Share News

నిలువునా ముంచేశాడు..!

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:14 AM

పొదుపు మహిళలు అతడిని నమ్మగా వారిని నిలువునా ముంచేశాడు. నాలుగు సంఘాలకు చెందిన సుమారు రూ.16.2లక్షలు గుట్టు చప్పుడు కాకుండా కాజేశాడు.

నిలువునా ముంచేశాడు..!
శిరివెళ్లలోని వెలుగు శిక్షణా కేంద్రం

నాలుగు సంఘాలకు చెందిన రూ.16.2లక్షలు కాజేసిన వీవోఏ

అవినీతిపరుడికి కొమ్ము కాస్తున్న అధికారులు

ఇప్పటి వరకు రూ.11లక్షలు రికవరీ

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

శిరివెళ్ల, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): పొదుపు మహిళలు అతడిని నమ్మగా వారిని నిలువునా ముంచేశాడు. నాలుగు సంఘాలకు చెందిన సుమారు రూ.16.2లక్షలు గుట్టు చప్పుడు కాకుండా కాజేశాడు. పొదుపు మహిళా సంఘాల రుణాలకు చెందిన నెలవారీ వాయిదాలను బ్యాంకులో జమ చేయకుండా దాదాపు రూ.16.2లక్షలు వీవోఏ(విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌) కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 19 నెలలుగా ఈతతంగమంతా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అవినీతికి పాల్పడిన వీవోఏ నుంచి డబ్బులు రాబట్టేందుకు ఐకేపీ కార్యాలయ అధికారులు పంచాయితీకి తెరలేపారు. సదరు వీవోఐపై చట్ట, శాఖాపరమైన చర్యలు తీసుకుంటే పొదుపు సంఘాలకు చెల్లించాల్సిన డబ్బులు రావని ఉచిత సలహాలు చెబుతూ అవినీతిపరుడికి కొమ్ముకాస్తున్నారన్న విమర్శలున్నాయి.

వీవోఏపై ఆధారపడటంతోనే..

ఇసుకపల్లెలోని సరస్వతి పొదుపు మహిళా సంఘానికి జూలై18, 2024న రూ.7లక్షలు, కావేరి సంఘానికి జూలై11, 2024న రూ.4.5 లక్షలు, ప్రశాంతి సంఘానికి జూలై13, 2024న రూ.2.3 లక్షలు, మస్తాన్‌బీ సంఘానికి రూ.2.4లక్షల బ్యాంకు లింకేజీ రుణాలను గోవిందపల్లెలోని ఓబ్యాంకులో మంజూరు చేశారు. పొదుపు మహిళలు ప్రతినెలా తమ రుణాలకు చెందిన నెలవారీ వాయిదాలను వారే నేరుగా బ్యాంకుకు వెళ్లి జమ చేయాల్సి ఉంది. కాగా వీరు వీవోఏ మధుపై ఆధారపడడంతో అవినీతికి పునాది పడింది. ప్రతినెల నగదును వీవోఏకు ఇచ్చేవారు. పొదుపు మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న అతడు ఆ నగదును బ్యాంకులో జమ చేయలేదు.

బురిడీ కొట్టించిన వీవోఏ..

ఇసుకపల్లెలోని ఇందిరా గ్రామైక్య సంఘంలో 26 పొదుపు సంఘాలున్నాయి. వీటిలో నాలుగు సంఘాలకు చెందిన పొదుపు మహిళలను వీవోఏ మధు బురిడీ కొట్టించాడు. ప్రతినెల రుణాల కంతుల స్థానంలో నామమాత్రపు వడ్డీ చెల్లిస్తూ మహిళలకు అనుమానం రాకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఇందుకు బ్యాంకు సిబ్బంది సైతం సహకరించి ఉంటారని మహిళలు ఆరోపిస్తున్నారు.

అధికారుల సాక్షిగా పంచాయితీ

వీవోఏ వ్యవహారంపై శిరివెళ్ల పొదుపు కార్యాలయంలో పంచాయితీ నిర్వహించిన ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. మహిళలు రుణాలు తీసుకున్న మొదటి రెండు నెలల నుంచే స్వాహాపర్వం మొదలైనట్లు తెలుస్తోంది. ఈఏడాది మార్చిలో విషయం బట్టబయలు కావడంతో పొదుపు మహిళలు వీవోఏ మధును నిలదీసి శిరివెళ్లలోని వెలుగు కార్యాలయానికి తీసుకొచ్చి అధికారుల సాక్షిగా పంచాయితీ చేశారు. రూ.16.2 లక్షల నిధులను వాడుకున్నానని, 2026, ఏప్రిల్‌ 30వ తేదీ లోపు పూర్తిగా చెల్లిస్తానని వీవోఏ రాతపూర్వకంగా పత్రం రాసిచ్చాడు. మొదటి నెలలో రూ.2లక్షలు, రెండో నెలలో రూ.9లక్షలు(మొత్తం రూ.11 లక్షలు) పొదుపు సంఘాల రుణాల ఖాతాలకు జమ చేశాడు, ఆతర్వాత మిగిలిన మొత్తం రూ.5.2 లక్షలు, వడ్డీ చెల్లించకపోవడంతో పొదుపు మహిళలు ఇటీవలే కలెక్టర్‌ను ఆశ్రయించారు. వెలుగు కార్యాలయంలో మళ్లీ పంచాయితీ పెట్టారు. అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.7లక్షల మేర బకాయి ఉందని.. సంఘాల రుణం చెల్లింపు చివరి తేదీ నాటికి సదరు మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించాలని అధికారులు పంచాయితీ చేసి ముగించారు.

చట్టపరమైన చర్యలకు ఆదేశించాం

అవినీతికి పాల్పడిన వీవోఏపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి, సీఐఎఫ్‌ రుణాల మంజూరు, రికవరీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని అధికారులు, సిబ్బందికి సూచించాం. పొదుపు సంఘాల్లో అవినీ సహించేది లేదు. - శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ, నంద్యాల

Updated Date - Sep 27 , 2026 | 12:14 AM