పన్ను కోసం పరుగులు!
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:43 PM
ఆస్తి పన్ను చెల్లింపుల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిబేట్‌కు మంచి స్పందన వస్తోంది.
చెల్లింపులకు పెరుగుతున్న రద్దీ
నగర పాలక సంస్థలో రూ.16.86 కోట్లు దాటిన వసూళ్లు
ఐదు శాతం రాయితీకి ఆదరణ
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఆస్తి పన్ను చెల్లింపుల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిబేట్‌కు మంచి స్పందన వస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను చెల్లించేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి మరీ పన్నులు చెల్లిస్తుండటంతో ప్రభుత్వానికి ఆదాయం అమాంతంగా పెరుగుతోంది. ఏప్రిల్ 30వ తేదీలోగా 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించే వారందరికీ ఐదు శాతం తగ్గించి వసూలు చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ క్రమలో ఆస్తి పన్ను చెల్లింపులపై రాయతీ అవకాశం ప్రజల్లో నగర కార్పొరేషన్ అధికారులు చైతన్యం పెంచారు. ఈ చైతన్యంతో కర్నూలు నగర పాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద పన్నుల చెల్లింపునకు రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు రూ.16.86 కోట్లకు పైగా పన్నులు వసూలైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముందస్తు చెల్లింపులపై ప్రభుత్వం ప్రకటించిన ఐదు శాతం రాయితీని, బకాయిలు ఏకమొత్తంలో చెల్లింపులపై 50 శాతం వడ్డీ రాయితీని నగర ప్రజలు విస్తుృతంగా వినియోగించుకుంటున్నారు. ఆస్తి పన్ను బకాయిలపై ఏక మొత్తంలో చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీ, అలాగే 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏక మొత్తంలో 5 శాతం వడ్డీ రాయితీ వినియోగించుకునే అవకాశం ఈ నెల 30 వరకే గడువు ఉన్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
పన్ను చెల్లింపునకు ప్రత్యేక కౌంటర్లు : నగర పాలక సంస్థ నూతన, పాత కార్యాలయాలతోపాటు దండగేరి, పెద్ద పడఖాణ 20,21 సచివాలాయలు, బి.క్యాంపు, ఆరోరానగర్ 56,57 సచివాలయాలు, గురురాఘవేంద్ర, రాజీవ్ గృహకల్ప 92,93 సచివాలయా లు, కల్లూరు వార్డు కార్యాలయం 84,85 సచివాలయాలు, లక్ష్మీ నగర్, జేఎన్‌ఆర్ నగర్ 61,61 సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు పని చేస్తాయి. సెలవు దినాలతో సహా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చెల్లించే అవకాశం ఉంది.