష్టం
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:07 AM
గోనెగండ్ల మండలంలోని వేముగోడు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో వెంకటేష్ గుడిసె కాలిపోయింది.
గుడిసెకు నిప్పంటించిన దుండగుడు
కాలిపోయిన నగదు, బంగారు, వెండి, నిత్యావసరాలు
గోనెగండ్ల, మార్చి 23(ఆంఽధ్రజ్యోతి): గోనెగండ్ల మండలంలోని వేముగోడు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో వెంకటేష్ గుడిసె కాలిపోయింది. వెంకటేష్ తన భార్యా పిల్లలతో ఆరు మాసాల క్రితం కర్నూలుకు వెళ్లి అక్కడ ప్రైవేట్ కంపెనీలో సెక్యురిటీ గార్డుగా చేరాడు. అప్పడప్పుడు వేముగోడుకు వచ్చి వెళ్లేవారు. సోమవారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గుడిసెలో ఎవ్వరు లేరని గమనించి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గుడిసెలో ఉన్న రెండు లక్షల నగదు, రెండున్నర తులాల బంగారు, పది బస్తాల బియ్యం ప్యాకెట్లు, వంటసామాగ్రి, బట్టలు ఇతర విలువైన వస్తువులు కాలిపోయాయి. దాదాపు రూ. 6 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెంకటేష్ తెలిపారు.
రెండు గడ్డివాములు దగ్ధం
కోడుమూరు రూరల్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అమడగుంట్లలో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్థమయ్యాయి. సోమవారం ఈ ప్రమాదం జరిగింది. సుమారు రూ. 2లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన చాకలి ఈరన్న చిల్లబండ దారిలో పొలం కౌలు చేస్తున్నాడు. తాను పోషిస్తున్న దాదాపు 20 పశువుల కోసం వరిగడ్డి, వేరుశనగ, జొన్నచొప్ప కొనుగోలు చేసి రెండు గడ్డివాములను, అక్కడే గుడిసెను ఏర్పాటు చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం గడ్డివాముల నుంచి పొగలు వస్తున్న దృశ్యాన్ని చూసి సమీప పొలాల్లో పని చేస్తున్న కొందరు ఈరన్నకు సమాచారం అందించారు. వెంటనే ఆయన పొలానికి పరుగు తీశాడు. కోడుమూరు అగ్నిమాపక కేంద్రం
సిబ్బంది వెళ్లి మంటలార్పారు. అప్పటికే పశుగ్రాసం పూర్తిగా కాలి బూడిదయ్యింది. ఈ ప్రమాదంలో పశుగ్రాసంతో పాటు గుడిసెలో ఉంచిన పైపులు, విద్యుత్ పరికరాలు, తీగ, ఆముదాలు, పత్తి కాలిపోవడంతో రూ. 3 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆయన కోరాడు.