Share News

‘గురురాఘవేంద్ర’కు రూ.4.40 కోట్లు

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:46 AM

గురురాఘవేంద్ర ప్రాజెక్టు (జీఆర్‌పీ) ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

‘గురురాఘవేంద్ర’కు రూ.4.40 కోట్లు
మాధవరం స్టేజ్‌-1 పంప్‌హౌస్‌

కర్నూలు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): గురురాఘవేంద్ర ప్రాజెక్టు (జీఆర్‌పీ) ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ ఎం) కోసం రూ.4.40 కోట్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు భారీగా నిధులు ఇస్తున్నా.. జిల్లాలో అసంపూర్తి పనులకు మొండిచేయి చూపడం విమర్శలకు తావిస్తోంది. వడ్డెర్లకు క్వారీ లీజుల్లో ప్రాధాన్యత, లీజు మొత్తంలో 50 శాతం రాయతీ ఇవ్వనుంది. ఓర్వకల్లు మండలం శకునాలలో ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు 737.66 ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు కేటాయిస్తూ.. బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జీఆర్‌పీకి ఊపిరి

మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో వివిధ గ్రామాలకు తుంగభద్ర వరద జలాలు ఎత్తిపోసి ఎల్లెల్సీ చివరి ఆయ కట్టుకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపో తల పథకాలు నిర్మించారు. మూగలదొడ్డి, బలసదొడ్డి, పులచింత, మాధ వరం, చిలకలడోణ, సోగనూరు, దుద్ది ఎత్తిపోతల పథకాలు ద్వారా టీబీపీ ఎల్లెల్సీ గ్యాప్‌ ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వీటి నిర్వహణకు ఐదేళ్లు ఆపరేషన్‌ అండ్‌ మెయింటె నెన్స్‌ (ఓ అండ్‌ ఎం) కింద ఒక్కపైసా ఇవ్వలేదు. ఆపరేటర్లు, కాపలా సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు. ఫలితంగా పలు ఎత్తిపోతల పథకాల్లో దొంగలు పడ్డారు. పంపులు, ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి కాపర్‌ వైరు, అయిల్‌ దోచుకెళ్లారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం) కింద ఐదేళ్లకు రూ.17.05 కోట్లు ఇవ్వాలని 2024 నవంబరు 1న రాష్ట్ర జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపించారు. మరమ్మతులు, ఓ అండ్‌ ఎం ప్రతిపాదనలు వేరువేరుగా పంపించాలని కొర్రీ పెట్టి వెనక్కి పంపడంతో గత జూలై నుంచి అమలులోకి వచ్చిన 2025-26 ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లతో మరోసారి ప్రతిపాదనలు పంపించారు. అయితే.. 2025-26 సంవత్సరానికి రూ.4.40 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌కు 737.66 ఎకరాలు

జిల్లాలో వెయ్యి మెగా వాట్లు (1,000 ఎండబ్ల్యూ) సోలార్‌ పవర్‌ ఉత్పత్తి లక్ష్యంగా కర్నూలు అలా్ట్ర మెగా సోలార్‌ పార్క్‌ స్థాపనకు ఓర్వకల్లు మండలం శకునాలు గ్రామంలో ఎల్‌పీఎం నంబరు.561, 614లో 737.66 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ భూమి మార్కెట్‌ విలువ ఎకరం రూ.2 లక్షలు నిర్ణయించి, అందులో పది శాతం రూ.20 వేలు ఎకరాకు లీజు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి పది శాతం లీజు మొత్తం పెంచేలా ఆమోదం తెలిపింది.

వడ్డెర్లకు తీపి కబరు

వడ్డెర్లకు క్వారీల లీజులు కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ప్రీమియం మొత్తం, సీనరేజీ ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదించింది. కూటమి ప్రభుత్వం 2025 మైనర్‌ మినరల్‌ పాలసీలో పాత పద్ధతిని మళ్లీ తీసుకొచ్చింది. దీనిద్వారా 15 శాతం క్వారీలను వడ్డెర సంఘాలకు కేటాయిస్తారు. మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయం వల్ల జిల్లాలో వడ్డెర సంఘాల్లో సభ్యులుగా సుమారు 25 వేల కుటుంబాలకు పైగా జీవనోపాధి లభిస్తుందని అంచనా. ఒక్కొ సొసైటీకి గరిష్ఠంగా 12 హెక్టార్లు కేటాయిస్తారు. కూటమి ప్రభుత్వం రూ.3,800 కోట్లతో కర్నూలు జిల్లా మాల్యాల నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వరకు హంద్రీనీవా ప్రధాన కాలువ, పుంగనూరు, కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ విస్తరణ, సీసీ లైనింగ్‌ చేపట్టి రికార్డు స్థాయిల పూర్తి చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 52 టీఎంసీలు ఎత్తిపోశారు. హంద్రీనీవా ప్రాజెక్టు ఫేజ్‌-1లో భాగంగా అనంతపురం జిల్లాలో ప్యాకేజీ-36ఏలో అసంపూర్తి పనులు, 188.200 కిలోమీటరు వద్ద ఫీడర్‌ ఛానల్‌ తవ్వకం, ఆఫ్‌ టేక్‌ స్లూయిస్‌ నిర్మాణానికి రూ.606.03 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శ్రీసత్యసాయి జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్టు ఫేజ్‌-2లో భాగంగా పుంగనూరు బ్రాంచి కెనాల్‌ 0/00 నుంచి 22/200 కి.మీల వరకు, చెర్లోపల్లి రిజర్వాయర్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌ పనులకు గతంలో ఇచ్చిన రూ.112.40 కోట్లను రూ.169.80 కోట్లకు పెంచుతూ ఆమోదించారు. ఇప్పటికే హంద్రీనీవా ప్రాజెక్టు ఫేజ్‌-2 కింద అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కాలువ ఆధునికీకరణకు రూ.1,184.50 కోట్లు నాబార్డు నిధులు మంజూరు చేస్తూ ఈ నెల 25న జీవో నంబరు.154 జారీ చేశారు. తాజాగా అసంపూర్తి పనులకు కూడా భారీగా నిధులు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే పత్తికొండ జలాశయం పరిధిలోని కుడి, ఎడమ కాలువల అసంపూర్తి పనులకు మొండి చేయి చూపింది.

Updated Date - Mar 27 , 2026 | 12:46 AM