రాయలసీమ ప్రాజెక్టులకు రెండేళ్లలో రూ.12,450 కోట్లు
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:20 AM
రాష్ట్రంలో రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తే, అందులో 51 శాతం 12,450 కోట్లు రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషా ఛాంబర్‌లో జిల్లా ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలు, ఇంజనీర్లతో కలసి సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా తాజా పరిస్థితి, వాటికి కావాల్సిన నిధులు అంశాలను చర్చించారు. సమగ్ర వివరాలను మంత్రి నిమ్మలకు సీఈ కబీర్‌బాషా వివరించారు
వేదవతిని వేగంగా పూర్తి చేస్తాం
ఆర్డీఎస్, గుండ్రేవులపై తెలంగాణతో చర్చిస్తాం
25న తుంగభద్ర గేట్లు ప్రారంభం
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
కర్నూలు, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తే, అందులో 51 శాతం 12,450 కోట్లు రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషా ఛాంబర్‌లో జిల్లా ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలు, ఇంజనీర్లతో కలసి సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా తాజా పరిస్థితి, వాటికి కావాల్సిన నిధులు అంశాలను చర్చించారు. సమగ్ర వివరాలను మంత్రి నిమ్మలకు సీఈ కబీర్‌బాషా వివరించారు. నియోజకవర్గాల్లో ఉన్న వివిధ సాగునీటి సమస్యలపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలు మంత్రి నిమ్మల దృష్టికి తీసుకొచ్చారు. వాటిని తక్షణం పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు విలేకరులో మాట్లాడారు. జిల్లా పశ్చిమ ప్రాంతం పల్లెసీమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు, యువనేత, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ కట్టుబడి ఉన్నారన్నారు. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, వాతావరన పరిస్థితులు, నీటి లభ్యత.. వంటి అంశాలతో ప్రత్యేక బ్లూప్రింట్ తయారు చేస్తున్నామన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే ఒక్క సీజన్‌లోనే మొత్తం 33 గేట్లు కొత్తవి ఏర్పాటు చేశామని, ఈ నెల 25న కేంద్ర మంత్రులతో కలసి ప్రారంభిస్తామన్నారు. గోరుకల్లు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రూ.59 కోట్లతో రక్షణ పనులు చేపడుతున్నామన్నారు. గోరకల్లు జలాశయంలో నీటి నిల్వ ఉంటేనే అవుకు, గండికోట, చిత్రావతి బేసిన్‌లకు నీటిని పంపడం సాధ్యమన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.3,861 కోట్లలో కాలువ విస్తరణ చేసి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాకు పుష్కలంగా కృష్ణా జలాలు ఇస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పనులు చేపట్టి పూర్తిచేసే బాధ్యత తమదే అన్నారు. గాజులదిన్నె జలాశయం ఎత్తు పెంచే అసంపూర్తి పనులు, భూ సేకణకు రూ.20 కోట్లు, గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు రూ.11 కోట్లు నిధులు కావాలని ప్రణాళిక సిద్ధం చేశారని తెలిపారు. ఆలూరు, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే వేదవతి ప్రాజెక్టును రూ.2 వేల కోట్ల అంచనాతో భూసేకరణ సమస్యను పరిష్కరించి పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజవర్గాలకు జల ప్రయోజనాలు అందించే ఆర్డీఎస్ కుడి కాలువ, గుండ్రేవుల ప్రాజెక్టుల విషయంలో అంతర్ రాష్ట్ర సమస్యలు ఉన్నాయని, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదిస్తామని, సమస్యను పరిష్కరించి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తామన్నారు. పశ్చిమ ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, బొగ్గుల దస్తగిరి, గౌరు చరిత, నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జీలు మాజీ ఎమ్మెల్యే కె. మీనాక్షినాయుడు, వైకుంఠం జ్యోతి, ఎన్.రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.