Share News

పకడ్బందీగా పింఛన్ల ధ్రువీకరణ

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:50 PM

పింఛన్ల మంజూరులో ప్రభుత్వం నిర్దేశించిన ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

పకడ్బందీగా పింఛన్ల ధ్రువీకరణ
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : పింఛన్ల మంజూరులో ప్రభుత్వం నిర్దేశించిన ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం పింఛర్ల అర్హతలు, దరఖాస్తుల పరిశీలనపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీడీవోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండటం, నెలకు సగటున 300 యూనిట్లకు మించి విద్యుత్‌ వినియోగం ఉండటం, నిర్ణీత పరిమితికి మించి వ్యవసాయ భూమి ఉండటం, పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగులకు మించి ఆస్తి ఉండటం, కుటుంబంలో ఆదాయ పన్ను చెల్లించేవారు ఉండటం, నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండటం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించి అర్హతను నిర్ధారించాలన్నారు. కేవలం వేర్వేరు రైస్‌ కార్డులున్నాయనే కారణంతో ప్రత్యేక కుటుంబంగా పరిగణించి పింఛన్‌ మంజూరు చేయరాదని, హౌస్‌హోల్డ్‌ ఆధారంగా అర్హతను పరిశీలించాలని అన్నారు. ఈ సమావేశంలో అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

జిల్లాలో జలధార - జలహారతి పథకం కింద చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు, ఎల్‌నినో ప్రభావంతో ఉపాధి హామీ శ్రామికులకు విస్తృతంగా పనులు కల్పించి వేజ్‌ కాంపోనెంట్‌ను పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జలధార-జలహారతి పథకం కింద జిల్లాలో గుర్తించిన 1,084 పనుల్లో 1,005 పనులకు ఇప్పటికే మంజూరులు జారీ చేశామన్నారు. ఇప్పటివరకు జియోట్యాగింగ్‌ ద్వారా 337 పనులు పూర్యయ్యాయని, మిగిలిన 688 పనులను కూడా పూర్తి చేయాలని అన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 11:50 PM