అర్ధరాత్రి దుండగుల హల్‌చల్
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:33 PM
అప్పుడు సమయం అర్థరాత్రి 1.15 - 2 గంటలు. కర్నూలు నుంచి ఆదోనికి బయలుదేరిన రెండు కార్లను రోడ్డు పక్క నుంచి గుర్తు తెలియని ముగ్గురు దుండగులు ఒక్కసారిగా ఆపే ప్రయత్నం చేశారు. కారు డ్రైవర్లు ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించగా.. కర్రలతో కారుపై దాడికి దిగారు. మోటర్ బైక్‌పై వెంబడించి కార్లను దాటుకొని ముందుకు వెళ్లి రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి ఆపే ప్రయత్నించారు.
గోనెగండ్ల వద్ద రాళ్లతో వాహనాలపై దాడికి యత్నం
మోటర్ బైక్‌పై వెంబడించిన వైనం
వాహనాల్లో ఆదోని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్, ప్రముఖ వ్యాపారులు
100కు ఫోన్ చేసినా స్పందన అంతంతే
గంజాయి, డ్రగ్ మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా..?
కర్నూలు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అప్పుడు సమయం అర్థరాత్రి 1.15 - 2 గంటలు. కర్నూలు నుంచి ఆదోనికి బయలుదేరిన రెండు కార్లను రోడ్డు పక్క నుంచి గుర్తు తెలియని ముగ్గురు దుండగులు ఒక్కసారిగా ఆపే ప్రయత్నం చేశారు. కారు డ్రైవర్లు ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించగా.. కర్రలతో కారుపై దాడికి దిగారు. మోటర్ బైక్‌పై వెంబడించి కార్లను దాటుకొని ముందుకు వెళ్లి రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి ఆపే ప్రయత్నించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదోని పురపాలక సంఘం మాజీ చైర్‌పర్సన్ అరుణాదేవి, ఆమె భర్త ప్రముఖ కాంట్రాక్టర్ వాసుబాబు సహా ప్రముఖ వ్యాపారి రమణ దంపతులు, రైస్‌మిల్ యజమాని సురేశ్ దంపతులు కర్నూలు నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. రాత్రి 11.30 గంటల సమయంలో రెండు కార్లలో కర్నూలు నుంచి ఆదోనికి బయలుదేరారు. వారి వాహనాలు సుమారుగా 1.15- 2 గంటల సమయంలో గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు బస్టాప్ దగ్గరకు చేరుకున్నాయి. వేగంగా వెళ్తున్న వాహనాలపై ఒక్కసారిగా ముగ్గురు యువకులు అడ్డంగా వచ్చారు. ముందు వెళ్తున్న రైస్ మిల్ ఓనర్ వాహనాన్ని అపేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్నారేమో..! అనుకొని వారిని తప్పించుకుని వెళ్లగా రాళ్లు, కర్రలతో దాడికి దిగడంతో వేగంగా ముందుకు వెళ్లారు. ఆ వెంటనే ఆ దుండగులు వెనకాల వస్తున్న మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఆరుణదేవి, ఆమె భర్త వాసుబాబు వాహనంపై దాడికి దిగారు. వారు కూడా వాళ్లను అతికష్టంపై తప్పించుకొని ముందుకు వెళ్లారు. అంతటితో ఆగని ఆ దుండగులు మోటర్‌బైక్ వెంబడించారు. వారి వాహనాలను దాటుకొని వేగంగా ముందుకు వెళ్లి, గంజేహల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డుకు అడ్డంగా పెద్దపెద్ద రాళ్లు పెట్టి ఆ వాహనాలను ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికే వాహనంలో ఉన్న చైర్‌పర్సన్ అరుణాదేవి భర్త వాసుబాబు 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే గోనెగండ్ల పోలీస్ స్టేషన్ వారు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే.. పెట్రోల్ బంక్ వద్ద కూడా వారిని తప్పించుకొని వెళ్తుండగా కార్లపై పెద్దపెద్ద రాళ్లతో దాడికి ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా మోటర్ బైక్‌పై ఎమ్మిగనూరు వరకు వెంబడించారు. మళ్లీ 100కి ఫోన్ చేయగా.. మీరు అక్కడే ఆగండి.. అక్కడికే వస్తామని వెటకారంగా సమాధానం ఇచ్చారని, 100 సిబ్బంది చెప్పినట్లు కారు ఆపితే వెనకాల వెండించే దుండగులు తమపై దాడి చేయరా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ యువకులను కారు అద్దాలలో నుంచి పరిశీలించగా చింపిరి జుత్తుతో ఉన్నారని, బాగా మత్తులో ఉన్నట్లు అర్థమైందని వివరించారు. ఉదయాన్నే గోనెగండ్ల సీఐ చంద్రబాబుకు ఫోన్ చేసి అర్థరాత్రి జరిగిన ఘటన వివరించామని వాసుబాబు ఆంధ్రజ్యోతికి తెలిపారు.
సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నాం
కర్నూలు నుంచి ఆదోనికి వెళ్తున్న రెండు కార్లపై అర్థరాత్రి దుండగులు దాడులకు ప్రయత్నించారు. బాధితులు చెప్పిన సమాచారం మేరకు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నాం. గోనేగండ్ల ప్రాజెక్టు నుంచి ఎమ్మిగనూరుకు తాగునీటి పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. ఆ పనుల కోసం వచ్చిన ఇతర ప్రాంతానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే ఆ కోణంలో కూడా విచారిస్తున్నాం. రాత్రి పూట ప్రధాన రహదారిపై పెట్రోలింగ్ పెంచుతాం. - చంద్రబాబు, సీఐ, గోనెగండ్ల