Share News

బార్‌లో రౌడీషీటర్‌ వీరంగం

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:39 AM

పట్టణంలోని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ బార్‌లో శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది.

బార్‌లో రౌడీషీటర్‌ వీరంగం
గాయపడిన యువకుడు

ముగ్గురు యువకులపై బీర్‌ బాటిల్‌తో దాడి.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు

సోషల్‌ మీడియాలో వీడియో హల్‌చల్‌

నంద్యాల క్రైమ్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ బార్‌లో శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. రౌడీషీటర్‌ ఇమ్రాన్‌ తన ప్రాంతంలోని బార్‌కు వచ్చి మద్యం తాగున్నారంటూ ముగ్గురు యువకులతో వాగ్వాదానికి దిగి, వారిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘనటలో హరిజనపేటకు చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం... హరిజనపేటకు చెందిన దేవా, అతని స్నేహితులు రాజు, మల్లి ఈనెల 8న శనివారం రాత్రి బార్‌కు వెళ్లిన సమయంలో వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన రౌడీషీటర్‌ ఇమ్రాన్‌ వారితో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. తన ఏరియాలో ఉన్న బార్‌కు వచ్చి మద్యం ఎలా తాగుతారని ప్రశ్నిస్తూ పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. అనంతరం బీర్‌ బాటిల్‌తో కూడా దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దాడిలో దేవా, రాజు, మల్లికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. బార్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రస్తుతం సీసీ ఫుటేజీపై చర్చ జరుగుతోంది.

కేసు సెక్షన్‌పై బాధితుల అభ్యంతరం

ఘటనపై వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే దాడి తీవ్రతకు అనుగుణంగా కేసులో సెక్షన్లు నమోదు చేయలేదని బాధిత వర్గం ఆరోపిస్తోంది. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతున్నప్పటికీ కేవలం దాడికి సంబంధించిన సెక్షన్‌ నమోదు చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక వివరణ తెలియాల్సి ఉంది. సీసీ కెమెరా ఫుటేజీ, గాయపడిన వారి వైద్య నివేదికలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, తదితర అంశాలను పరిశీలించిన అనంతరం కేసులో వర్తించే సెక్షన్లపై పోలీసులు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - Aug 13 , 2026 | 12:39 AM