జలహారతికి రూ.6.66 కోట్లు
ABN , Publish Date - May 20 , 2026 | 12:01 AM
‘జలధార.. జలహారతి’ పేరుతో వంద రోజుల మిషన్‌ను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీనికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి.. నీటి సంరక్షణకు నడుం బిగించింది. జిల్లాలో యేటా జరిగే ఉపాధి పనులు తప్ప.. వర్షపు నీరు చేయడానికి అవకాశం ఉన్న చెరువుల్లో పూడికతీత పనులు ముందుకు సాగడం లేదు
డీఎంఎఫ్ నిధుల కోసం ప్రతిపాదనలు
పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం కోసం ప్రయత్నాలు
ఉపాధి కూలీలతో మట్టి పనులు
కర్నూలు, మే 19 (ఆంధ్రజ్యోతి): ‘జలధార.. జలహారతి’ పేరుతో వంద రోజుల మిషన్‌ను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీనికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి.. నీటి సంరక్షణకు నడుం బిగించింది. జిల్లాలో యేటా జరిగే ఉపాధి పనులు తప్ప.. వర్షపు నీరు చేయడానికి అవకాశం ఉన్న చెరువుల్లో పూడికతీత పనులు ముందుకు సాగడం లేదు. ఈ పనులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. దీంతో ప్రజా ప్రతినిధులు, సాగునీటి సంఘాల భాగస్వామ్యం కొరవడింది. అయితే.. జిల్లాలో జలధార.. జలహారతి సక్సెస్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి కృషి చేస్తున్నారు. జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) నిధులు రూ.6.66 కోట్లు మంజూరు చేయనున్నారు. పారిశ్రామికవేత్తలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, సాగునీటి సంఘాల నాయకులను జల సంరక్షణలో భాగం చేయబోతున్నారు. జిల్లాలో ‘జలధార.. జల హారతి’ పురోగతి తీరుపై ఆంధ్రజ్యోతి కథనం.
జిల్లాలో జలధార.. జలహారతి కార్యక్రమం ద్వారా పాత సాగునీటి వ్యవస్థకు కొత్త జీవం పోయాలనే లక్ష్యంతో వంద రోజుల మిషన్ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకంతో పాటు వివిధ వనరుల సద్వినియోగం, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో సీఎం చంద్రబాబు లక్ష్యాలకు అనుగుణంగా నీటి సంరక్షణకు కలెక్టర్ డాక్టర్ సిరి కృషి చేస్తున్నారు. 246 మైనర్ ఇరిగేషన్ చెరువు పునరుద్ధరణ, 181 ఫీడర్ ఛానల్స్, 148 చెరువుల్లో పూడికతీత ద్వారా నీటి నిల్వ సామర్థ్యం రెట్టింపు చేయాలన్నది లక్ష్యం. వరదొస్తే గండ్లు పడకుండా 86 చెరువుల గట్లు బలోపేతం, 48 తూములు, 37 అలుగులు మరమ్మతులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పాత సాగునీటి వ్యవస్థకు కొత్త జీవం.. సాగునీటి సంఘాల బాధ్యత నినాదంతో రైతులను, సాగునీటి సంఘాల నాయకులను భాగస్వామ్యం చేయలని కూటమి ప్రభుత్వం ఆశయం. అయితే.. ప్రత్యేక నిధులు లేకపోవడం వల్ల మెజార్టీ గ్రామాల్లో సాగునీటి సంఘాల నాయకుల భాగస్వామ్యం కొరవడింది. ప్రతి ఏటిలాగే ఉపాధి కూలీలతో జంగిల్ క్లియరెన్స్, వాగులు, వంకలు, ఫీడర్స్ ఛానల్స్‌లో మట్టి పనులు మాత్రమే చేస్తున్నారు. జిల్లాలో ఎంఐ, పీఆర్ చెరువుల నీటి నిల్వ సామర్థ్యం 4.411 టీఎంసీలు. ఎక్కడికక్కడ పూడిక, ముళ్లకంపలతో నిండిపోవడం, చెరువుల్లోకి వర్షపు నీటిని మళ్లించే ఫీడర్స్ ఛానల్స్ సక్రమంగా లేకపోవడంతో చెరువుల సామర్థ్యం సగానికి పైగా తగ్గిపోయిందని ఇంజనీర్ల అంచనా.
