Share News

జిల్లాకు రూ.25వేల కోట్లు కేటాయించాలి

ABN , Publish Date - Aug 17 , 2026 | 11:06 PM

నంద్యాల జిల్లాకు రూ.25 వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్‌ చేశారు.

జిల్లాకు రూ.25వేల కోట్లు కేటాయించాలి
ర్యాలీ చేస్తున్న సీపీఐ నాయకులు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య

నంద్యాల నూనెపల్లి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాకు రూ.25 వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. నాయకులు మాట్లాడుతూ.. దేశంలో మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల కాలంలో ప్రజలకు ఏమీ చేయలేదని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. జిల్లా కేంద్రంలో సీడ్‌ హబ్‌ ఏర్పాటు చేయాలని, అలగనూరు రిజర్వాయర్‌కు మరమ్మతులు చేయించి నీళ్లు వదిలి ప్రజలను ఆదుకోవాలని కోరారు. కరోనా సందర్భంగా రద్దు చేసిన రైళ్లను తిరిగి పునరుద్ధరించాలన్నారు. జిల్లాలో శ్మశాన వాటికలకు ఐదెకరాల చొప్పున భూమిని ప్రభుత్వం కేటాయించాలన్నారు. డోన్‌, ప్యాపిలి, బేతంచర్ల, కొత్తపల్లి, గడివేముల, మిడుతూరును కరవు మండలాలుగా ప్రకటించి బ్యాంకు రుణాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. డోన్‌ నియోజకవర్గంలో హంద్రీ-నీవా కాలువ ద్వారా చెరువులు నింపాలని, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్లను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. బనగానపల్లె నియోజకవర్గంలో సిమెంట్‌ పరిశ్రమ, పవర్‌గ్రిడ్‌, సోలార్‌ పరిశ్రమల్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. అనంతరం జిల్లా ప్రత్యేక అధికారికి వినతిపత్రం అందజేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్‌, పట్టణ కార్యదర్శి ప్రసాద్‌, కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, రమేశ్‌, భార్గవ్‌, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీదేవి, రజిత, సుశీలమ్మ, ఏఐటీయూసీ నాయకులు ధనుంజయుడు, శ్రీనివవాసులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 11:06 PM