రూ.6.66 కోట్లకు ప్రతిపాదన
భూగర్భ జలాలు పెరగాలంటే చెరువులు వర్షపు నీటితో కళకళలాడాలి. మెజార్టీ చెరువుల్లో ఆ పరిస్థితి లేదు. ఉపాధి హామీ కూలీలతో పూడికతీత పనులు చేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచడం అసాధ్యమని ఇంజనీర్లే అంటున్నారు. ఒకవేళ కూలీలతో పూడికతీత పనులు చేపట్టినా.. చెరువు మధ్యలో గుంతలు తీసి మట్టిని ఆ పక్కనే (చెరువు నీటి నిల్వ ప్రాంతం) వేస్తున్నారు. ఎక్స్‌కవేటర్లతో పూడికతీత చేపడితే తప్ప.. ఆ మట్టిని గట్టు అవతలకు తరలించలేని పరిస్థితి. దీంతో కలెక్టర్ డాక్టర్ సిరి జిల్లా మినరల్ ఫండ్ (డీఎ్‌ఫఎం) ద్వారా యంత్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయమని జలవనరుల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. జిల్లాలో 80 చెరువుల్లో 14,553 గంటలు పూడికతీతకు 124 యంత్రాలు ఏర్పాటు చేసేందుకు రూ.6.66 కోట్లు నిధులు అవసరమని ఇరిగేషన్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి కలెక్టర్‌కు నివేదిక పంపారు. ఈ నిధులు వస్తే తప్ప జలధార.. జలహారతి పనుల్లో పురోగతి కనిపించేలా లేదు. చెరువుల మరమ్మతులకు సంబంధించిన 300 పనులకు ఉపాధి హామీ పథకంలో భాగంగా మెటీరియల్ కాంపొనెంట్ నిధులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.
పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం
జిల్లాలో జల సంరక్షణ పనుల్లో గ్రీన్‌కో, జైరాజ్ ఇస్పాత్, జియో మైసూర్.. వంటి పరిశ్రమలను భాగం చేయడానికి కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో సోలార్, విండ్ పవర్ యూనిట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అదే క్రమంలో ఓర్వకల్లు మండలంలో పలు పరిశ్రమలు ఏర్పాటుకు శంకుస్థాపనలు చేశారు. ఇప్పటికే ప్రారంభమైన పరిశ్రమల యాజమాన్యానికి ఒక్కొ చెరువును దత్తత తీసుకునే ప్రోత్సహిస్తే జల సంరక్షణలో జిల్లాను అగ్రస్థానంలో ఉంచేందుకు అవకాశం ఉంది.
ఎంపీ, ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలి
సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం జల సంరక్షణకు శ్రీకారం చుట్టింది. జలధార.. జలహారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జీలు, సహా సాగునీటి సంఘాలు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్లు, పాలకవర్గాలను భాగస్వామ్యం చేయాలి.
ప్రభుత్వం నిధులు ఇస్తే.. పనులు తాము సిఫార్సు చేసిన కాంట్రాక్టర్‌కే అప్పగించాలంటూ అధికారులపై ఒత్తిడి తేకుండా కీలక ప్రజాప్రతినిధులందరూ తమ స్థోమతను బట్టి రెండు మూడు చెరువులను దత్తతకు తీసుకోవాలి.. 10-20 రోజులు ఎక్స్‌కవేటర్లు స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తే, జిల్లా యంత్రాంగం డీజిల్ సమకూరుస్తుంది. రాబోయే వానాకాలంలో జలాశయాలు, చెరువుల్లో 11-12 టీఎంసీలు నిల్వ చేసే అవకాశం ఏర్పడుతుంది. భూగర్భ జలాలు రెండు మూడు మీటర్లు పెరిగే అవకాశం ఉందని జలవనరుల నిపుణులు అంటున్నారు. జలధార.. జలహారతి కార్యక్రమంలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఏమేరకు భాగస్వామ్యం అవుతారో వేచి చూడాల్సిందే.
1380 పనులు మొదలయ్యాయి
జలధార.. జల హారతి పథకంలో భాగంగా కింద జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి 2,600 పనులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు 1,380 పనులు ప్రారంభించాం. ప్రతి రోజు 85-90 వేల మంది కూలీలు మట్టి పనులు, జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు. చెరువుల్లో పూడికతీత పనులు ఆశించిన స్థాయిలో మొదలు కాలేదు. డీఎంఎఫ్ నిధులతో 80 చెరువుల్లో పూడికతీత పనులకు కలెక్టర్ కసరత్తు చేస్తున్నారు. - నరసింహారెడ్డి, డ్వామా పీడీ, కర్నూలు